కార్మికుల నిధుల దారి మళ్లింపు

భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధులను ప్రభుత్వం దారి మళ్లిస్తోంది. భవన నిర్మాణదారుల నుంచి వసూలు చేస్తున్న ఒక శాతం పన్ను మొత్తాన్ని కార్మికుల కోసం ప్రత్యేకంగా వెచ్చించడం లేదు.

Published : 30 Jan 2023 04:52 IST

బోర్డు నిధులు రూ.1,200 కోట్లు ఫైనాన్షియల్‌ కార్పొరేషన్‌లో డిపాజిట్‌
నవరత్నాల్లో ఇస్తున్నామంటూ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాల నిలిపివేత

ఈనాడు, అమరావతి: భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధులను ప్రభుత్వం దారి మళ్లిస్తోంది. భవన నిర్మాణదారుల నుంచి వసూలు చేస్తున్న ఒక శాతం పన్ను మొత్తాన్ని కార్మికుల కోసం ప్రత్యేకంగా వెచ్చించడం లేదు. గతంలో ఎన్ని సంక్షేమ పథకాలున్నా కార్మికుల పథకాలను అలాగే కొనసాగించేవారు. ఈ ప్రభుత్వం అన్నింటినీ నవరత్నాల్లో కలిపేసి కార్మికులకు ఉన్న ప్రత్యేక పథకాలను నిలిపేసింది. సాధారణ లబ్ధిదారుల్లాగే వీరినీ పరిగణిస్తోంది. నవరత్నాల పథకాల లబ్ధికి అర్హత నిబంధనల కారణంగా కొంతమంది కార్మికులకు ప్రయోజనాలు దక్కడం లేదు. గతంలో భవన నిర్మాణ కార్మికుల బోర్డులో సభ్యత్వముంటే చాలు అన్ని ప్రయోజనాలు అందేవి. ఇప్పుడా పరిస్థితి దూరమైంది.

నిబంధనలు గాలికి..

భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నిధులను వారి కోసమే వెచ్చించాలి. ఈ నిబంధన కారణంగా బోర్డు నిధులను ప్రభుత్వం రాష్ట్ర ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ కార్పొరేషన్‌లో డిపాజిట్‌ చేయించి వాడుకుంటోంది. బోర్డు నుంచి మూడున్నరేళ్లలో రూ.1,200 కోట్లు డిపాజిట్‌ కింద వెళ్లిపోయాయి. వీటికి ప్రభుత్వం వడ్డీ ఇస్తున్నామని చెబుతున్నప్పటికీ తీసుకొని ఇతర కార్యక్రమాలను అమలు చేస్తున్న దాఖలాల్లేవు. ఏటా సుమారు రూ.200 కోట్లను వైఎస్సార్‌ బీమా ప్రీమియానికి మళ్లిస్తోంది.

కష్టాల్లో కనికరించరు..

వైకాపా అధికారంలోకి వచ్చిన మొదట్లో కొత్త ఇసుక విధానమంటూ రేవులను కొన్నాళ్లు మూసేసింది. ఇసుక కొరతతో పనులు లేక కార్మికులు ఆర్థిక ఇబ్బందులు పడ్డారు. ఆ తర్వాత కరోనాతో మరింత కుదేలయ్యారు. ఇప్పుడు స్థిరాస్తి వ్యాపారం సరిగా లేక పూర్తి స్థాయిలో పనులు లేవు. కార్మికులు ఎన్ని ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోకుండా నవరత్నాలు ఇస్తున్నామంటూ బోర్డు పథకాలను ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది. కరోనా మొదటి దశలో ప్రధానమంత్రి గరీబ్‌ కళ్యాణ్‌ యోజన కింద నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు నుంచి సాయం అందుతుందని కేంద్రం ప్రకటించింది. ఇందుకోసం కార్మికుల ఆధార్‌, బ్యాంకు ఖాతాల వివరాల నమోదును 3 నెలల్లోపు పూర్తి చేయాలని ఆదేశించింది. ఈ పథకం కింద లభించే రూ.5వేల కోసం దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర కార్మికశాఖ 2020 జులైలో ప్రకటించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా వేల మంది కార్మికులు దరఖాస్తు చేసుకున్నారు. వారెవరికీ ఇప్పటి వరకూ సాయం అందలేదు. కేంద్రం నిర్దేశాల మేరకు చాలా రాష్ట్రాలు సంక్షేమ నిధి నుంచి కార్మికులకు రూ.5-6వేల చొప్పున చెల్లించాయి.

వేరే పథకాలున్నా..

కార్మికులు బోర్డులో నమోదై ఉంటే వారి ఇద్దరు ఆడపిల్లల పెళ్లిళ్లకు వివాహ కానుక కింద రూ.20వేల చొప్పున అందేవి. కొత్తగా తీసుకొచ్చిన ‘వైఎస్సార్‌ కళ్యాణమస్తు’లో ఉన్న పలు నిబంధనల కారణంగా ఆ సాయం అందడం లేదు. గతంలో ఇచ్చిన రూ.20వేలను రూ.లక్షకు పెంచామని ప్రభుత్వం ఘనంగా చెబుతున్నా ఇప్పటివరకూ చాలామంది ప్రయోజనాన్ని కోల్పోయారు.

* కార్మికుడు ప్రమాదంలో మరణించినా, శాశ్వత వైకల్యమేర్పడినా బోర్డు రూ.5లక్షల పరిహారాన్ని కుటుంబానికి ఇచ్చేది. వైఎస్సార్‌ బీమాలో కలిపి దీనినీ నిలిపేశారు. ఇందులో తమ దరఖాస్తులకు మోక్షం లేదని కార్మికులు వాపోతున్నారు. ఇప్పటికి 262 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని