ఎక్కువ పరిహారం ఇప్పించొచ్చు

ప్రమాద బీమా పరిహార సొమ్మును బాధిత కుటుంబ సభ్యులు కోరిన దానికంటే ఎక్కువ ఇప్పించే అధికారం తమకు ఉందని హైకోర్టు తేల్చి చెప్పింది.

Published : 29 Jan 2023 04:31 IST

అప్పీలు చేయకపోయినా ప్రమాద బీమా మొత్తాన్ని పెంచొచ్చు
బాధిత కుటుంబానికి అండగా హైకోర్టు కీలక ఉత్తర్వులు

ఈనాడు, అమరావతి: ప్రమాద బీమా పరిహార సొమ్మును బాధిత కుటుంబ సభ్యులు కోరిన దానికంటే ఎక్కువ ఇప్పించే అధికారం తమకు ఉందని హైకోర్టు తేల్చి చెప్పింది. పెంచకూడదనే నిషేధం ఏమి లేదంది. బాధిత కుటుంబ సభ్యులు అప్పీలు దాఖలు చేయకపోయినా సొమ్మును పెంచేందుకు  కోర్టుకు అధికారం ఉంటుందని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గుర్తు చేసింది. ప్రమాదంలో యజమానిని కోల్పోయిన ఓ కుటుంబానికి అండగా నిలిచింది. మృతుడి కుటుంబ సభ్యులకు రూ.1.79 లక్షల పరిహారం ఇవ్వాలని మోటారు వాహనాల ప్రమాద బీమా ట్రైబ్యునల్‌ ఇచ్చిన ఉత్తర్వులను సవరించింది. ఆ సొమ్ముకు అదనంగా మరో రూ 4.10 లక్షలు పరిహారాన్ని కలిపి మొత్తం రూ.5.89 లక్షలు ఇవ్వాలని బీమా సంస్థ, ప్రమాదానికి కారణమైన ఆటో డ్రైవరును ఆదేశించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ దుప్పల వెంకటరమణ ఇటీవల ఈ మేరకు కీలక తీర్పు ఇచ్చారు. గుంటూరు జిల్లా అమరావతిలోని మార్కెట్‌వద్ద రహదారికి ఎడమవైపు నిలబడి ఉన్న లాలూ నాయక్‌ అనే వ్యక్తిని 2005 అక్టోబరులో ఓ ఆటో అత్యంత వేగంగా వచ్చి ఢీకొట్టింది. క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా మృతి చెందారు. ఆటో డ్రైవరు నిర్లక్ష్యంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు కేసు నమోదు చేశారు. రూ.2 లక్షల పరిహారం ఇప్పించాలని మృతుడి భార్య, కుమారుడు గుంటూరు మొదటి ఏడీజే/ప్రమాద బీమా ట్రైబ్యునల్‌ను ఆశ్రయించారు. విచారణ జరిపిన ట్రైబ్యునల్‌ రూ.1.79 లక్షల పరిహారం ఇవ్వాలని బీమా సంస్థ, ఆటో డ్రైవరును ఆదేశిస్తూ 2007 మేలో ఉత్తర్వులిచ్చింది. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ నేషనల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ లిమిటెడ్‌ గుంటూరు డివిజనల్‌ మేనేజరు 2008లో హైకోర్టులో అప్పీలు చేశారు.  ట్రైబ్యునల్‌ ఇచ్చిన ఆదేశాలను రద్దు చేయాలని కోరారు. వాదనలను విన్న న్యాయమూర్తి జస్టిస్‌ దుప్పల వెంకటరమణ.. మృతుడు హోటల్‌ నిర్వహించే వారని, అతడి నెల ఆదాయం రూ.4500గా పరిగణిస్తూ వార్షిక ఆదాయాన్ని రూ.54వేలుగా నిర్ధారించారు. అదనపు పరిహార సొమ్ము పొందేందుకు బాధిత కుటుంబ సభ్యులు అర్హులుగా తేల్చారు. బీమా సంస్థ వేసిన అప్పీలును కొట్టేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని