ఉద్యోగ సంఘానికి భావ ప్రకటన స్వేచ్ఛ లేదా?

ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి జారీ చేసిన సంజాయిషీ (షోకాజ్‌) నోటీసుపై తీర్పు ఇచ్చేంత వరకూ తుది నిర్ణయం తీసుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు తేల్చి చెప్పింది.

Published : 01 Feb 2023 05:02 IST

వారు సమస్యలపై పోరాడకూడదా?
మీడియాతో మాట్లాడిన మాటల్లో ప్రభుత్వాన్ని కించపరిచినట్లు ఎక్కడుంది?
రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు

ఈనాడు, అమరావతి: ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి జారీ చేసిన సంజాయిషీ (షోకాజ్‌) నోటీసుపై తీర్పు ఇచ్చేంత వరకూ తుది నిర్ణయం తీసుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు తేల్చి చెప్పింది. ‘సమస్యలపై మాట్లాడే భావ ప్రకటన స్వేచ్ఛ ఉద్యోగుల సంఘానికి లేదా? సమస్యలపై పోరాడకూడదా? రాజ్యాంగం కల్పించిన హక్కుల పరిస్థితేమిటి? ఉద్యోగుల సంఘానికి అధికరణ 19 వర్తించదా? మీడియాతో మాట్లాడిన మాటల్లో ప్రభుత్వాన్ని కించపరిచినట్లు ఎక్కడుంది? వారు ఏ నిబంధనను ఉల్లంఘించారో మీరిచ్చిన షోకాజ్‌ నోటీసులో పేర్కొనలేదేం’ అంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రవినాథ్‌ తిల్హరీ మంగళవారం ఈ పిటిషన్‌పై విచారణ జరిపారు. ఇరువైపులా వాదనలు ముగియడంతో తీర్పును వాయిదా (రిజర్వు) వేశారు.

జీతాల్ని మరుసటి నెల 15న చెల్లిస్తున్నారు

ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు అందేలా చట్టం చేయాలని కోరుతూ గవర్నర్‌ను కలిసిన వ్యవహారంపై సంజాయిషీ ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వం షోకాజ్‌ నోటీసు ఇవ్వడంపై ‘ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం’ అధ్యక్షుడు కేఆర్‌ సూర్యనారాయణ హైకోర్టులో వ్యాజ్యం వేసిన విషయం తెలిసిందే. పిటిషనరు తరఫున సీనియర్‌ న్యాయవాది వైవీ రవిప్రసాద్‌, న్యాయవాది పీవీజీ ఉమేశ్‌ చంద్ర వాదనలు వినిపించారు. ‘విశ్రాంత ఉద్యోగుల పింఛను, ఉద్యోగుల జీతాలను మరుసటి నెల 15న ఇస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉద్యోగుల జీపీఎఫ్‌ సొమ్ము రూ.413 కోట్లను వారికి తెలియకుండా ప్రభుత్వం మళ్లించింది. ఉద్యోగులకు జీతాలతోపాటు ఇతర ఆర్థిక ప్రయోజనాలను సకాలంలో అందించాలని గవర్నర్‌ను కలిసి విన్నవించాం. గవర్నర్‌ను కలిశాక రాష్ట్ర ప్రభుత్వం మాకు షోకాజ్‌ నోటీసు ఇచ్చింది. వివరణ ఇవ్వాలని.. లేని పక్షంలో వారంలో సంఘం గుర్తింపును ఉపసంహరిస్తామని పేర్కొంది. మీడియా ముందు ప్రభుత్వంపై ఎలాంటి ఆరోపణలూ చేయలేదు. ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకొని నోటీసు ఆధారంగా తదుపరి చర్యలను నిలువరించండి’ అని పిటిషనరు తరఫు న్యాయవాదులు కోరారు. సాధారణ పరిపాలనాశాఖ (సర్వీసు సంక్షేమం) కార్యదర్శి తరఫున జీపీ మహేశ్వరరెడ్డి వాదనలు వినిపిస్తూ... షోకాజ్‌ నోటీసును సవాలు చేయడానికి వీల్లేదని, వివరణ ఇచ్చాక తగిన ఉత్తర్వులిస్తామని పేర్కొన్నారు. న్యాయమూర్తి స్పందిస్తూ... ‘ఏ నిబంధనను ఉల్లంఘిస్తే నోటీసు ఇచ్చారో ఆ వివరాలు షోకాజ్‌లో ఎక్కడున్నాయి? ప్రభుత్వాన్ని కించపరిచేలా చేసిన వ్యాఖ్యలేవీ’ అని ప్రశ్నించారు. జీపీ బదులిస్తూ... ‘గవర్నర్‌కు వినతిపత్రం ఇస్తే తప్పులేదుగానీ... రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక స్థితిపై మీడియాతో మాట్లాడారు. కొన్ని అంశాల్ని గోప్యంగా ఉంచాలి. వాటిని బహిర్గతం చేయడాన్ని భావ ప్రకటన స్వేచ్ఛగా పరిగణించలేం’ అని పేర్కొన్నారు. సమయం ఇస్తే పూర్తి వివరాలను కోర్టు ముందు ఉంచుతామని చెప్పారు. ఇరువైపులా వాదనలు ముగియడంతో న్యాయమూర్తి తీర్పును రిజర్వు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని