Andhra News: మామూళ్లు ఇస్తే కోరిన వేతనం.. ఆయుష్ కాంపౌండర్లకు వాట్సప్ సందేశం

‘ఆయుష్‌’ పరిధిలో ఒప్పంద కాంపౌండర్ల వేతనం పెంపుదల ఉత్తర్వుల కోసం మామూళ్లు సమర్పించుకోవాలని వాట్సప్‌ గ్రూపు ద్వారా జరుగుతోన్న ప్రచారం రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖలో కలకలం రేపుతోంది.

Updated : 31 Jan 2023 09:22 IST

ఈనాడు, అమరావతి: ‘ఆయుష్‌’ పరిధిలో ఒప్పంద కాంపౌండర్ల వేతనం పెంపుదల ఉత్తర్వుల కోసం మామూళ్లు సమర్పించుకోవాలని వాట్సప్‌ గ్రూపు ద్వారా జరుగుతోన్న ప్రచారం రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖలో కలకలం రేపుతోంది. జాతీయ ఆరోగ్య మిషన్‌ కింద సుమారు 15 ఏళ్ల నుంచి ఆయుష్‌ డిస్పెన్సరీల్లో కొందరు కాంపౌండర్లుగా ఒప్పంద విధానంలో పనిచేస్తున్నారు. వీరికి ప్రస్తుతం వేతనంగా రూ.11,186 చెల్లిస్తున్నారు. తెలంగాణలో ఈ కేటగిరిలో పనిచేసే వారికి రూ.27వేల వరకు చెల్లిస్తున్నారు. తెలంగాణలో మాదిరిగా తమకూ వేతనం చెల్లించాలని వీరు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వాట్సప్‌ గ్రూపు ద్వారా పలువురికి సమాచారం వచ్చినట్లు కాంపౌండర్లు కొందరు తెలిపారు. ‘వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కార్యాలయం నుంచి ఓ ఫోను వచ్చింది. మనం అనుకున్న వేతనం మెన్షన్‌ చేయడానికి వారు రెడీగా ఉన్నారు. వారి ఫార్మాలిటీస్‌ పూర్తిచేస్తే వేతనం పెంపుపై ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉంది. అందరూ స్పందిస్తే బాగుంటుంది. దీనిపై సంబంధిత సెక్షన్లలోనూ మాట్లాడుతున్నాం. సమయం లేదు మిత్రమా! అన్ని జిల్లాల టీం లీడర్లు రెస్పాండ్‌ అయితే మంచిది’ అని ఆ సందేశంలో పేర్కొన్నారు. కృష్ణా, విశాఖ, విజయనగరం, కర్నూలు, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం, ప్రకాశం జిల్లాలో దీనిపై పెద్దఎత్తున చర్చ జరుగుతోందని  తెలిసింది. ఈ మేరకు వారి స్థాయిని బట్టి వసూళ్లు జరుగుతున్నాయని తెలిసింది. మరోవైపు ఈ వ్యవహారంపై విచారణ జరిపించాలని మంత్రి రజిని కార్యాలయం ప్రభుత్వాన్ని కోరింది. దీంతో ఆ సందేశంపై ఆరా తీస్తున్నారు. ఈ సందేశం పంపడం వెనక ఎవరు ఉన్నారు అనే కోణంలో వివరాలు సేకరిస్తున్నారు. ఇటీవల కాలంలో జరుగుతున్న పలు నియామకాల వెనుక భారీగా మామూళ్లు చేతులు మారుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల డీఎంఈ లోనూ ఓ చిరుద్యోగి నకిలీ నియామకపత్రాలు సృష్టించి అమాయకులను మోసం చేశాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని