CM Jagan: త్వరలో విశాఖే రాజధాని
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చిన ఏ పారిశ్రామికవేత్తకైనా.. ఎలాంటి అసౌకర్యం కలిగినా పరిష్కరించేందుకు ఒక్క ఫోన్‌కాల్ దూరంలో అందుబాటులో ఉంటాం.
రాబోయే నెలల్లో నా మకాం అక్కడికే..
దౌత్యవేత్తలు, పారిశ్రామికవేత్తల సదస్సులో సీఎం జగన్ ప్రకటన
ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులతో రావాలని పిలుపు
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చిన ఏ పారిశ్రామికవేత్తకైనా.. ఎలాంటి అసౌకర్యం కలిగినా పరిష్కరించేందుకు ఒక్క ఫోన్‌కాల్ దూరంలో అందుబాటులో ఉంటాం.
సీఎం
ఈనాడు, అమరావతి: విశాఖపట్నం త్వరలో ఆంధ్రప్రదేశ్ రాజధాని కాబోతోందని, రాబోయే కొన్ని నెలల్లో తన మకాం అక్కడికే మారనుందని ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. విశాఖలో మార్చి 3, 4 తేదీల్లో నిర్వహిస్తున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సుకు సన్నాహకంగా దిల్లీలోని లీలా ప్యాలెస్ హోటల్‌లో మంగళవారం నిర్వహించిన అంతర్జాతీయ దౌత్యవేత్తలు, పారిశ్రామిక ప్రతినిధుల సమావేశంలో ప్రసంగిస్తూ ఆయన ఈ విషయం చెప్పారు. ముఖ్యమంత్రి తన ప్రసంగంలో కాబోయే రాజధాని విశాఖేనని స్పష్టంగా చెప్పగా.. ఆయన కార్యాలయం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో మాత్రం దానిని ‘కార్యనిర్వాహక రాజధాని’గా మార్చారు. ‘పెట్టుబడిదారుల సదస్సుకు మీ అందరినీ వ్యక్తిగతంగా ఆహ్వానిస్తున్నా. సదస్సుకు హాజరవడంతోపాటు, రాష్ట్రంలో పెట్టుబడులకూ ముందుకు రావాలని కోరుతున్నా. మీతోపాటు విదేశాల్లోని మీ కంపెనీల సహచరులనూ తీసుకురండి. ఏపీలో వ్యాపారం చేయడం ఎంత సులభమో స్వయంగా చూడండి’ అని జగన్ పేర్కొన్నారు.
పెట్టుబడులకు ఏపీ అత్యంత అనుకూలం
దేశంలోని మిగతా రాష్ట్రాల కంటే ఏపీలో పెట్టుబడులు పెట్టేవారికి భిన్నమైన అనుకూలతలు ఉన్నాయని జగన్ పేర్కొన్నారు. ఏపీకి పెట్టుబడులతో వచ్చేవారికి తమ ప్రభుత్వం పూర్తి సహకారం అందజేస్తుందని, ప్రపంచంలో పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన దేశాల్లో భారత్ ఇప్పటికే ముందంజలో ఉందని, ప్రపంచ వేదికపై దేశాన్ని ఆ స్థాయిలో నిలబెట్టినందుకు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. ‘ఆంధ్రప్రదేశ్ జీఎస్‌డీపీలో 11.43% వృద్ధితో దేశంలోనే వేగంగా పురోగమిస్తున్న రాష్ట్రాల్లో అగ్రగామిగా నిలిచింది. సులభతర వాణిజ్యంలో మూడేళ్లుగా ఏపీ మొదటి స్థానంలో ఉంది. రాష్ట్రానికి పరిశ్రమలను ఆకర్షించేందుకు మేం చేస్తున్న కృషితోపాటు, రాష్ట్రంలో ఉన్న అనుకూల వాతావరణంపై పారిశ్రామికవేత్తలు బాగా చెప్పడంవల్లే మేం మూడేళ్లుగా మొదటి స్థానంలో స్థిరంగా కొనసాగుతున్నాం. పరిశ్రమల స్థాపనకు ఏపీ ఎంత అనుకూలమో చెప్పేందుకు ఇదే నిదర్శనం’ అని పేర్కొన్నారు. రాష్ట్రంలో సింగిల్ డెస్క్ పోర్టల్ విధానంలో పరిశ్రమలకు 21 రోజుల్లోనే అనుమతులు మంజూరు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో 48 రకాల ఖనిజ నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, ఖనిజాధార పరిశ్రమల ఏర్పాటుకు అత్యంత అనుకూలమని తెలిపారు. ‘974 కిలోమీటర్ల సుదీర్ఘ తీర ప్రాంతం ఉంది. 4 ప్రాంతాల్లో 6 ఓడరేవులున్నాయి. మరో 4 ఓడరేవులు నిర్మిస్తున్నాం. 6 విమానాశ్రయాలున్నాయి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో 3 పారిశ్రామిక కారిడార్లను అభివృద్ధి చేస్తున్నాం. పారిశ్రామికవేత్తలకు ఉన్న అనుకూలతలు, అనుసంధానానికి ఇవి నిదర్శనం’ అని జగన్ పేర్కొన్నారు. సమావేశంలో మంత్రులు రాజేంద్రనాథ్‌రెడ్డి, గుడివాడ అమర్‌నాథ్ తదితరులు పాల్గొన్నారు.
సమావేశంలో పాల్గొన్న ప్రతినిధులు వ్యక్తంచేసిన అభిప్రాయాలివీ..
రెండో ప్రాజెక్టు ఏర్పాటు చేస్తున్నాం
- సెర్జియో లీ, డైరెక్టర్, అపాచె, హిల్‌టాప్ గ్రూప్ (తైవాన్)
2006లో ఏపీలో బూట్ల తయారీ పరిశ్రమ ఏర్పాటు చేశాం. ప్రస్తుత ముఖ్యమంత్రి తండ్రి సీఎంగా ఉండగా మేం ఎంవోయూ కుదుర్చుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేకపోతే ఈ స్థాయిలో విజయం సాధ్యమయ్యేది కాదు. ఇప్పుడు రెండో ప్రాజెక్టు ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. గ్రీన్ ఎనర్జీ కాన్సెప్ట్‌తో ఆధునిక టెక్నాలజీతో ఆ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తాం.
ఏపీలో పరిశ్రమల విస్తరణ
-రోషన్ గుణవర్ధన, డైరెక్టర్, ఎవర్టన్ టీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (ఇటలీ)
ఏపీలో టీ తోటలు లేకపోయినా... రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకంతో ఇక్కడ మా పరిశ్రమలు ఏర్పాటు చేశాం. మా యూనిట్లలో పని చేసే వారిలో 99% స్థానికులే. ఏపీలో మా పరిశ్రమలను మరింత విస్తరించే యోచనలో ఉన్నాం. ప్రభుత్వం నుంచి మరింత సహకారం ఆశిస్తున్నాం.
ప్రభుత్వ సహకారంతోనే అగ్రశ్రేణి వాహన సంస్థగా నిలిచాం
- తే జిన్ పార్క్, ఎండీ, సీఈఓ, కియా మోటార్స్ (కొరియా)
వాహన పరిశ్రమల అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. 2017లో మేం రాష్ట్రానికి వచ్చినప్పటి నుంచి... భూసేకరణ, విద్యుత్, నీటి సదుపాయం కల్పించడం, పోర్టులకు అనుసంధానం వంటి విషయాల్లో ఎనలేని సహకారం అందించింది. దానివల్లే కియా ఇప్పుడు దేశంలో అగ్రశ్రేణి వాహన సంస్థగా నిలిచింది. ఏటా 3 లక్షల కార్లను ఉత్పత్తి చేస్తున్నాం. కృష్ణపట్నం, చెన్నై రేవులకు సమీపంలో మా పరిశ్రమ ఉండటంవల్ల... 95 దేశాలకు కార్లను ఎగుమతి చేస్తున్నాం.
సింగిల్‌విండో అనుమతులు భేష్
- దీపక్ ధర్మరాజన్ అయ్యర్, ప్రెసిడెంట్, క్యాడ్‌బరీ ఇండియా (అమెరికా)
శ్రీసిటీలో 2016లో పరిశ్రమ ప్రారంభించాం. రూ.2,500 కోట్ల పెట్టుబడి పెట్టాం. ప్రత్యక్షంగా 6వేల మందికి, పరోక్షంగా కొన్నివేల మందికి ఉపాధి కల్పించాం. మా పరిశ్రమలో 50% మహిళలే పని చేస్తున్నారు. మేం చాక్లెట్ల తయారీతోపాటు... ఏపీలో కోకో తోటలూ పెంచుతున్నాం. 3-4వేల మంది రైతుల్ని కోకో సాగులోకి తెచ్చాం. దేశంలో ఉత్తమమైన సింగిల్‌విండో క్లియరెన్స్ విధానం ఏపీలో ఉంది.
2030కి పెట్టుబడి రెట్టింపు చేస్తాం
- యమగుచి, ఎండీ, సీఈఓ, తోరే ఇండస్ట్రీస్ (జపాన్)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి మాకు పూర్తి సహకారం అందుతోంది. రాష్ట్రంలో రెండు బిజినెస్ యూనిట్లలో రూ.వెయ్యి కోట్ల పెట్టుబడి పెట్టాం. అంతలో కొవిడ్ మహమ్మారి వచ్చింది. ప్రభుత్వ సహకారంతో 2020 జూన్ నుంచి ఉత్పత్తి ప్రారంభించాం. 2030 నాటికి రాష్ట్రంలో మా కంపెనీ పెట్టుబడులు రెట్టింపు చేయాలన్నది లక్ష్యం.
పెట్టుబడులకు అనుకూలం
- ఫణికుమార్, సీఎండీ, సెయింట్ గోబైన్ ఇండస్ట్రీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (ఫ్రాన్స్)
ఏపీలో కొవిడ్ సమయంలో ఫ్యాక్టరీ ప్రారంభించాం. ప్రభుత్వం, అధికారుల నుంచి మంచి సహకారం లభించింది. ఏపీలో నైపుణ్యం గల మానవ వనరులకు కొరత లేదు. ఏపీ ప్రభుత్వం పరిశ్రమలకు సకాలంలో రాయితీలు అందిస్తోంది. సులభతర వాణిజ్యంతో నిలకడగా మెరుగైన ఫలితాలు సాధిస్తోంది. భారత్‌లో పెట్టుబడి పెట్టాలనుకున్న వారు... మొదట ఏపీవైపే చూడాలి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Bandi Sanjay: కేటీఆర్ పరువు ₹100 కోట్లయితే.. యువత భవిష్యత్తుకు మూల్యమెంత?: బండి సంజయ్
-
Movies News
Parineeti: ఆప్ ఎంపీతో డేటింగ్ రూమర్స్..పరిణీతి స్పందనేంటి?
-
General News
Andhra News: ప్రభుత్వం మోసం చేస్తున్నందునే ఉద్యమ కార్యాచరణ: బొప్పరాజు వెంకటేశ్వర్లు
-
Sports News
IPL 2023: ఐపీఎల్ 2023.. ప్రారంభోత్సవంలో తమన్నా సందడి!
-
Politics News
Girish Bapat: భాజపా ఎంపీ గిరీశ్ బాపట్ కన్నుమూత.. ప్రధాని మోదీ విచారం
-
General News
TSPSC: గ్రూప్-1 ప్రిలిమ్స్ పేపర్ ఇంకెవరికైనా ఇచ్చారా?.. ముగ్గురు నిందితులను విచారిస్తున్న సిట్