విశాఖ ఉక్కు పరిరక్షణకు ఐక్యపోరాటం

విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రభుత్వ రంగంలోనే కొనసాగేలా ఐక్యపోరాటాలకు సిద్ధమవుతున్నట్లు విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి పేర్కొంది.

Published : 31 Jan 2023 05:12 IST

ప్రభుత్వరంగంలోనే కొనసాగించాలి
రాజకీయ పార్టీల ఏకగ్రీవ తీర్మానం

ఈనాడు, విశాఖపట్నం: విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రభుత్వ రంగంలోనే కొనసాగేలా ఐక్యపోరాటాలకు సిద్ధమవుతున్నట్లు విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి పేర్కొంది. పోరాట కమిటీలు, కార్మిక, నిర్వాసిత సంఘాలు, రాజకీయ పార్టీలతో కలిసి ఉక్కు పరిరక్షణకు ముందుకు వెళ్తామని నినదించింది. ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఇక్కడి త్రిష్ణా మైదానంలో సోమవారం ‘ఉక్కు ప్రజా గర్జన’ సభ నిర్వహించారు. ప్రైవేటీకరణను అడ్డుకోవడం, మిగిలిన నిర్వాసితులకు శాశ్వత ఉపాధి, ప్లాంటు పూర్తిస్థాయి నిర్వహణకు రూ.6 వేల కోట్ల రుణం తదితర తీర్మానాలను ఆమోదించారు. భాజపా మినహా.. 13 రాజకీయ పార్టీలకు చెందిన ప్రతినిధులు, కార్మిక, ప్రజాసంఘాలు, నిర్వాసిత పోరాట సంఘాల నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వ ప్రతినిధిగా హాజరైన మంత్రి అమర్‌నాథ్‌ మాట్లాడుతూ కార్మికులు చేస్తున్న ఉద్యమాన్ని కేంద్రం అడ్డదారుల్లో నిలువరించాలని చూస్తోందన్నారు. ఈ పోరాటానికి రాష్ట్ర ప్రభుత్వ మద్దతు ఉంటుందన్నారు. వైకాపా, వామపక్షాలకు చెందిన ఎంపీలంతా కలిసి ప్రధాని కార్యాలయం ముందు నిరసన తెలిపితే ఆయన దిగొస్తారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ‘ఉక్కు కోసం తెదేపా ఎంపీలు రాజీనామాలకైనా సిద్ధం. ఇదే స్థాయిలో వైకాపా ఎంపీలు ముందుకు రావాలి’ అని  తెదేపా నేత బండారు సత్యనారాయణమూర్తి పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక కన్వీనర్‌ కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ ‘ఉక్కు పరిశ్రమను కాపాడే బాధ్యత సీఎం జగన్‌ తీసుకోవాలి. దీనిపై వెంటనే అఖిలపక్షం ఏర్పాటు చేయాలి’ అని కోరారు. విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి అధ్యక్షులు ఆదినారాయణ, రాజశేఖర్‌, నరసింగరావు మాట్లాడుతూ కేంద్రం దిగొచ్చేంతవరకు కార్మికుల ఉద్యమాలు కొనసాగుతాయన్నారు. అందరం ఐక్యంగా పోరాడే సమయం వచ్చిందని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. వైకాపా ఉత్తరాంధ్ర ప్రాంతీయ సమన్వయకర్త సుబ్బారెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రాకేష్‌రెడ్డి తదితరులు మాట్లాడారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు