పాత ఇళ్లకు బిల్లుల చెల్లింపు ఇంకెప్పుడు?

తెదేపా హయాంలో ఇళ్లను నిర్మించుకున్న పేదలకు బిల్లులు చెల్లించకుండా వైకాపా ప్రభుత్వం చుక్కలు చూపిస్తోంది.

Published : 31 Jan 2023 03:15 IST

గత ప్రభుత్వంలో చేపట్టిన వాటికి రూ.800 కోట్ల బకాయిలు
పరిశీలన పేరిట మూడున్నరేళ్లుగా కాలయాపన

ఈనాడు డిజిటల్‌, అమరావతి: తెదేపా హయాంలో ఇళ్లను నిర్మించుకున్న పేదలకు బిల్లులు చెల్లించకుండా వైకాపా ప్రభుత్వం చుక్కలు చూపిస్తోంది. దాదాపు 80 వేల మంది లబ్ధిదారులకు రూ.800 కోట్ల వరకు బకాయిలు చెల్లించాల్సి ఉన్నా వేధిస్తోంది. అన్ని అర్హతలున్నా, ఇళ్లను పూర్తిచేసినా... పరిశీలన పేరిట మూడున్నరేళ్లుగా కాలయాపన చేస్తోంది. గతంలో తెదేపా ప్రభుత్వం ఎన్టీఆర్‌ పేరిట పేదలకు ఇళ్ల నిర్మాణ పథకాన్ని చేపట్టింది. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.1.50 లక్షల చొప్పున లబ్ధిదారులకు చెల్లించింది. అందులో రాష్ట్ర ప్రభుత్వ వాటానే రూ.1.20 లక్షలు. ఎస్సీ, ఎస్టీలకు మరింత అదనంగా చెల్లించేది. ప్రస్తుతం... వైకాపా ప్రభుత్వం నవరత్నాలు-పేదలందరికీ ఇళ్ల నిర్మాణాన్ని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో చేపడుతోంది. ఇచ్చే రూ.1.80 లక్షలు గ్రామీణ ప్రాంతాల్లో పూర్తిగా కేంద్ర నిధులే. పట్టణ ప్రాంతాల్లో మాత్రమే రాష్ట్రం రూ.30 వేలు అదనంగా చెల్లిస్తోంది. ఎన్టీఆర్‌ ఇళ్ల నిర్మాణ పథకం లబ్ధిదారులు కొందరు 2019 ఎన్నికల నాటికే కొన్ని గృహాలను పూర్తి చేసుకున్నారు. మరికొందరు వివిధ దశల్లో ఉన్న తమ ఇళ్లను ఆ తర్వాత ముగించారు. మొత్తంగా లబ్ధిదారులందరికీ కలిపి రూ.800 కోట్ల వరకు బిల్లులను చెల్లించాల్సి ఉంది. వారు నిజమైనా అర్హులా? కాదా? అని పరిశీలించాలని ఆదేశించిన ప్రభుత్వం... దాన్ని సాగదీస్తూనే ఉంది. ఎప్పటికప్పుడు లబ్ధిదారులు ప్రభుత్వానికి, స్థానిక అధికారులకు విన్నవిస్తూనే ఉన్నారు. వివిధ జిల్లాల నుంచి 70 మంది వరకు న్యాయస్థానాన్ని సైతం ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలతో ప్రభుత్వం వారికి ఇప్పటివరకు రూ.30 లక్షల వరకు చెల్లించినట్లు తెలిసింది. దీనిపై గృహనిర్మాణ శాఖ అధికారులను వివరణ కోరగా... గత ప్రభుత్వంలో చేపట్టి, పూర్తి చేసిన ఇళ్లపై పరిశీలన పూర్తిచేసి, వివరాలను ఆర్థికశాఖకు నివేదించామన్నారు. త్వరలో బిల్లులు విడుదల చేస్తామని వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని