రహస్య పాలనపై రచ్చరచ్చ!
రహస్య పాలన ఎంత ప్రమాదకరమో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రజలకు శనివారం స్పష్టంగా అవగతమైంది. ఇలాంటి పరిపాలన ఎంత గందరగోళానికి దారి తీస్తుందో తెలిసి వచ్చింది.
ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపుపై ఫేక్ జీవో
సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్
ఉద్యోగులు, నిరుద్యోగుల్లో గందరగోళం
చివరికి ఖండించిన ప్రభుత్వం
జీవోలన్నీ రహస్యంగా ఉంచడంతో సమస్యలెన్నో..
ఈనాడు, అమరావతి: రహస్య పాలన ఎంత ప్రమాదకరమో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రజలకు శనివారం స్పష్టంగా అవగతమైంది. ఇలాంటి పరిపాలన ఎంత గందరగోళానికి దారి తీస్తుందో తెలిసి వచ్చింది. చివరకు ప్రభుత్వమూ కంగారు పడాల్సి వచ్చింది. నిజం నిద్ర లేచేసరికి అబద్ధం ఊరు చుట్టి వస్తుందని సామెత. ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపుపై సామాజిక మాధ్యమాల్లో వ్యాపించిన ఫేక్ జీవో ఇలాంటి పరిస్థితులనే సృష్టించింది. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా.. ఏ ఉత్తర్వులిచ్చినా అందులో పారదర్శకత, ప్రజాప్రయోజనాలు ఇమిడి ఉండాలి. దీనికి భిన్నంగా రాష్ట్రంలో ఇటీవల రహస్య పాలన కొనసాగుతోంది. జగన్ సర్కారు ఏం చేస్తుందో ఎవరికీ తెలియదు. ప్రభుత్వం ఏ రోజు ఏ ఉత్తర్వులిస్తుందో బయటపెట్టరు. 2008 నుంచి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న జీవోఐఆర్ వెబ్‌సైట్‌ను జగన్ సర్కారు మూసేసి పారదర్శకతకు పాతరేసిందనే విమర్శలను ఎదుర్కొంటూనే ఉంది. దాని బదులు ఏపీ ఈ గెజిట్ వెబ్‌సైట్‌ను ప్రభుత్వం ప్రారంభించింది. ఎప్పుడో వెలువరించిన జీవోలను అనేక రోజులు గడిచాక ఈ వెబ్‌సైట్‌లో ఉంచుతోంది. ఇలాంటి అస్తవ్యస్త పరిస్థితులు కొనసాగుతుండటంతో శనివారం పెద్ద గందరగోళమే ఏర్పడింది.
పదవీ విరమణ వయసు 65 ఏళ్లకు పెంచారట..!
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 65 ఏళ్లకు పెంచుతున్నట్లు శనివారం సామాజిక మాధ్యమాల్లో ఒక జీవో రూపంలో ప్రచారమైంది. రాష్ట్ర ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్.రావత్ జనవరి 28న ఈ మేరకు ఉత్తర్వులిచ్చినట్లు ఇందులో ఉంది. 2023 జనవరి ఒకటి నుంచి ఉత్తర్వులు అమల్లోకి వచ్చాయని, పదవీ విరమణ వయసు పెంపునకు ప్రభుత్వం ఆర్డినెన్సు ఇచ్చిందని ఇందులో ప్రస్తావించారు. ఇది ఉద్యోగుల్లో గందరగోళం సృష్టించింది. లోతుగా పరిశీలిస్తే రెండు కారణాలవల్ల అయోమయ పరిస్థితులు ఏర్పడినట్లు స్పష్టమవుతోంది.
* పారదర్శకంగా ఉన్న జీవోఐఆర్ (గవర్నమెంటు ఆర్డర్స్ ఇన్ఫర్మేషన్ రిజిష్టర్) వెబ్‌సైట్ స్థానంలో.. వైకాపా ప్రభుత్వం వచ్చాక ప్రారంభించిన ఏపీ ఈ గెజిట్ వెబ్‌సైట్‌లో జీవోలన్నింటినీ బయటపెట్టడం లేదు. కేవలం కొన్నింటినే ఉంచడంతో నిజంగానే సర్కారు ఈ జీవో ఇచ్చిందేమోనని అనుమానించాల్సి వచ్చింది. కొన్ని జీవోలు ఏపీ ఈ గెజిట్‌లోకి రాకముందే సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమైన అనుభవాలు ఉండటం ఈ అనుమానాలకు బలం చేకూర్చింది.
* ఈ ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉండటంతో కొద్ది కాలంపాటు పదవీ విరమణ ప్రయోజనాలు చెల్లించే భారం తప్పుతుందనే ఎత్తుగడగా అప్పట్లో దీన్ని అభివర్ణించారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు ప్రతి నెలా ఒకటిన ఇవ్వలేకపోతోంది. పదవీ విరమణ ప్రయోజనాలను సకాలంలో చెల్లించడమూ గగనమవుతోంది. రాష్ట్రంలోని అస్తవ్యస్త ఆర్థిక పరిస్థితులతో ఇబ్బంది పడుతున్న ఉద్యోగులు మళ్లీ పదవీ విరమణ వయసు పెంచేశారేమోనని కంగారుపడ్డారు.
ఎన్నెన్నో మార్పులు
2008లోని జీవోఐఆర్ వెబ్‌సైట్ అందుబాటులోకి రాకముందు ప్రభుత్వంలోని ప్రతి శాఖ.. జీవోల విడుదలకు మాన్యువల్‌గా మూడు రకాల రిజిష్టర్లు నిర్వహించేది. 1. జీవోఎంఎస్ అంటే పాలన, విధానపరమైన, దీర్ఘకాలం అమల్లో ఉండే ఉత్తర్వులిచ్చేవారు. 2. నిర్దుష్ట కాలపరిమితి ఉండే ఉత్తర్వులకు జీవోఆర్‌టీ పేరుతో రిజిష్టర్ నిర్వహించేవారు. 3. జీవో పి పేరుతో రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయాలను కొన్నింటిని వెలువరించేవారు. ప్రభుత్వ ఉత్తర్వు తయారీకి రాష్ట్ర సచివాలయంలోని 33 ప్రభుత్వ శాఖలు ఒకే విధానం అనుసరిస్తాయి. జీవోకు సంబంధించిన నోట్ ఫైల్ ముందు సిద్ధమవుతుంది. దానిపై సంబంధిత ప్రభుత్వశాఖ కార్యదర్శి, మంత్రి, ముఖ్యమంత్రి నిర్ణయాలు, సంతకాలుంటాయి. ఆ నిర్ణయాల మాన్యువల్ ప్రతిని సంబంధిత రిజిష్టర్‌లో నమోదు చేసి సీరియల్ నంబరు కేటాయిస్తారు. జీవోపై అదే నంబరు వేసి ఆర్డర్ కాపీని సంబంధిత శాఖలు, అమలు చేసే ఏజెన్సీలకు పంపేవారు. ఆర్డర్ కాపీని స్టాక్‌ఫైల్ రూపంలో భద్రపరిచేవారు. వ్యయప్రయాసలతో గతంలో ప్రభుత్వ ఉత్తర్వులు సిద్ధమయ్యేవి. ఏ జీవో ఎప్పుడు? ఎందుకోసం ఇచ్చారో తెలుసుకోవడమూ కష్టమయ్యేది. రికార్డులు దొరికేవి కావు. చెదలు పట్టేవి. కాలిపోయిన సందర్భాలూ ఉన్నాయి.
డిజిటల్‌లోకి వచ్చాక మార్పులు
2005లో సమాచార హక్కు చట్టం వచ్చాక పెరిగిన సాంకేతికతను అందిపుచ్చుకుని అంతకుముందు మాన్యువల్ రూపంలో చేసిన పనిని డిజిటలైజ్ చేశారు. ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లో జీవోలను ఉంచి ప్రజలకు సౌకర్యం కల్పించారు. జగన్ సర్కారు వచ్చాక పారదర్శకంగా ఉన్న జీవోఐఆర్ వెబ్‌సైట్‌ను మూసేసింది. మాన్యువల్ రిజిష్టర్‌లో నమోదు విధానాన్ని పునరుద్ధరించింది. జీవోల విడుదలకు సంబంధించి కొత్త ఉత్తర్వులిచ్చింది. టాప్ సీక్రెట్, సీక్రెట్, కాన్ఫిడెన్షియల్, రొటీన్ నేచర్ అని వర్గీకరించింది. తొలి మూడు రకాల జీవోలను బహిర్గతం చేయబోమని పేర్కొంది. నాలుగో రకం జీవో విడుదలైన వారానికి ఏపీ ఈ గెజిట్ వెబ్‌సైట్‌లో ఉంచుతామని వెల్లడించింది. దీంతో మొత్తం జీవోల్లో కేవలం 7.3 శాతమే ఏపీ ఈ గెజిట్‌కు చేరుతున్నాయి.
ఫేక్ జీవోపై ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే ఉద్యోగ సంఘం నేత ఒకరు వివరణ ఇస్తూ.. పోస్టింగులు పెట్టారు. ప్రభుత్వం అధికారికంగా జీవోలను అందుబాటులో ఉంచకపోతే ఇలా నకిలీ ఉత్తర్వులను రూపొందించి కొందరు వర్తింపజేసుకునేందుకు అవకాశముంటుందని సచివాలయ అధికారులే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒరిజినల్ జీవోలోనూ మార్పులు చేసే ప్రమాదమూ ఉందని భావిస్తున్నారు.
ఫేక్ జీవోపై కేసు నమోదు: తప్పుడు జీవోను సృష్టించి ప్రచారం చేసిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్.రావత్ ప్రకటనలో తెలిపారు. ఫేక్ జీవోపై విచారించి బాధ్యులను శిక్షించాలని ఆర్థికశాఖ డిప్యూటీ సెక్రటరీ శాంతకుమారి తుళ్లూరు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఐటీ యాక్టు, ఐపీసీ సెక్షన్ల కింద నాన్‌బెయిల్‌బుల్ కేసు నమోదు చేశామని డీఎస్పీ పోతురాజు తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Russia: ఐఫోన్లను పడేయండి.. అధికారులకు రష్యా అధ్యక్ష భవనం ఆదేశాలు
-
World News
Evergreen: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. బోనస్‌గా ఐదేళ్ల జీతం!
-
Movies News
Rashmika: బాబోయ్.. ‘సామి సామి’ స్టెప్ ఇక వేయలేను..: రష్మిక
-
Sports News
IND vs PAK: మోదీజీ.. భారత్- పాక్ మధ్య మ్యాచ్‌లు జరిగేలా చూడండి: షాహిది అఫ్రిది
-
India News
Mehul Choksi: మెహుల్ ఛోక్సీ రెడ్‌కార్నర్ నోటీసు రద్దుపై సీబీఐ అప్పీల్..
-
Movies News
Social Look: తారల సరదా.. డాగ్‌తో తమన్నా.. పిల్లితో మృణాళ్!