పట్టాలెక్కని రైల్వే ప్రాజెక్టులు

రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులు పట్టాలు ఎక్కడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం.. నిధుల కేటాయింపులో శీతకన్నేయడం ప్రయాణికులకు అవస్థలు మిగులుస్తున్నాయి.

Updated : 31 Jan 2023 08:20 IST

పాత పనుల్లో ప్రగతి లేదు.. కొత్తవి రావడం లేదు
విశాఖ జోన్‌ కార్యరూపం దాల్చేందుకు ఇంకెన్నాళ్లు?
అమరావతి లైనుపై రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం
నిధుల సాధనలో వైకాపా ఎంపీల వైఫల్యం
కొత్త బడ్జెట్‌పై భారీ ఆశలు
ఈనాడు - అమరావతి, హైదరాబాద్‌

రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులు పట్టాలు ఎక్కడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం.. నిధుల కేటాయింపులో శీతకన్నేయడం ప్రయాణికులకు అవస్థలు మిగులుస్తున్నాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైకాపాకు 22 మంది లోక్‌సభ సభ్యులు, 9 మంది రాజ్యసభ సభ్యులున్నా రైల్వే ప్రాజెక్టులకు నిధులు సాధించడంలో ఘోôœంగా విఫలమవుతున్నారు. వైకాపా ఎంపీలు ప్రతిసారి పార్లమెంట్‌ సమావేశాల్లో ప్రాజెక్టులు పూర్తి చేయాలని అడగటం.. మీ రాష్ట్ర ప్రభుత్వమే వాటా నిధులు ఇవ్వక పనులు చేయలేకపోతున్నామంటూ రైల్వే మంత్రి సమాధానమిస్తుండటంతో రాష్ట్రం పరువు పోతోంది. నడికుడి- శ్రీకాళహస్తి, కడప- బెంగళూరు వంటి కీలకమైన కొత్త లైన్ల పనులు గతంలో వేగంగా జరిగాయి. వైకాపా ప్రభుత్వం వచ్చాక రాష్ట్ర వాటా ఇవ్వకుండా చేతులెత్తేయడంతో అవన్నీ మూలనపడ్డాయి. రాజధాని అమరావతి మీదుగా వెళ్లే 106 కి.మీ. లైనుకు డీపీఆర్‌ సిద్ధమైనా రాష్ట్ర ప్రభుత్వం దాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోంది. విశాఖపట్నం కేంద్రంగా నాలుగేళ్ల కిందట ప్రకటించిన దక్షిణ కోస్తా జోన్‌ ఏర్పాటు ప్రక్రియ సాగదీత ధోరణితో ప్రహసనంగా మారుతోంది. విశాఖపట్నం కేంద్రంగా కొత్త జోన్‌ ప్రకటించి నాలుగేళ్లవుతోంది. దీని కార్యకలాపాలు ప్రారంభం కావాలంటే జోన్‌ ప్రధాన కార్యాలయ భవన నిర్మాణం పూర్తవ్వాలని రైల్వే శాఖ చెబుతోంది. స్థలం గుర్తించినా ఇప్పటి వరకు శంకుస్థాపనే జరగలేదు. విశాఖ జోన్‌, రాయగడ డివిజన్‌ ఏర్పాటుకు రూ.170 కోట్లు అవసరమని అంచనా వేయగా గత మూడు బడ్జెట్లలో కలిపి కేటాయించింది రూ.3.80 కోట్లే. ఇందులోనూ రూ.14 లక్షలు మాత్రమే ఖర్చు చేశారు. కొత్త జోన్‌ ఏర్పాటులాభదాయకం కాదంటూ రైల్వే బోర్డు కొన్నాళ్ల కిందట పేర్కొనడంపై పెద్దఎత్తున దుమారం రేగింది. దీంతో కేంద్రం స్పందించి దిద్దుబాటు చర్యలు చేపట్టింది. విశాఖలో జోన్‌ ప్రధాన కార్యాలయ సముదాయం, ఉద్యోగుల క్వార్టర్లు తదితరాల లేఅవుట్‌ ప్లాన్‌ సిద్ధం చేస్తున్నారు.

అంచనాలు రూ.కోట్లలో.. కేటాయింపు రూ.వెయ్యి!

అనేక కొత్త లైన్లు మంజూరై సమగ్ర పథక నివేదిక (డీపీఆర్‌)లు సైతం సిద్ధం చేసినా, బడ్జెట్‌లో వీటికి నిధులు ఇవ్వడం లేదు.

* రాష్ట్ర రాజధాని ప్రాంతం అమరావతి మీదుగా వెళ్లేలా ఎర్రుపాలెం- అమరావతి- నంబూరు డబుల్‌ లైన్‌, అమరావతి- పెదకూరపాడు, సత్తెనపల్లి- నరసరావుపేట మధ్య కొత్త సింగిల్‌ లైన్లు కలిపి మొత్తం 106 కి.మీ. ప్రాజెక్టు మంజూరు చేశారు. అంచనా విలువ రూ.2,679 కోట్లతో డీపీఆర్‌ సిద్ధమైంది. అయితే బడ్జెట్‌లో దీనికి కేటాయిస్తున్నది కేవలం వెయ్యి రూపాయలు. ఈ ప్రాజెక్టులో కొంత భాగం రాష్ట్రం భరించాలని రైల్వే శాఖ కోరుతుంటే.. విభజన హామీ కింద కేంద్రమే మొత్తం ఖర్చు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం దానిపై పూర్తిగా నిర్లక్ష్యం చూపుతోంది.

* భద్రాచలం- కొవ్వూరు మధ్య 151 కి.మీ. మేర రూ.2,155 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించాల్సిన కొత్త లైనులో సగం వ్యయం ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు భరించాలని రైల్వే శాఖ కోరుతోంది. విభజన హామీలో భాగంగా ఏపీ రాజధాని నుంచి హైదరాబాద్‌తోపాటు, తెలంగాణలో వివిధ ప్రాంతాలకు నిర్మించాల్సిన రోడ్లు, రైలు మార్గాల కింద ఈ ప్రాజెక్టును కేంద్రమే చేపట్టాలని ఏపీ ప్రభుత్వం కోరుతోంది. దీనికి కేంద్రం గత బడ్జెట్‌లో కేవలం రూ.వెయ్యి కేటాయించింది.

* మాచర్ల- నల్గొండ (92 కి.మీ.), కాకినాడ- పిఠాపురం (21.51 కి.మీ.), గూడూరు- దుగరాజపట్నం (41.55 కి.మీ.), కంభం- ప్రొద్దుటూరు (142 కి.మీ.), కొండపల్లి- కొత్తగూడెం (82 కి.మీ.) లైన్లు మంజూరైనా వీటికి బడ్జెట్‌లో రూ.వెయ్యి చొప్పున కేటాయించి రైల్వే శాఖ చేతులు దులిపేసుకుంది.

ఆదాయం వస్తున్నా.. కేటాయింపుల్లో వివక్షే!

అటు ప్రయాణికుల, ఇటు సరకు రవాణాతో రైల్వేకు భారీగా ఆదాయం అందించే ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర బడ్జెట్‌ నిధుల్లో సముచిత ప్రాధాన్యం లభించట్లేదు. దక్షిణ మధ్య రైల్వే జోన్‌ నుంచి రైల్వే శాఖకు గతేడాది రూ.14,266 కోట్ల ఆదాయం సమకూరింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23) డిసెంబరు నెలాఖరుకే రూ.13,787 కోట్ల ఆదాయం వచ్చింది. జోన్‌ ఆదాయంలో విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లతో గతేడాది ద.మ. రైల్వే పరిధిలోని రాష్ట్రానికి రూ.7,032 కోట్ల నిధులు మాత్రమే లభించాయి. రాష్ట్రంలోని మరో రైల్వే డివిజన్‌ వాల్తేర్‌ ముఖ్యంగా ఈస్ట్‌ కోస్ట్‌ జోన్‌ పరిధిలో ఉంది. నిధుల కేటాయింపులో ఇక్కడ తీవ్ర వివక్ష కనిపిస్తోంది. 2021-22లో వాల్తేర్‌ డివిజన్‌ నుంచి రూ.7,902.10 కోట్ల ఆదాయం లభిస్తే 2022-23 కేంద్ర బడ్జెట్‌లో ఈ డివిజన్‌కు కేటాయించిన నిధులు రూ.2,552 కోట్లు మాత్రమే.


చేతులెత్తేసిన రాష్ట్ర ప్రభుత్వం

కీలకమైన నడికుడి- శ్రీకాళహస్తి, కోటిపల్లి- నరసాపురం, కడప- బెంగళూరు, రాయదుర్గం- తుముకూరు కొత్త లైన్ల నిర్మాణంలో రాష్ట్ర వాటా ఇవ్వకపోవడంతో మూడున్నరేళ్లుగా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు.

* నడికుడి- శ్రీకాళహస్తి లైన్‌ (309 కి.మీ.) ప్రాజెక్టు విలువ రూ.2,700 కోట్లు కాగా, ఇందులో రాష్ట్ర వాటా రూ.1,350 కోట్లతోపాటు, అవసరమైన భూసేకరణ జరిపి ఇవ్వాల్సి ఉంది. ప్రభుత్వం  రూ.6 కోట్లు మాత్రమే డిపాజిట్‌ చేసింది.

* కోటిపల్లి- నరసాపురం లైన్‌ (57 కి.మీ.) ప్రస్తుత అంచనా విలువ రూ.2,125 కోట్లు. దీనికి రాష్ట్రం రూ.525 కోట్లు సమకూర్చాల్సి ఉండగా రూ.2.69 కోట్లు మాత్రమే ఇచ్చింది.

* రాయదుర్గం- తుముకూరు లైన్‌లో మన రాష్ట్ర పరిధిలో 63 కి.మీ. ఆరేళ్ల కిందటే పూర్తయింది. మిగిలిన 30 కి.మీ. పనుల్లో ప్రగతిలేదు. రాష్ట్ర వాటా రూ.484కోట్లు కాగా, గతంలో రూ.260 కోట్లు ఇచ్చారు. మిగిలినవి ఇవ్వలేదు.

* కడప- బెంగళూరు లైన్‌ (268 కి.మీ.) ప్రాజెక్టు రూ.2,849 కోట్లతో చేపట్టగా.. రాష్ట్ర వాటాగా రూ.1,425 కోట్లు ఇవ్వాల్సి ఉంది. ఇప్పటి వరకు రూ.190 కోట్లు మాత్రమే డిపాజిట్‌ చేసింది. దీంతో కడప నుంచి పెండ్లిమర్రి వరకు 21 కి.మీ. నిర్మాణమే గతంలో పూర్తి చేశారు. ఇప్పుడు ఈ లైను ఎలైన్‌మెంట్‌ మార్చాలని.. ముదిగుబ్బ వరకు నిర్మించి, ధర్మవరం- బెంగళూరు లైనుకు అనుసంధానించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది.

* పై నాలుగు ప్రాజెక్టుల సివిల్‌ పనులకు రాష్ట్ర వాటా వెచ్చించే పరిస్థితి లేదని, ఈ నిధులను కూడా రైల్వేయే భరించాలంటూ కొద్ది నెలల కిందట ఏపీ ప్రభుత్వం రైల్వే బోర్డు ఛైర్మన్‌కు లేఖ రాసింది. రైల్వే బోర్డు దీనిపై ఇప్పటి వరకు స్పందించలేదు.


ఎంపీలతో సమావేశం లేదు

కేంద్ర బడ్జెట్‌కు ముందు దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ ఏటా విజయవాడలో ఏపీకి చెందిన లోక్‌సభ, రాజ్యసభ సభ్యులతో సమావేశం నిర్వహించే ఆనవాయితీ ఉండేది. రాష్ట్రానికి ఏం కావాలో ఎంపీల నుంచి వినతుల్ని స్వీకరించేవారు. ఈసారి ఆ సమావేశమే నిర్వహించలేదు.


విజయవాడకు.. అన్నివైపులా బిజీబిజీ

ఏపీకి నడిబొడ్డున ఉండే విజయవాడ.. దేశ రైల్వే నెట్‌వర్క్‌లో అత్యంత కీలకం. విజయవాడ నుంచి ఓ వైపు హైదరాబాద్‌కు.. ఇంకోవైపు చెన్నై, త్రివేండ్రం, మరొకవైపు విశాఖపట్నం, భువనేశ్వర్‌, కోల్‌కతా వెళ్లే మార్గాలున్నాయి. విజయవాడ- కాజీపేట- బల్లార్ష వైపు.. విజయవాడ- గూడూరు మధ్య మూడో లైను పనులు జరుగుతున్నాయి. విజయవాడ- దువ్వాడ మధ్య మూడో లైను డీపీఆర్‌ తయారీ దశలోనే ఉంది. ఖరగ్‌పూర్‌- విజయవాడ మధ్య డెడికేటెడ్‌ ఫ్రైట్‌ కారిడార్‌ సర్వే దశనే దాటలేదు. తక్షణమే విజయవాడ- దువ్వాడ మధ్య మూడో లైను మంజూరు చేయాలి.

* విజయవాడ నుంచి సికింద్రాబాద్‌ వయా గుంటూరు మార్గం ప్రస్తుతం సింగిల్‌ లైనే. నల్లపాడు- బీబీనగర్‌ మధ్య రెండో లైనుకు సర్వే, డీపీఆర్‌ పూర్తయినా ప్రాజెక్టు మంజూరులో జాప్యమవుతోంది. ఈ బడ్జెట్‌లో రెండో లైను ప్రకటించి, అధిక నిధులు కేటాయిస్తేనే సమస్య పరిష్కారానికి అడుగులు పడతాయి.

* గుంటూరు- గుంతకల్లు రెండో లైనుకు అధిక నిధులు కేటాయించాలి. ఈ మార్గంలో 401 కి.మీ.కు గాను 160 కి.మీ. డబ్లింగ్‌, విద్యుదీకరణ జరిగింది. ఇది పూర్తయితే రాయలసీమ నుంచి విజయవాడకు రాకపోకలు సులభమవుతాయి.

నిర్వహణకూ ఇబ్బందులే..

కొత్తగా రైలు వేయాలన్నా, ఉన్న రైళ్లకు నిర్వహణ చేయాలన్నా పిట్‌ లైన్లు ఉండాలి. విశాఖపట్నంలో స్టేషన్‌లో పిట్‌ లైన్ల సామర్థ్యం దాటిపోయింది. దీన్ని సాకుగా చూపుతూ ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే జోన్‌ పలు రైళ్లను భువనేశ్వర్‌కు పొడిగించుకుంటూ వెళుతోంది. దీంతో విశాఖపట్నం నుంచి ప్రయాణించేవారికి రిజర్వేషన్ల కోటా తగ్గుతోంది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని రైల్వేస్టేషన్లకు పిట్‌ లైన్లను మంజూరు చేసి నిధులు ఇస్తే.. ఇక్కడే రైళ్ల నిర్వహణ ఏర్పాట్లు వస్తాయి. ఈ జిల్లాల నుంచి రైళ్లు బయల్దేరేలా ఏర్పాట్లు చేయొచ్చు.


ఇవీ డిమాండ్లు

* విశాఖ నుంచి వారణాసికి నేరుగా రైలు లేదు. ప్రస్తుతం వారణాసి నుంచి భువనేశ్వర్‌ వరకు ఉన్న రైలును విశాఖకు పొడిగించాలని డిమాండ్‌ ఉంది.

* విశాఖ నుంచి విజయవాడ, గుంటూరు మీదుగా నిత్యం బెంగళూరుకు వెళ్లే రైళ్లలో ప్రశాంతి ఒక్కటే ఉంది. విశాఖ నుంచి బయలుదేరి బెంగళూరుకు నిత్యం నడిచేలా మరో రైలు కావాలని ప్రయాణికులు కోరుతున్నారు.

* విశాఖపట్నానికి మెమూ షెడ్డు మంజూరు చేయాలి. తద్వారా మెము రైళ్ల నిర్వహణ ఏర్పాట్లు వస్తాయి. విశాఖపట్నం నుంచి చుట్టుపక్కల జిల్లా కేంద్రాలు, పట్టణాలకు డెము లోకల్‌ రైళ్లను నడిపించొచ్చు.

* రాజమహేంద్రవరం రైలు, రోడ్డు వంతెన నిర్మించి వందేళ్లు దాటింది. ఈ వంతెన పై నుంచి, అదే విధంగా మరో వంతెన (ఆర్చ్‌) మీదుగా రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. గోదావరి ఆర్చ్‌ బ్రిడ్జిపై సింగిల్‌ ట్రాకే ఉంది. పక్కన ఖాళీ స్థలం ఉంది. మరో ట్రాక్‌ నిర్మిస్తే రైళ్ల వేగం పెరిగి ఈ మార్గంలో ఒత్తిడి తగ్గుతుంది.

* విజయవాడ నుంచి రాజస్థాన్‌కు, నాగపట్నానికి నేరుగా రైళ్లు వేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. విజయవాడ నుంచి షిర్డీకి రద్దీ ఉండటంతో అదనంగా మరో రైలు కేటాయించాల్సి ఉంది.

* విజయవాడ 50-60 కి.మీలోపు చుట్టుపక్కల ప్రాంతాలైన తెనాలి, గుంటూరు, ఏలూరు, గుడివాడ వరకు సర్క్యులర్‌ రైళ్లు నడపాలని డిమాండ్‌ ఉంది.

* విజయవాడ ప్రధాన స్టేషన్‌పై ఒత్తిడి తగ్గాలంటే.. గుణదల, రాయనపాడు, కృష్ణా కెనాల్‌ స్టేషన్లను శాటిలైట్‌ స్టేషన్లుగా అభివృద్ధి చేయాల్సి ఉంది.

* గుంతకల్లు డివిజన్‌లో గేజ్‌ కన్వర్షన్‌, డబ్లింగ్‌ పేరిట గతంలో నడిచే పలు రైళ్లను రద్దు చేయగా, మరికొన్నింటిని దారి మళ్లించారు. పనులు పూర్తయినా వీటిని ఇటువైపు నడపటం లేదు. ఇందులో హుబ్లి- ధర్మవరం, ధర్మవరం- మీరజ్‌, గదక్‌- గుంటూరు, బెంగళూరు- హుబ్లి విజయనగర ఎక్స్‌ప్రెస్‌ ఉన్నాయి. ఇక చెన్నై- ముంబయి మధ్య జయంతి జనతా, తిరుపతి- సికింద్రాబాద్‌ వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌లను మళ్లీ ఇటువైపుగా నడపాలని ప్రయాణికులు డిమాండ్‌ చేస్తున్నారు.

* కర్నూలు నుంచి గానీ, హైదరాబాద్‌ నుంచి గానీ శ్రీశైలానికి రైలు మార్గం వేయాలని డిమాండ్‌ ఉంది. కర్ణాటక ఎంపీలు చాలాకాలంగా దీన్ని ప్రతిపాదిస్తున్నారు.

* విజయవాడ- చెన్నై, విజయవాడ- కాజీపేట సెక్షన్ల సామర్థ్యాన్ని 130 నుంచి 160 కి.మీ.కి పెంచాలి. ఈ పనులకు నిధులు కేటాయించాలి. తద్వారా రైళ్ల వేగం పెరిగి ప్రయాణ సమయం తగ్గుతుంది.

సర్వేతో ఆగిపోయిన ప్రాజెక్టులు

కర్ణాటకలోని చిక్కబళ్లాపురం నుంచి పుట్టపర్తి సత్యసాయి ప్రశాంతి నిలయం స్టేషన్‌ వరకు రూ.103 కి.మీ. లైన్‌, శ్రీనివాసపుర- మదనపల్లి మధ్య 75 కి.మీ. లైన్‌ వంటి పలు ప్రాజెక్టులు డీపీఆర్‌ సిద్ధమయ్యాక పురోగతి లేకుండా ఆగిపోయాయి.


రాష్ట్రంలో రైల్వే లైన్లు (కి.మీ.ల్లో)

* సింగిల్‌ లైన్లు: 1298.73  

* డబుల్‌ లైన్లు: 1623.12  

* ట్రిపుల్‌ లైన్లు: 69.20  

* నోట్‌: ద.మ.రైల్వే పరిధిలో


రాష్ట్రంలో రైల్వే స్వరూపమిదీ

రాష్ట్రంలోని విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లు.. దక్షిణ మధ్య రైల్వే జోన్‌ పరిధిలో ఉన్నాయి. వాల్తేరు డివిజన్‌ ఒడిశాలోని భువనేశ్వర్‌ కేంద్రంగా ఉన్న ఈస్ట్‌కోస్ట్‌ జోన్‌లోకి వస్తుంది. విశాఖపట్నం కేంద్రంగా ప్రకటించిన ‘దక్షిణ కోస్తా’ కొత్త జోన్‌ పరిధిలోకి విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లు రానున్నాయి. వాల్తేర్‌ డివిజన్‌ను రద్దు చేసి, ఒడిశాలోని రాయగడ డివిజన్‌ ఏర్పాటు చేయనున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని