పులివెందుల హైవే రెండో ప్యాకేజీ టెండరు ఖరారు

ముఖ్యమంత్రి జగన్‌ సొంత నియోజకవర్గం పులివెందుల మీదుగా వెళ్లే జాతీయ రహదారి విస్తరణ పనుల్లో రెండో ప్యాకేజీకి ఎన్‌ఎస్‌పీఆర్‌ అనే సంస్థ బిడ్‌ దక్కించుకుంది.

Updated : 31 Jan 2023 05:03 IST

32 శాతం తక్కువకు దక్కించుకున్న ఎన్‌ఎస్‌పీఆర్‌

ఈనాడు-అమరావతి: ముఖ్యమంత్రి జగన్‌ సొంత నియోజకవర్గం పులివెందుల మీదుగా వెళ్లే జాతీయ రహదారి విస్తరణ పనుల్లో రెండో ప్యాకేజీకి ఎన్‌ఎస్‌పీఆర్‌ అనే సంస్థ బిడ్‌ దక్కించుకుంది. ముద్దనూరు నుంచి పులివెందుల, కదిరి, గోరంట్ల మీదుగా హిందూపురం వెళ్లే ‘జాతీయ రహదారి-716జి’ని కేంద్ర రహదారి రవాణా, హైవేల మంత్రిత్వశాఖ (మోర్త్‌) నాలుగు వరుసలుగా విస్తరిస్తోంది. ఇందులోని ముద్దనూరు-పులివెందుల-బి.కొత్తపల్లి మధ్య 56 కి.మీ. ఒకటో ప్యాకేజీ, బి.కొత్తపల్లి-కదిరి-గోరంట్ల మధ్య 57 కి.మీ. రెండో ప్యాకేజీగా టెండర్లు పిలిచారు. ఆరు సంస్థలు సాంకేతిక అర్హత సాధించగా, వీటి ధరల బిడ్లను అధికారులు సోమవారం తెరిచారు. అంచనా విలువ రూ. 650.59 కోట్లుకాగా, అదే ప్రాంతానికి చెందిన దివంగత మాజీమంత్రి బంధువుకు చెందిన ఎన్‌ఎస్‌పీఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ అంచనా కంటే 32.68 శాతం తక్కువకు కోట్‌చేసి ఎల్‌-1 నిలిచింది. రూ.438 కోట్లతో టెండరు దక్కించుకుంది.


మొదటి ప్యాకేజీ ఇంకెప్పుడు?

ముద్దనూరు-పులివెందుల-బి.కొత్తపల్లి మొదటి ప్యాకేజీ టెండరుకు ఎప్పుడు మోక్షం కలుగుతుందనేది ప్రశ్నార్థకంగా ఉంది. దీనికి రూ. 891 కోట్ల అంచనా విలువతో టెండర్లు పిలవగా.. అంచనాలు భారీగా పెంచారని, ఇతర గుత్తేదారులను బిడ్లు వేయకుండా ఒత్తిడి చేశారని మోర్త్‌కు ఫిర్యాదులు వెళ్లాయి. దీనిపై విచారణ జరుగుతోంది. ఈ టెండరును అదే ప్రాంతానికి చెందిన కీలక నేతలు అంచనా కంటే కేవలం 2-3 శాతం తక్కువకు దక్కించుకోవడానికి తెరవెనుక మంత్రాంగం నడుపుతున్నారని ప్రచారంలో ఉంది. అందుకే ఇదే హైవేలో ఎటువంటి ఫిర్యాదుల్లేని రెండో ప్యాకేజీ టెండరును ఇంతకాలం తెరవనివ్వకుండా ఆపారని విమర్శలు ఉన్నాయి. ఇందులో గుత్తేదారులు పోటీపడి 30 శాతానికి పైగా లెస్‌కు వెళ్లేందుకు వీలుందని ముందే అంచనాలు ఉన్నాయి. ఇలా ఇందులో బాగా తక్కువకు టెండరు ఖరారయ్యాక, మొదటి ప్యాకేజీలో 2-3 శాతం తక్కువకే టెండరు ఖరారైతే ఏదో మతలబు జరిగిందనే విమర్శలు వస్తాయనే ఉద్దేశంతో.. రెండో ప్యాకేజీ టెండరును ఇంతకాలం తెరవకుండా నిలువరించారని సమాచారం. చివరకు నోటిఫికేషన్‌ ఇచ్చి 120 రోజులు ముగిసిపోతుండటంతో దీనిని తెరిచారని గుత్తేదారులు పేర్కొంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని