పరిహారం చెక్కు వెనక్కి పంపాలని ఎలా అనిపించిందయ్యా

‘మా కుమారుడికి వచ్చిన రూ.5 లక్షల చెక్కును వెనక్కి పంపాలని మీకు ఎలా అనిపించిందయ్యా... మీకు మేమేం అన్యాయం చేశాం.

Published : 29 Jan 2023 04:31 IST

మీకు భయపడి ఏ పనికీ వెళ్లలేకపోతున్నాం
మంత్రి అంబటి రాంబాబు తీరుపై తురక గంగమ్మ ఆక్రోశం

సత్తెనపల్లి, న్యూస్‌టుడే: ‘మా కుమారుడికి వచ్చిన రూ.5 లక్షల చెక్కును వెనక్కి పంపాలని మీకు ఎలా అనిపించిందయ్యా... మీకు మేమేం అన్యాయం చేశాం. మా గోడు పట్టించుకోకుండా రోడ్డు పాల్జేశారు’ అని మంత్రి అంబటి రాంబాబును ఉద్దేశించి పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన తురక గంగమ్మ మీడియా ఎదుట  వాపోయారు. సత్తెనపల్లిలోని జనసేన కార్యాలయంలో భర్త పర్లయ్యతో కలసి ఆమె శనివారం విలేకరులతో మాట్లాడారు. ‘రెస్టారెంట్‌ మురుగు గుంతలో నా బిడ్డ(అనిల్‌) చనిపోయినప్పుడు... 3 మృతదేహాలవద్ద ఎలాంటి ఒప్పందాలు జరిగాయో నాకు తెలియదు. చేతికందిన కుమారుడు చేజారిపోయాడని ఇప్పటికీ ఏడుస్తున్నాం. రూ.5 లక్షల చెక్కులో రూ.2.50 లక్షలు సేఠ్‌(వ్యాపారి)కి ఇవ్వాలని మీరు (మంత్రి అంబటి) చెబితే సేఠ్‌ దగ్గరికి వెళ్లా. మాకు మీ డబ్బులేమీ అక్కర్లేదని వారు చెప్పారు. అదేమాట మీకు చెబితే ఆ డబ్బు వారికి అవసరం లేదేమో నాకు కావాల్సిందే అన్నారు. బాధ కలిగి చెక్కులో సగం ఇవ్వమంటున్నారంటూ బయటకు చెప్పా. అంతే తప్పించి మీపై నాకెలాంటి కక్షలు, కోపాల్లేవు. నేనెలాంటి తప్పులు, పొరపాట్లూ చేయలేదు’ అని గంగమ్మ చెప్పారు. ‘ప్రస్తుతం ఉన్న నా ఒక్కగానొక్క బిడ్డ సాక్షిగా చెబుతున్నా.. రాంబాబుపై మాట్లాడాలంటూ నాకెవ్వరూ అబద్ధాలు నేర్పించలేదు. మీరు చెక్కు ఇవ్వనన్నారు కాబట్టే ఇంతదాకా వచ్చా. ఏ పూటకు ఆ పూట తెచ్చుకుని బతికేవాళ్లం. ఇప్పుడు ఆ పనులకూ వెళ్లలేకపోతున్నాం. ఎటుపోతే ఏమంటారో... పనులకు రమ్మంటారో లేదో అని మంత్రికి భయపడి బయట తిరగలేకపోతున్నాం. ఇంటి అద్దె కట్టలేని దీనస్థితిలో ఉన్నాం’ అంటూ గంగమ్మ వాపోయారు. ‘చెక్కు రానోడికైతే రూ.2.50 లక్షలు ఇచ్చారు.. మాకొచ్చిన సాయం ఎలా వెనక్కి పంపిస్తావయ్యా.. దయచేసి మా చెక్కు మాకు ఇవ్వండి’ అంటూ మంత్రి రాంబాబును ఆమె వేడుకున్నారు.

చెక్కు ఇవ్వకపోతే ఆమరణ దీక్ష: ‘తురక అనిల్‌ పేరిట సీఎం సహాయనిధి నుంచి మంజూరైన చెక్కును... మంత్రి అంబటి రాంబాబు తన కార్యాలయానికి గంగమ్మను పిలిపించి మీడియా సమక్షంలో ఇవ్వాలి. లేకపోతే సత్తెనపల్లి నడిబొడ్డున బాధితురాలితో కలిసి ఆమరణ దీక్ష చేపడతా’ అని జనసేన ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు చెప్పారు. సత్తెనపల్లిలో ఆయన విలేకరులతో మాట్లాడారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని