Taraka Ratna: వెంటిలేటర్‌పైనే తారకరత్న

గుండెపోటుతో బెంగళూరులోని నారాయణ హృదయాలయలో చేరిన సినీనటుడు నందమూరి తారకరత్నకు వెంటిలేటర్‌పైనే చికిత్స కొననసాగిస్తున్నట్లు వైద్యులు ప్రకటించారు.

Updated : 31 Jan 2023 03:55 IST

ఆరోగ్యం విషమంగానే ఉందని ప్రకటించిన వైద్యులు

ఈనాడు, బెంగళూరు: గుండెపోటుతో బెంగళూరులోని నారాయణ హృదయాలయలో చేరిన సినీనటుడు నందమూరి తారకరత్నకు వెంటిలేటర్‌పైనే చికిత్స కొననసాగిస్తున్నట్లు వైద్యులు ప్రకటించారు. సోమవారం రాత్రి ఆయన ఆరోగ్య నివేదికను విడుదల చేశారు. ‘తారకరత్న ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉంది. వెంటిలేటర్‌పైనే ఆయనకు అత్యున్నత స్థాయి చికిత్స అందిస్తున్నాం. మాధ్యమాల్లో ప్రచారమవుతున్నట్లు ఆయనకు ఎక్మో వ్యవస్థ ఏర్పాటు చేయలేదు. తారకరత్న కుటుంబసభ్యులకు ఎప్పటికప్పుడు ఆరోగ్య స్థితిపై సమాచారాన్ని అందిస్తున్నాం’ అని తాజా నివేదికలో వైద్యులు స్పష్టం చేశారు.

ఆరోగ్యం మెరుగవుతోంది: రామకృష్ణ

తమ అన్న కుమారుడు తారకరత్న ఆరోగ్యం మెరుగుపడుతోందని నందమూరి రామకృష్ణ వివరించారు. ఆయన సోమవారం తారకరత్న ఆరోగ్యంపై వైద్యులతో సంప్రదించిన తర్వాత మాధ్యమాలతో మాట్లాడారు. శరీరంలోని అవయవాలన్నీ పని చేస్తున్నాయని తెలిపారు. ‘పాక్షిక వెంటిలేషన్‌ సాయంతో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. తీవ్ర గుండెపోటు వల్ల నరాల వ్యవస్థ దెబ్బతింది. రికవరీకి సమయం పడుతుంది. మెదడుకు సంబంధించిన సమస్య తప్ప అంతా సవ్యంగానే ఉంది. నేనూ ఇలాంటి స్థితిని ఎదుర్కొన్నవాడినే. మంచి వైద్యుల పర్యవేక్షణలో తారకరత్నకు చికిత్స అందుతోంది’ అని రామకృష్ణ చెప్పారు. ఎక్మో ద్వారా తారకరత్నకు చికిత్స అందిస్తున్నట్లు మాధ్యమాల్లో దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన  మండిపడ్డారు. నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ నిత్యం తారకరత్న కుటుంబసభ్యులతోనే ఉంటూ వైద్యులతో సంప్రదిస్తున్నారు. సోమవారం కర్ణాటక ఉద్యానశాఖ మంత్రి మునిరత్న ఆస్పత్రికి వచ్చి, తారకరత్న కుటుంబసభ్యులను పరామర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని