స్మార్ట్ మీటర్లు వద్దన్నా డిస్కంలకు భలే ఆసక్తి
స్మార్ట్ మీటర్లలో వినియోగించే సాంకేతికత ఆమోదించదగినదేనా? వాటిలోని సాంకేతికతను అనుసంధానించే విషయంలో సమస్యలు తలెత్తుతున్నట్లు ఇటీవల కొన్ని వార్తలు వచ్చాయి. భారీ సంఖ్యలో ఏర్పాటు చేసే మీటర్ల విషయంలో మా అనుమతి లేకుండా డిస్కంలు ముందుకు వెళ్లవద్దు’
ఏపీఈఆర్‌సీ ఆమోదం లేకుండానే ఒప్పందాలు
రూ.14,495 కోట్ల విలువైన పనులకు టెండర్లు
స్మార్ట్ మీటర్లలో వినియోగించే సాంకేతికత ఆమోదించదగినదేనా? వాటిలోని సాంకేతికతను అనుసంధానించే విషయంలో సమస్యలు తలెత్తుతున్నట్లు ఇటీవల కొన్ని వార్తలు వచ్చాయి. భారీ సంఖ్యలో ఏర్పాటు చేసే మీటర్ల విషయంలో మా అనుమతి లేకుండా డిస్కంలు ముందుకు వెళ్లవద్దు’
రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) 2022-23 రిటైల్ సప్లై టారిఫ్ (ఆర్‌ఎస్‌టీ) ఆర్డర్‌లో డిస్కంలను ఉద్దేశించి ఇచ్చిన ఆదేశాలివి.
ఈనాడు, అమరావతి: ‘ఆర్‌డీఎస్‌ఎస్ పథకం కింద ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వరంగ సంస్థలు, వీధి దీపాలు, గ్రామీణ, పట్టణ తాగునీటి పథకాలు, వాణిజ్య, పారిశ్రామిక విద్యుత్ కనెక్షన్లకు మాత్రమే స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు డిస్కంలు లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చాయి. దీనివల్ల ఇతర విద్యుత్ వినియోగదారులపై ఎలాంటి ఆర్థిక భారం పడబోదని చెప్పాయి’ ఇదే విషయాన్ని ఆర్‌ఎస్‌టీ ఆర్డర్‌లో ఏపీఈఆర్‌సీ పేర్కొంది. ఈ మేరకు మీటర్ల ఏర్పాటు ఖర్చు వినియోగదారులపై మోపడానికి వీల్లేదు. అయితే అధికారులు మాత్రం మీటర్ల ఏర్పాటు, నిర్వహణ ఖర్చు మొత్తం సోషలైజ్ చేస్తామని చెబుతున్నారంటే నియంత్రణ సంస్థ ఆదేశాలను ఉల్లంఘించినట్లే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
‘స్మార్ట్’పైనే అనుమానాలు..
స్మార్ట్ మీటర్ల ఏర్పాటుపై అనుమతి లేకుండా ముందుకు వెళ్లొద్దని ఏపీఈఆర్‌సీ స్పష్టంగా చెప్పినా.. ఆ ఆదేశాలను డిస్కంలు ఖాతరు చేయడంలేదు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన సూచనలతో స్మార్ట్ మీటర్లు, అనుబంధ పరికరాలు, నిర్వహణకు టెండర్లు పిలిచాయి. రాష్ట్రంలో విద్యుత్ పంపిణీ సంస్థల పునర్వ్యవస్థీకరణ పథకం (ఆర్‌డీఎస్‌ఎస్) కింద రెండు దశల్లో కలిపి సుమారు 50 లక్షల విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తున్నాయి. ఇందులో భాగంగా మొదటి దశలో గృహ, వాణిజ్య, పారిశ్రామిక, ప్రభుత్వ కార్యాలయాలకు కలిపి మొత్తం 27.68 లక్షల మీటర్లు ఏర్పాటు చేస్తున్నాయి. వీటితో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఖర్చుతో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు 18.5 లక్షల మీటర్లను డిస్కంలు పెడుతున్నాయి. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు, అనుబంధ పరికరాలు, నిర్వహణ ఖర్చుల కింద అడ్డగోలు ధరలకు డిస్కంలు టెండర్లు పిలిచాయి. ఈ ప్రకారం ఒక్కో మీటర్‌కు రూ.35 వేల వంతున.. రూ.6,480 కోట్లు డిస్కంలు ఖర్చు చేయడంపై విద్యుత్ రంగ నిపుణులు, ప్రతిపక్షాల నుంచి ఆరోపణలు రావడంతో రద్దు చేశాయి. ధరలను సవరించి మళ్లీ టెండర్లు పిలిచాయి. సవరించిన ధరల ప్రకారం ఒక్కో మీటర్‌కు రూ.30,625 వంతున.. రూ.5,568.33 కోట్లను డిస్కంలు ఖర్చు చేస్తున్నాయి. అలాగే, గృహ, వాణిజ్య, పారిశ్రామిక విద్యుత్ కనెక్షన్లకు కూడా మీటర్ల ఏర్పాటు కోసం కేంద్రం ఇచ్చే గ్రాంటు రూ.5,356.42 కోట్లు పోను.. రూ.3,570.91 కోట్లను రుణంగా డిస్కంలు తీసుకుంటున్నాయి. మొత్తంగా వ్యవసాయ, వ్యవసాయేతర విద్యుత్ కనెక్షన్లకు కలిపి సుమారు రూ.14,495 కోట్లను డిస్కంలు ఖర్చు చేస్తున్నాయి. ఈ భారం మొత్తం పరోక్షంగా విద్యుత్ ఛార్జీల రూపేణా ప్రజలపై పడుతుంది.
ఒప్పందాలు కుదుర్చుకుని.. తీరిగ్గా ఏపీఈఆర్‌సీకి సమాచారం
విద్యుత్ సంస్థల్లో చేపట్టే అభివృద్ధి పనులు, విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి చేసే ఖర్చులకు సంబంధించి ముందస్తుగా ఏపీఈఆర్‌సీ నుంచి ఆమోదం తీసుకోవాలి. ఆ తర్వాతే తగిన చర్యలు తీసుకోవాలి. ఆర్‌డీఎస్‌ఎస్ కింద స్మార్ట్ మీటర్లకు సంబంధించి 2022-23 ఆర్‌ఎస్‌టీవోలో ఏపీఈఆర్‌సీ డిస్కంలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఈ పథకం కింద రూ.వేల కోట్లను వెచ్చించడానికి ముందే ఏపీఈఆర్‌సీ నుంచి ఆమోదం తప్పనిసరి అని పేర్కొంది. దీన్ని డిస్కంలు ఎక్కడా పాటించడం లేదు. ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాలతో ఇష్టారాజ్యంగా వ్యవహరించాయి. 2022 మార్చి 17న ఆర్‌డీఎస్‌ఎస్‌ను కేంద్రం ఆమోదించింది. దీని అమలుకు అవసరమైన ఆర్థిక సహకారాన్ని అందించేలా పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్‌సీ)తో కుదుర్చుకున్న ఒప్పందంపై రాష్ట్ర ప్రభుత్వం, డిస్కంలు 2022 మార్చి 25న సంతకాలు చేశాయి. ఈ పెట్టుబడి ప్రతిపాదనను 2022 మే 24న ఏపీఈఆర్‌సీకి డిస్కంలు అందచేశాయి. దీంతో ఒప్పందం కుదుర్చుకునేందుకు ముందు ఏపీఈఆర్‌సీ నుంచి ఎలాంటి ఆమోదాన్ని డిస్కంలు తీసుకోలేదని తేలింది. విద్యుత్ సంస్థల కార్యకలాపాలను పర్యవేక్షించే సంస్థ అనుమతి లేకుండానే స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు డిస్కంలు చకచకా ఎందుకు అడుగులు వేశాయి? ఆ భారాన్ని వినియోగదారులపై వేయబోమని చెప్పి.. ఇప్పుడు సోషలైజేషన్ చేస్తామని అధికారులు చెబుతున్నారంటే నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం కాదా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. స్మార్ట్ మీటర్ల ఏర్పాటు కోసం డిస్కంలు పంపిన ప్రతిపాదనకు ఇప్పటికీ ఏపీఈఆర్‌సీ ఆమోదం లేదు.
డిస్కంలే మీటర్లు ఎందుకు కొనాలి?
ఏపీఈఆర్‌సీ నిబంధనల ప్రకారం ఫలానా మీటరే కొనాలని వినియోగదారులను డిస్కంలు ఒత్తిడి చేయకూడదు. ఈ విషయాన్ని 2006 జనవరి 6న జారీ చేసిన నిబంధనల్లో ఏపీఈఆర్‌సీ స్పష్టంగా పేర్కొంది. నిబంధనల ప్రకారం వినియోగదారుడు డిస్కంలు గుర్తించిన కంపెనీల నుంచి మీటర్‌ను కొనాలి. దీనికోసం మీటర్ల తయారీ కంపెనీల జాబితాను డిస్కంలు ఎప్పటికప్పుడు ప్రకటించాలి. ఒకవేళ వినియోగదారుడు కోరితేనే మీటరు ఏర్పాటు చేసి.. ఆ ఖర్చును వినియోగదారుడి నుంచి వసూలు చేయాలి. ఈ నిబంధనకు విరుద్ధంగా స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు చేసే ఖర్చును సోషలైజేషన్ పేరిట ప్రతి వినియోగదారుడిపై వేస్తామని ఇటీవల నిర్వహించిన విలేకరుల సమావేశంలో సాక్షాత్తు ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్ చెప్పారు. అలాగే వ్యవసాయ కనెక్షన్లకు ప్రభుత్వం చేసే ఖర్చుభారం కూడా అంతిమంగా ప్రజలపైనే పడుతుంది. ప్రస్తుతం వినియోగిస్తున్న ఐఆర్‌డీఏ మీటర్లను 10 ఏళ్ల నుంచే డిస్కంలు ఏర్పాటు చేస్తున్నాయి. వాటి స్థానంలో స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేసినా.. కేవలం ఆన్‌లైన్ విధానంలో మీటర్ రీడింగ్ నమోదు చేసే వెసులుబాటు మాత్రమే డిస్కంలకు కలుగుతుంది. ఐఆర్‌డీఏ, స్మార్ట్ మీటర్లలో వినియోగించే సాంకేతికతలో అంతకు మించి ఎలాంటి వ్యత్యాసం లేదని నిపుణులు చెబుతుండటం గమనార్హం.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
ashok chavan: మోదీ బండారం బయటపడుతుందనే రాహుల్‌పై అనర్హత: అశోక్ చవాన్
-
India News
అగ్గి చల్లారిందా..? రాహుల్-ఉద్ధవ్ మధ్య ‘సావర్కర్ వివాదం’ సద్దుమణిగిందా..?
-
General News
Viveka Murder Case: ముందస్తు బెయిల్ ఇవ్వండి.. హైకోర్టును ఆశ్రయించిన అవినాష్‌రెడ్డి
-
Movies News
Social Look: పల్లెటూరి అమ్మాయిగా దివి పోజు.. శ్రీముఖి ‘పింక్’ పిక్స్!
-
World News
Mexico-US Border: శరణార్థి శిబిరంలో ఘోర అగ్నిప్రమాదం.. 39 మంది మృతి..!
-
Sports News
Cricket: నాన్‌స్ట్రైకర్ రనౌట్.. బ్యాట్ విసిరి కొట్టిన బ్యాటర్