Tamil Nadu: తెలుగువారు తలచుకుంటే సాయంత్రానికి జీవో ఖాయం: కిషన్‌రెడ్డి

తెలుగువారంతా ఏకమై తమిళనాడులో హక్కుల కోసం పోరాడితే తమిళనాడు ప్రభుత్వం సాయంత్రానికల్లా దిగొచ్చి జీవో ఇస్తుందని, అంతటి సత్తా ఇక్కడ ఉన్నవారిలో ఉందని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ జి.కిషన్‌రెడ్డి తెలిపారు.

Updated : 31 Jan 2023 08:45 IST

ఈనాడు, చెన్నై: తెలుగువారంతా ఏకమై తమిళనాడులో హక్కుల కోసం పోరాడితే తమిళనాడు ప్రభుత్వం సాయంత్రానికల్లా దిగొచ్చి జీవో ఇస్తుందని, అంతటి సత్తా ఇక్కడ ఉన్నవారిలో ఉందని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ జి.కిషన్‌రెడ్డి తెలిపారు. ఆలిండియా తెలుగు ఫెడరేషన్‌ (ఏఐటీఎఫ్‌) ఆధ్వర్యంలో చెన్నైలోని ఆస్కా భవనంలో సోమవారం జరిగిన తెలుగువారి ఆత్మీయ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఇక్కడివారు ఇతర భాషలపై మక్కువ పెంచుకోవడం, తమిళనాడు ప్రభుత్వం తెలుగువారిని ఐక్యంగా ఉంచకపోవడం లాంటి కారణాలతో తెలుగు కనుమరుగయ్యే పరిస్థితి ఉందని చెప్పారు.

‘పెన్ను కొనాలన్నా ఆర్డర్‌ ఇవ్వాలి’

కేంద్ర మంత్రిగా ఉన్న తాను జేబులో పెట్టుకునే కలం కొనాలన్నా తమకు కేటాయించిన ఒక యాప్‌లోకి వెళ్లి ఆర్డర్‌ ఇవ్వాలని కిషన్‌రెడ్డి తెలిపారు. ‘ఇలాగే కుర్చీలు, బిస్కట్లు.. ఇలా దిల్లీలోని తన కార్యాలయానికి ఏవి కావాలన్నా ఇదే ప్రక్రియ. ఆర్డర్‌ రాగానే వారికి డబ్బులు ఇచ్చేయాలి. పారదర్శకంగా ఉండేందుకు ప్రధాని మోదీ ఈ ప్రక్రియ తెచ్చారు’ అని వెల్లడించారు. కార్యక్రమంలో తమిళనాడు భాజపా సహ ఇన్‌ఛార్జి మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, ఏఐటీఎఫ్‌ అధ్యక్షుడు సీఎంకే రెడ్డి, సినీ నిర్మాత కాట్రగడ్డ ప్రసాద్‌, సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

కిషన్‌రెడ్డికి ఇరాన్‌ ప్రభుత్వ ఆహ్వానం

ఈనాడు, దిల్లీ: టెహ్రాన్‌ ఇంటర్నేషనల్‌ టూరిజం రిలేటెడ్‌ ఇండస్ట్రీస్‌ ఎగ్జిబిషన్‌(టీఐటీఈ)లో పాల్గొనాలని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డిని ఇరాన్‌ ప్రభుత్వం ఆహ్వానించింది. ఫిబ్రవరి 7వ తేదీ నుంచి 10 వరకు తమ దేశ రాజధాని టెహ్రాన్‌లో నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి హాజరవ్వాలని కోరింది. ఈ మేరకు ఇరాన్‌ సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి సయ్యద్‌ ఎజతుల్లా జర్గామీ కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి ఆహ్వానలేఖ పంపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు