విద్యుత్‌ కొనుగోళ్ల భారం రూ.1,601 కోట్లు!

రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) అనుమతించిన ధర కంటే... అధిక మొత్తానికి బహిరంగ మార్కెట్‌లో విద్యుత్‌ను కొన్న డిస్కంలు... సంబంధిత రూ.1,601 కోట్ల భారాన్ని వచ్చే ఏడాది వినియోగదారులపైనే మోపనున్నాయి.

Updated : 31 Jan 2023 04:50 IST

బహిరంగ మార్కెట్‌లో అధిక ధరకు కొనుగోళ్ల ప్రభావం
వచ్చే ఏడాది వినియోగదారులపైనే భారం

ఈనాడు, అమరావతి: రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) అనుమతించిన ధర కంటే... అధిక మొత్తానికి బహిరంగ మార్కెట్‌లో విద్యుత్‌ను కొన్న డిస్కంలు... సంబంధిత రూ.1,601 కోట్ల భారాన్ని వచ్చే ఏడాది వినియోగదారులపైనే మోపనున్నాయి. డిస్కంలు 2022 ఏప్రిల్‌ నుంచి సెప్టెంబరు మధ్య (ఆరు నెలల్లో) 3,590.10 మిలియన్‌ యూనిట్ల(ఎంయూ) విద్యుత్‌ను కొన్నాయి. ఇందుకోసం యూనిట్‌కు సగటున రూ.8.771 చొప్పున మొత్తం రూ.3,148.88 కోట్లను ఖర్చు చేశాయి. యూనిట్‌కు కనిష్ఠంగా రూ.7.05 వంతున.. గరిష్ఠంగా రూ.11.22 వంతున చెల్లించాయి. యూనిట్‌కు గరిష్ఠంగా రూ.4.31 చెల్లించడానికి డిస్కంలకు 2022-23 వార్షిక ఆదాయ అవసరాల నివేదిక(ఏఆర్‌ఆర్‌)లో ఏపీఈఆర్‌సీ అనుమతించింది. ఈ ప్రకారం బహిరంగ మార్కెట్‌లో కొన్న విద్యుత్‌కు రూ.1,547.33 కోట్లు మాత్రమే చెల్లించాలి. కానీ... అధిక ధరకు విద్యుత్‌ కొనడంతో అదనపు భారం వినియోగదారులపై ట్రూఅప్‌ రూపంలో పడనుంది.

వద్దనుకున్న ధరకంటే అధిక చెల్లింపు...

యూనిట్‌ ధర ఎక్కువగా ఉందన్న కారణంగా నాలుగు కేంద్ర విద్యుత్‌ ఉత్పత్తి సంస్థల (సీజీఎస్‌) నుంచి తీసుకునే విద్యుత్‌ను ఉపసంహరించాలని డిస్కంలను ఏపీఈఆర్‌సీ ఆదేశించింది. కర్ణాటక, తమిళనాడులోని సీజీఎస్‌లతో కుదుర్చుకున్న పీపీఏల ద్వారా తీసుకునే విద్యుత్‌కు డిస్కంలు సగటున రూ.6.47 వంతున చెల్లిస్తున్నాయి. కానీ,  బహిరంగ మార్కెట్‌లో యూనిట్‌కు రూ.8.77 వెచ్చించాయి. అంటే యూనిట్‌కు రూ.2.30 చొప్పున అదనంగా ఖర్చు చేశాయి.

డిస్కంలకు ‘నికర’ లోటు

ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో... దక్షిణ విద్యుత్‌ పంపిణీ సంస్థ రూ.290.32 కోట్లు, కేంద్ర విద్యుత్‌ పంపిణీ సంస్థ రూ.200.35 కోట్లు, తూర్పు విద్యుత్‌ పంపిణీ సంస్థ రూ.1,253.35 కోట్ల లోటు ఆదాయంతో ఉన్నట్లు ఏపీఈఆర్‌సీకి నివేదించాయి. మొత్తం రూ.1,744.02 కోట్ల లోటును సర్దుబాటు చేసుకోడానికి అనుమతించాలని కోరాయి. 2022-23 మొదటి ఆరు నెలల్లో 2,769 ఎంయూల మిగులు విద్యుత్‌ ఉన్నప్పటికీ... బహిరంగ మార్కెట్‌ నుంచి 3,590 ఎంయూలను డిస్కంలు కొన్నాయి. దీనికితోడు మస్ట్‌రన్‌ నిబంధన కారణంగా పునరుత్పాదక విద్యుత్‌ ఉత్పత్తి సంస్థల నుంచి వచ్చే విద్యుత్‌ తీసుకోవడంతో థర్మల్‌ యూనిట్లను బ్యాక్‌డౌన్‌ చేయాల్సి వస్తోంది. వాటి నుంచి విద్యుత్‌ తీసుకోకున్నా... స్థిర ఛార్జీలను చెల్లించాల్సి వస్తోంది. ఈ కారణంగా డిస్కంల నికర ఆదాయంపై ప్రభావం పడింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని