సంక్షిప్త వార్తలు(10)

‘జగనన్న చేదోడు’ పథకంలో అర్హులందరికీ ఆర్థిక సాయాన్ని అందిస్తామని గ్రామ, వార్డు సచివాలయశాఖ వెల్లడించింది.

Updated : 31 Jan 2023 04:59 IST

అర్హులందరికీ ‘జగనన్న చేదోడు’ అందిస్తాం
గ్రామ, వార్డు సచివాలయశాఖ వెల్లడి

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ‘జగనన్న చేదోడు’ పథకంలో అర్హులందరికీ ఆర్థిక సాయాన్ని అందిస్తామని గ్రామ, వార్డు సచివాలయశాఖ వెల్లడించింది. ‘చేదోడు’కి ఎందుకీ హడావుడి? శీర్షికన సోమవారం ‘ఈనాడు’లో ప్రచురితమైన కథనానికి గ్రామ, వార్డు సచివాలయశాఖ వివరణ ఇచ్చింది. ‘అర్హత ఉన్న ఏ ఒక్కరికీ అన్యాయం జరగదు. ఫిబ్రవరి 4వ తేదీ వరకు ఏ రోజుకారోజు దరఖాస్తులను పరిశీలించి మరుసటి రోజే లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేస్తాం. ఆధార్‌తో లింక్‌ లేని వారి నుంచే మళ్లీ కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు సేకరిస్తున్నాం. లబ్ధిదారులకు ఎవరికీ ఇబ్బంది లేకుండా తహసీల్దారు, డిప్యూటీ తహసీల్దార్లు ధ్రువీకరణ పత్రాలను యుద్ధప్రాతిపదికన జారీచేసేలా చర్యలు తీసుకుంటున్నాం’ అని వెల్లడించింది.


నేడు కృష్ణా బోర్డు ఛైర్మన్‌ పదవీ విరమణ  

ఈనాడు, హైదరాబాద్‌: కృష్ణా నదీ యాజమాన్య సంఘం (కేఆర్‌ఎంబీ) ఛైర్మన్‌ ఎంపీ సింగ్‌ మంగళవారం పదవీ విరమణ చేయనున్నారు. 2021 సంవత్సరం మే నెలలో ఆయన బోర్డు ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆ స్థానంలో పోలవరం ప్రాజెక్టు అథారిటీ ముఖ్య కార్యనిర్వాహక అధికారి శివ్‌ నందన్‌కుమార్‌ను అదనపు బాధ్యతలతో నియమించినట్లు తెలిసింది.


నేటి నుంచి ఏయూలో దక్షిణ భారత వీసీల సదస్సు

విశాఖపట్నం (ఏయూ ప్రాంగణం), న్యూస్‌టుడే: దక్షిణ భారత దేశ విశ్వవిద్యాలయాల ఉపకులపతుల సదస్సు మంగళవారం నుంచి రెండు రోజుల పాటు ఆంధ్ర విశ్వవిద్యాలయం వేదికగా జరగనుందని ఏయూ వీసీ ఆచార్య ప్రసాదరెడ్డి తెలిపారు. అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ యూనివర్సిటీస్‌ (ఏఐయూ) అధ్యక్షుడు ఆచార్య సురంజన్‌దాస్‌తో కలిసి సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మంగళవారం బీచ్‌రోడ్డులోని ఏయూ కన్వెన్షన్‌ సెంటర్‌లో కార్యక్రమాన్ని రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ప్రారంభిస్తారన్నారు. ఈ సదస్సుకు 140 విశ్వవిద్యాలయాల ఉపకులపతులు హాజరుకానున్నారని తెలిపారు. ‘రీసెర్చ్‌ ఎక్స్‌లెన్స్‌ ఫర్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌’ అనే అంశంపై ఈ సదస్సును నిర్వహిస్తామన్నారు.


గంజాయి వాడితే 20 ఏళ్ల జైలుశిక్ష
ఎస్‌ఈబీ ఇన్‌స్పెక్టర్‌ జనార్దనరావు

అచ్యుతాపురం, న్యూస్‌టుడే: గంజాయిని వాడినా, విక్రయించినా 20 ఏళ్ల వరకు జైలుశిక్ష పడే అవకాశం ఉందని  స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (ఎస్‌ఈబీ) ఇన్‌స్పెక్టర్‌ జనార్దనరావు హెచ్చరించారు. డ్రగ్స్‌ వినియోగం వల్ల అన్ని అనర్థాలేనని తెలిపారు. ‘బడిలో గంజాయి పొగ’ శీర్షికన ‘ఈనాడు’లో సోమవారం కథనం ప్రచురితమైంది. ఈ నేపథ్యంలో ఎస్‌ఈబీ అధికారులు అప్రమత్తమయ్యారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలోని ఉన్నత పాఠశాల విద్యార్థులకు సోమవారం డ్రగ్స్‌ వినియోగం, విక్రయాల వల్ల ఎదుర్కొనే నష్టాలను వివరించారు. డ్రగ్స్‌ జోలికి వెళ్లొద్దని విద్యార్థులకు సూచించారు.


శాయ్‌ పాలకవర్గ సభ్యురాలిగా మంత్రి రోజా

ఈనాడు, అమరావతి: భారత క్రీడా ప్రాధికార సంస్థ(శాయ్‌) పాలకవర్గ సభ్యురాలిగా మంత్రి ఆర్కే రోజా నియమితులయ్యారు. కేంద్ర క్రీడా, యువజన సర్వీసుల శాఖ మంత్రి అధ్యక్షుడిగా ఉన్న శాయ్‌కి 2018 అక్టోబరులో నియమించిన పాలకవర్గం 2022 అక్టోబరు వరకు అమలులో ఉంది. పాలకవర్గ పునర్నియామకంలో భాగంగా సభ్యులుగా ఏపీతోపాటు హిమాచల్‌ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, ఒడిశా, త్రిపుర రాష్ట్రాలకు చెందిన క్రీడాశాఖల మంత్రులను నియమించారు. రొటేషన్‌ పద్ధతిలో వివిధ రాష్ట్రాల మంత్రులను పాలకవర్గ సభ్యులుగా నియమిస్తున్నట్లు శాయ్‌ పేర్కొంది.


వీఆర్‌ఓ, రెవెన్యూ సెక్రటరీలకు ఉమ్మడి జాబ్‌ ఛార్ట్‌

ఈనాడు-అమరావతి: గ్రామ/వార్డు సచివాలయాల్లో పనిచేసే విలేజ్‌ రెవెన్యూ ఆఫీసర్‌, వార్డు రెవెన్యూ సెక్రటరీలకు ‘ఉమ్మడి జాబ్‌ ఛార్ట్‌’ రూపొందిస్తూ రెవెన్యూ శాఖ సోమవారం ఉత్తర్వులిచ్చింది. విపత్తులు (అగ్ని ప్రమాదాలు, తుపాను), ఓటర్ల జాబితా తయారీ, మ్యుటేషన్లు, రీ-సర్వే, రెసిడెన్సీ, స్థానిక సర్టిఫికేట్‌ల జారీ, స్పందన కార్యక్రమాలకు హాజరు, ప్రభుత్వ భూముల ఆక్రమణల నిరోధ చర్యలు, పన్నుల వసూళ్లు, ప్రజలకు ప్రభుత్వ తరపున సమాచారాన్ని చేరవేయడం, హత్యలు, ఆత్మహత్యలు, ఇతర నేరాల గురించి తహసీల్దార్లకు తెలియచేయడం వంటి విధులు వీరు నిర్వర్తిస్తారు. అలాగే జిల్లా కలెక్టర్‌, తహసీల్దార్‌, భూ పరిపాలన విభాగం నుంచి ఆదేశాలు కూడా వీరు అమలు చేయాలి. జాబ్‌ఛార్టులో పేర్కొన్న విధులకు హాజరయ్యేందుకు తొలి ప్రాధాన్యమివ్వాలని రెవెన్యూ శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది.


త్రిశూలం కాదు.. మిరపకాయ!

వేలేరుపాడు, న్యూస్‌టుడే: త్రిశూలం అనుకుంటున్నారా..! అయితే మీరు పొరబడినట్లే. ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలోని భూదేవిపేట గ్రామానికి చెందిన పి.హరిబాలకృష్ణ అనే రైతు వేలేరుపాడు సమీపంలో మిరప సాగు చేస్తున్నారు. తోటలో త్రిశూలం ఆకారంలో మిరపకాయ కాసింది. స్థానికులు దీన్ని ఆసక్తిగా తిలకిస్తున్నారు. జన్యు ఉత్పరివర్తనాలు, పండు ఆకర్షణ కారణంగా మిరప ఈ ఆకారంలో ఉందని లాంఫాం శాస్త్రవేత్త వెంకటరమణ తెలిపారు.


భలే.. బెండ

విశాఖపట్నం ఆటోనగర్‌ ప్రాంతంలోని ఓ ఇంటి పెరట్లో మూడు, రెండు అంగుళాల ఎత్తులో ఉన్న బెండ మొక్కలు కాయలు కాస్తుండటంతో స్థానికులు ఆసక్తిగా చూస్తున్నారు. జన్యు లోపంతో చిన్న మొక్కలకే ఇలాంటి కాయలు కాస్తాయని, పెద్ద సైజులో పెరగవని    వ్యవసాయ నిపుణులు   వివరించారు.

న్యూస్‌టుడే, విశాఖపట్నం (ఆటోనగర్‌)


ఇంటర్‌ వృత్తి విద్యా కోర్సులకు ఆన్‌లైన్‌ మూల్యాంకనం

ఈనాడు, అమరావతి: ఇంటర్మీడియట్‌ వృత్తి విద్యా కోర్సుల పరీక్షల సమాధాన పత్రాలను ఆన్‌లైన్‌లో మూల్యాంకనం చేసేందుకు ఇంటర్‌ విద్యామండలి కసరత్తు చేస్తోంది. ప్రయోగాత్మకంగా వృత్తి విద్యా కోర్సుల్లో ముందుగా అమలు చేయాలని భావిస్తోంది. ఇది సత్ఫలితాలు ఇస్తే భవిష్యత్తులో మిగతా వాటికి వర్తింప చేయనున్నారు. పబ్లిక్‌ పరీక్షలు పూర్తికాగానే సమాధాన పత్రాలన్నింటినీ జిల్లా కేంద్రాలకు తరలించి, వాటిని స్కానింగ్‌ చేస్తారు. అనంతరం వాటిని మూల్యాంకనం చేసేందుకు లెక్చరర్లకు కేటాయిస్తారు. లెక్చరర్లు ఎక్కడి నుంచైనా మూల్యాంకనం చేసేందుకు వీలుంటుంది. రీకౌంటింగ్‌, రీవెరిఫికేషన్‌ పత్రాలనూ సైతం ఆన్‌లైన్‌లోనే మూల్యాంకనం, పరిశీలన చేయాలని నిర్ణయించారు. ఆన్‌లైన్‌ మూల్యాంకనానికి  సాంకేతిక సేవలను అందించే సంస్థలను ఎంపిక చేసేందుకు త్వరలో టెండర్లు పిలవనున్నారు.


ఆన్‌లైన్‌ కోర్సుల్లో 40శాతం క్రెడిట్ల బదిలీకి అనుమతి

ఈనాడు, అమరావతి: కోర్సుల్లో 40% క్రెడిట్లను ఆన్‌లైన్‌లో మార్పు చేసుకునేందుకు అనుమతిస్తూ అఖిల భారత విద్యా సాంకేతిక మండలి(ఏఐసీటీఈ) ఆదేశాలు జారీ చేసింది. యూజీసీ నిబంధనలు-2021ని ఏఐసీటీఈ స్వీకరించింది. ఉన్నత విద్యా సంస్థ అందించే మొత్తం కోర్సుల్లో 40శాతం వరకు క్రెడిట్ల్ బదిలీకి అనుమతిస్తారు. స్వయం ప్లాట్‌ఫామ్‌ ద్వారా ఆన్‌లైన్‌ కోర్సులు, అభ్యసన మెటీరియల్‌ను వినియోగించుకునేందుకు విద్యార్థులను ప్రోత్సహించాలని ఏఐసీటీఈ సూచించింది. జనవరి సెమిస్టర్‌లో ఆరు ఆన్‌లైన్‌ కోర్సులను ప్రవేశ పెట్టినట్లు పేర్కొంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని