హలో.. అనాలంటేనే వణుకు

రాష్ట్రంలో వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లుతోందా? రాజ్యాంగం కల్పించిన హక్కులకు విఘాతం కలుగుతోందా? ఎవరైనా ఇద్దరు వ్యక్తులు ఫోన్లో మాట్లాడుతుంటే వారికి తెలియకుండానే మధ్యలో చొరబడి ఆ సంభాషణలను రహస్యంగా వింటున్నారా? సంక్షిప్త సందేశాలు చదువుతున్నారా? రాష్ట్రంలో గత మూడున్నరేళ్లుగా ప్రతి ఒక్కరిలోనూ ఈ అనుమానులున్నాయి.

Published : 01 Feb 2023 05:02 IST

ఫోన్‌ ట్యాపింగ్‌ల నేపథ్యంలో ఆందోళన
ఇద్దరు వైకాపా ఎమ్మెల్యేల ప్రకటనతో అభద్రత

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లుతోందా? రాజ్యాంగం కల్పించిన హక్కులకు విఘాతం కలుగుతోందా? ఎవరైనా ఇద్దరు వ్యక్తులు ఫోన్లో మాట్లాడుతుంటే వారికి తెలియకుండానే మధ్యలో చొరబడి ఆ సంభాషణలను రహస్యంగా వింటున్నారా? సంక్షిప్త సందేశాలు చదువుతున్నారా? రాష్ట్రంలో గత మూడున్నరేళ్లుగా ప్రతి ఒక్కరిలోనూ ఈ అనుమానులున్నాయి. అయితే ‘మా ఫోన్లు ట్యాపింగ్‌ చేస్తున్నారు’ అని అధికార వైకాపాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు తాజాగా ప్రకటించిన నేపథ్యంలో ఆ సందేహాలు మరింత రూఢీ అవుతున్నాయి. ఇది ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, అధికారుల్లోనే కాదు.. సామాన్య పౌరుల్లోనూ అభద్రత భావం పెంచుతోంది. ఫోన్‌లో తాము మాట్లాడే మాటలు.... ఎవరైనా వింటున్నారేమోనన్న ఆందోళన, అనుమానం అందర్నీ వెంటాడుతోంది. సాధారణ ఫోన్‌ కాల్స్‌కు బదులుగా వాట్సాప్‌, టెలీగ్రామ్‌, ఫేస్‌టైమ్‌ వంటి యాప్‌ల్లో మాట్లాడుతున్నామంటూ చెప్పటం ఆందోళనకు అద్దంపడుతోంది.

ఫోన్‌లోనా.. వద్దంటే వద్దు

రాష్ట్రంలో ప్రముఖ స్థానాల్లో ఉన్న వారిలో అత్యధికులు... ఫోన్‌ కాల్‌లో మాట్లాడటానికి నిరాకరిస్తున్నారు. నేరుగా కలిసినప్పుడు మాట్లాడదామంటూ దాటవేస్తున్నారు. మరీ అత్యవసరమైతే ఫేస్‌టైమ్‌ యాప్‌లో మాట్లాడుతున్నారు. ఐఫోన్లు వాడేవారికి మాత్రమే ఈ యాప్‌ అందుబాటులో ఉంటోంది. రాజకీయ నాయకులైతే ఫోన్లో మాట్లాడాలంటేనే వణికిపోతున్నారు. ఎవరైనా ఇద్దరు వ్యక్తులు ఫోన్లో మాట్లాడుకుంటే వారికి తెలియకుండానే మధ్యలో చొరబడి సంభాషణలు వినడాన్ని, సంక్షిప్తసందేశాలు చదవడాన్నే ఫోన్‌ ట్యాపింగ్‌ (ఇంటర్‌సెప్షన్‌) అంటారు. రాష్ట్ర పోలీసులు, కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇండియన్‌ టెలీగ్రాఫ్‌ చట్టం-1885లోని సెక్షన్‌ 5(2) ప్రకారం ఫోన్లు ట్యాప్‌ చేయొచ్చు. అయితే ఎవరివంటే వారి ఫోన్లు ట్యాపింగ్‌ చేయటానికి వీల్లేదు. అత్యవసర పరిస్థితుల్లో, ప్రజాభద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉన్న సందర్భాల్లో ఆ సంఘ విద్రోహక శక్తుల సంభాషణలు వినటానికి మాత్రమే ఫోన్‌ ట్యాపింగ్‌ చేయాలి.

ట్యాప్‌ చేయాలనుకుంటే..

తగిన కారణాలను వివరిస్తూ రాష్ట్ర స్థాయిలో అయితే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన న్యాయ, హోంశాఖ ముఖ్య కార్యదర్శులుగా ఉన్న సమీక్ష కమిటీకి అనుమతి కోసం పంపించాలి. కేంద్ర స్థాయిలో అయితే క్యాబినెట్‌ సెక్రటరీ ఆధ్వర్యంలోని కమిటీ అనుమతి పొందాలి. ఒకసారి ఫోన్‌ ట్యాపింగ్‌కు అనుమతి పొందితే అది 60 రోజుల పాటు అమల్లో ఉంటుంది. ఆ గడవు ముగిశాక మళ్లీ అనుమతి తీసుకోవాలి. అది కూడా 180 రోజులకు మించకూడదు. ఏపీలో ప్రస్తుతం నిఘా విభాగాధిపతి, ఎస్‌ఐబీ, కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ విభాగాల అధిపతులకు ప్రభుత్వం ఈ అధికారాన్ని ఇచ్చింది.

అందరిలోనూ ఆందోళన

సంఘ విద్రోహక శక్తుల పీచమణిచేందుకు ఉపయోగించాల్సిన ఫోన్‌ ట్యాపింగ్‌ విధానాన్ని....రాజకీయంగా గిట్టని వారు.. సొంత పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులపైనే వైకాపా ప్రభుత్వం ప్రయోగిస్తోందని స్వయంగా ఆ పార్టీ ఎమ్మెల్యేలు బహిరంగంగా వ్యాఖ్యానించటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. దీంతో చట్ట విరుద్ధంగా తమ ఫోన్లు ట్యాపింగ్‌కు గురువుతున్నాయన్న ఆందోళన, అభద్రత ఇప్పుడు ప్రతి ఒక్కరిలోనూ నెలకొంది. చివరికి ఫోన్లో స్వేచ్ఛగా మాట్లాడుకోలేని పరిస్థితి ఏర్పడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని