నిషేధం.. అస్తవ్యస్తం

నిషిద్ధ భూముల జాబితా తయారీ అస్తవ్యస్తంగా జరుగుతోంది. సబ్‌డివిజన్ల వారీగా కాకుండా సర్వే నంబర్లలోని భూములు మొత్తాన్ని నిషిద్ధ జాబితాలో చేరుస్తున్నారు.

Published : 30 Jan 2023 04:52 IST

నిషిద్ధ జాబితాలోనే మొత్తం సర్వే నంబరు
క్రయ, విక్రయాలు జరగక... యజమానుల విలవిల

ఈనాడు, అమరావతి: నిషిద్ధ భూముల జాబితా తయారీ అస్తవ్యస్తంగా జరుగుతోంది. సబ్‌డివిజన్ల వారీగా కాకుండా సర్వే నంబర్లలోని భూములు మొత్తాన్ని నిషిద్ధ జాబితాలో చేరుస్తున్నారు. దీనివల్ల లక్షల ఎకరాలు చిక్కుల్లో పడ్డాయి. జిల్లా రెవెన్యూ, దేవాదాయ, వక్ఫ్‌, ఇతరశాఖల నుంచి ఈ జాబితాలు రిజిస్ట్రేషన్లు, స్టాంపులశాఖ జిల్లా అధికారులకు వెళ్తున్నాయి. ప్రభుత్వ భూములను మార్కెట్‌ ధరకు కొన్నా.. వాటినీ నిషిద్ధ జాబితాలో పెడుతున్నారు. ప్రత్యేక పరిస్థితుల్లో మినహా ఇలా చేయకూడదు. 2016లో న్యాయస్థానం పాత నిషిద్ధ భూముల జాబితాలను పరిశీలించి, కొత్త జాబితాలను రూపొందించాలని పేర్కొంది. అయినా రిజిస్ట్రేషన్లు, స్టాంపులశాఖ అధికారులకు వెళ్తున్న జాబితాల్లో ఇప్పటికీ స్పష్టత లేదు. నిషిద్ధ భూముల జాబితా తయారీలో సమస్యలపై ఇటీవల విజయవాడలో జరిగిన జిల్లా కలెక్టర్ల సదస్సులో చర్చ జరిగింది. ఉన్నతస్థాయి అధికారి ఒకరు విశాఖ, కాకినాడలలో వందల ఎకరాలను అనవసరంగా నిషిద్ధ జాబితాలో ఉంచారని వెల్లడించారు. మరోవైపు.. నిషిద్ధ జాబితా నుంచి భూములను తప్పించడంపై 2021లో ఉన్నతస్థాయి కమిటీ ప్రభుత్వానికి సిఫార్సులు చేసినా పరిస్థితుల్లో మార్పు లేదు. రెవెన్యూశాఖ చర్యలను సవాలు చేస్తూ హైకోర్టులో దాఖలవుతున్న పిటిషన్లలో ఇవీ ఉంటున్నాయి. విశ్రాంత న్యాయమూర్తుల నేతృత్వంలో కమిటీలు ఏర్పాటు చేసి, వారి సిఫార్సుల మేరకు నిర్ణయాలు తీసుకునేందుకు వీలుగా జీవో వెలువడినా తదుపరి చర్యల్లో పురోగతి లేదు.

గ్రామకంఠం భూములకూ కష్టాలే

గ్రామకంఠం భూములను నిషిద్ధజాబితా నుంచి తప్పించాలని ప్రభుత్వం 2015లో జారీ చేసిన జీవో 187, జీవో 361లలో స్పష్టంగా పేర్కొంది. ఇప్పటికీ ఈ భూములు చాలాచోట్ల నిషిద్ధ జాబితాలోనే కొనసాగుతున్నాయి.

మాజీ సైనికులకూ తప్పని పాట్లు

1963 ఏప్రిల్‌ 30న జారీ చేసిన జీవో 743 ప్రకారం మాజీ సైనికోద్యోగులు ప్రభుత్వం కేటాయించిన భూమిని పదేళ్లు అనుభవించాక విక్రయించుకోవచ్చు. పదేళ్ల తర్వాత వీటిని అమ్మాలంటే ప్రభుత్వ అనుమతి అవసరమన్న నిబంధనకు కొంతకాలం క్రితం మినహాయింపు ఇచ్చారు. కానీ... ఇప్పటికీ కొన్నిచోట్ల ఈ భూముల్లో సమస్యలు వస్తూనే ఉన్నాయి.

1954 ముందునాటి ఎసైన్డ్‌ భూములకూ..

1954లో జూన్‌ 18న జారీ చేసిన ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేదలకు అందజేసిన భూములను బదిలీ చేయకూడదని షరతు పెట్టారు. ఈ నిబంధన అమల్లోకి రాకముందు వచ్చిన ఎసైన్డ్‌ పట్టాలనూ రిజిస్టరు చేయడం లేదు. వీటిని నిషిద్ధ జాబితాలో ఉంచక్కర్లేదు. ఆ సర్వే/డోర్‌ నంబరు మొత్తాన్ని నిషిద్ధ భూమిగా పెట్టడంతో రిజిస్ట్రేషన్లు ఆగుతున్నాయి.

చుక్కల భూములకూ సమస్యలు

ఆర్‌ఎస్‌ఆర్‌లోని కాలమ్‌-16 ప్రకారం ఏయే భూములకు చుక్కలు పెడితే.. వాటిని చుక్కల భూములుగా పరిగణిస్తున్నారు. ‘ఆర్‌ఎస్‌ఆర్‌’లో చుక్కల భూములకు హక్కుదారుల వివరాలు నమోదై ఉంటే వాటిని 21ఏ జాబితా నుంచి తప్పించాలి. ఏపీ డాటెడ్‌ ల్యాండ్స్‌ చట్టంలో ఉన్న నిబంధనల ప్రకారం.. నిర్ణీత వ్యవధిలోగా వచ్చిన విజ్ఞప్తులను పరిష్కరించాలి. 22ఏ (1) (ఇ) కింద పెట్టిన చుక్కల భూముల్లో ప్రభుత్వం మంజూరు చేసినవి ఉంటే.. వాటిని 22ఏ 1 (ఏ) కింద మార్చాలి. చుక్కల భూములపై హక్కులున్నాయని ఆధారాలు చూపిస్తే నిషిద్ధ జాబితా నుంచి తప్పించాలి.


దేవాదాయ, వక్ఫ్‌ భూములంటేనే భయం

దేవాదాయ, వక్ఫ్‌ భూములను నిషిద్ధ జాబితాలో చేర్చడంలో ఎక్కువ సమస్యలొస్తున్నాయి. సబ్‌ డివిజన్‌ పేర్కొనకుండా సర్వే నంబరు వేస్తున్నారు. ప్రభుత్వ అనుమతితో దేవాదాయ, వక్ఫ్‌శాఖలు విక్రయించిన భూములూ నిషిద్ధ జాబితాలో ఉన్నాయి. ఇంటి స్థలాల విషయంలో ఇలాగే జరిగితే సర్వేయరు స్కెచ్‌ ఆధారంగా రిజిస్ట్రేషన్‌ చేసుకునే అవకాశమున్నా... కొర్రీలు పడుతూనే ఉన్నాయి.

* ఒకసారి ప్రభుత్వానికి మార్కెట్‌ విలువ ప్రకారం చెల్లింపులు జరిగితే.. అవి ప్రైవేటు భూములవుతాయి. వీటిని నిషిద్ధ జాబితాలో ఉంచక్కర్లేదని అధికారులు చెబుతున్నా ఈ దిశగా చర్యల్లేవు.

* దేవాదాయ, వక్ఫ్‌, రెవెన్యూశాఖల నుంచి మాన్యువల్‌గా నిషిద్ధ భూముల జాబితాలు రిజిస్ట్రేషన్లశాఖకు అందుతున్నాయి. ఈ వివరాల నమోదులో దొర్లుతున్న తప్పులు కొత్త సమస్యలను సృష్టిస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని