206 మంది విద్యార్థినులకు అస్వస్థత

పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రామకృష్ణాపురంలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకుల బాలికల విద్యాలయంలో 206 మంది బాలికలు అస్వస్థతకు గురయ్యారు. సోమవారం ఉదయం నుంచే పిల్లలు ఒక్కొక్కరుగా అస్వస్థతకు గురవుతుంటే, సకాలంలో ఆస్పత్రికి తరలించి వైద్యం అందించకుండా జాప్యం చేశారు.

Updated : 31 Jan 2023 09:33 IST

ఈనాడు, అమరావతి - న్యూస్‌టుడే, సత్తెనపల్లి గ్రామీణ: పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రామకృష్ణాపురంలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకుల బాలికల విద్యాలయంలో 206 మంది బాలికలు అస్వస్థతకు గురయ్యారు. సోమవారం ఉదయం నుంచే పిల్లలు ఒక్కొక్కరుగా అస్వస్థతకు గురవుతుంటే, సకాలంలో ఆస్పత్రికి తరలించి వైద్యం అందించకుండా జాప్యం చేశారు. దీంతో కొందరి ఆరోగ్యం క్షీణించి సెలైన్‌ ఎక్కించే వరకు వెళ్లింది.   ఆదివారం మధ్యాహ్నం చికెన్‌, గుత్తివంకాయ కూరలు వండారు. మిగిలిన వాటిని రాత్రికి కూడా వడ్డించారు. సోమవారం ఉదయం అల్పాహారంగా కిచిడీ, సమోసాలు చేశారు. అల్పాహారం తీసుకోకముందు యోగా తరగతులకు హాజరైన వారిలో 20 మంది బాలికలు వాంతులు, విరేచనాలు చేసుకున్నారు. వారిని గురుకులంలోని ప్రత్యేక గదికి తరలించి, స్టాఫ్‌నర్సుతో వైద్యం అందించారు. అల్పాహారం తీసుకున్నాక మరికొందరికి వాంతులు, విరోచనాలవడంతో వారికీ ఇంజెక్షన్లు ఇచ్చారు. మధ్యాహ్నం వారందరికీ పెరుగన్నం పెట్టారు. తరగతులకు హాజరైన బాలికల్లోనూ కొందరు స్వల్ప జ్వరం, వాంతులతో ఇబ్బంది పడ్డారు. కొందరు స్పృహ తప్పి పడిపోయారు. మొత్తంగా 206 మంది అస్వస్థతకు గురవడంతో మధ్యాహ్నం 2గంటల తర్వాత వారందరినీ సత్తెనపల్లిలోని ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. మంత్రులు అంబటి రాంబాబు, మేరుగు నాగార్జున, గురుకుల విద్యాలయాల కార్యదర్శి జయలక్ష్మి, పల్నాడు జిల్లా కలెక్టర్‌ శివశంకర్‌ తదితరులు సత్తెనపల్లికి హుటాహుటిన చేరుకున్నారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించేలా సిబ్బందిని ఆదేశించారు. వైద్యం అందాక 93 మంది కోలుకోగా ఇళ్లకు పంపారు.  ఇద్దరిని మెరుగైన వైద్యం కోసం గుంటూరు తరలించారు. మిగిలిన 111 మంది బాలికలకు చికిత్స అందిస్తున్నారు. ఇరవై మందిని వైద్యుల పర్యవేక్షణలోనే ఉంచారు. ఇద్దరిని గుంటూరు సర్వజనాసుపత్రికి తరలించారు. మంత్రుల ఆదేశంతో ఈ ఘటనపై ఆహార కల్తీ నియంత్రణ, రెవెన్యూ, పౌరసరఫరాలు, వైద్యారోగ్య శాఖల యంత్రాంగంతో కమిటీని ఏర్పాటు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని