ఒక్క ఫోన్‌కాల్‌ దూరంలో అందుబాటులో ఉంటాం

రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చిన ఏ పారిశ్రామికవేత్తకైనా.. ఎలాంటి అసౌకర్యం కలిగినా దాన్ని పరిష్కరించేందుకు ఒక్క ఫోన్‌కాల్‌ దూరంలో అందుబాటులో ఉంటామని ముఖ్యమంత్రి జగన్‌ హామీ ఇచ్చారు.

Updated : 01 Feb 2023 08:51 IST

మీకు ఏ సమస్య వచ్చినా తక్షణం పరిష్కరిస్తాం
పారిశ్రామికవేత్తలకు ముఖ్యమంత్రి జగన్‌ భరోసా
పెట్టుబడులతో రావాలని విజ్ఞప్తి

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చిన ఏ పారిశ్రామికవేత్తకైనా.. ఎలాంటి అసౌకర్యం కలిగినా దాన్ని పరిష్కరించేందుకు ఒక్క ఫోన్‌కాల్‌ దూరంలో అందుబాటులో ఉంటామని ముఖ్యమంత్రి జగన్‌ హామీ ఇచ్చారు. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన అత్యుత్తమ సదుపాయాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. ‘‘మేం పారిశ్రామికవేత్తలకు అత్యంత అనుకూల వాతావరణాన్ని నెలకొల్పాం. పరిశ్రమలకు అవసరమైన భూమి, విద్యుత్‌, నీరు... మిగతా రాష్ట్రాల సగటుధర కంటే తక్కువకు అందజేస్తున్నాం. పునరుత్పాదక ఇంధన రంగంలో ఏపీకి పుష్కలమైన వనరులున్నాయి. 33 వేల మెగావాట్‌ల పంప్డ్‌స్టోరేజి ప్రాజెక్టులకు అవకాశముంది. భవిష్యత్తులో గ్రీన్‌ఎనర్జీలో ఏపీ కీలకపాత్ర పోషించబోతోంది’ అని జగన్‌ పేర్కొన్నారు. మార్చి 3, 4 తేదీల్లో విశాఖలో నిర్వహిస్తున్న గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమిట్‌కు సన్నాహకంగా దిల్లీలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.


గ్రీన్‌ హైడ్రోజన్‌ ప్రాజెక్టులకు అత్యంత అనుకూలం
- సుమంత్‌ సిన్హా, అసోచామ్‌ అధ్యక్షుడు

ఆంధ్రప్రదేశ్‌ కొత్త రాష్ట్రం. పెట్టుబడులకు విస్తృత అవకాశాలున్నాయి. వాటిని పారిశ్రామికవేత్తలు అందిపుచ్చుకుంటారని ఆశిస్తున్నాను. కొత్త పరిశ్రమల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్‌ చిరునామాగా మారుతుంది. చాలా రాష్ట్రాల కంటే ఏపీ మెరుగైన పనితీరు కనబరుస్తోంది. పునరుత్పాదక, శుద్ధ ఇంధన ప్రాజెక్టులకు ఏపీ అత్యంత అనుకూలం. సౌర, పవన విద్యుత్తుకు అవసరమైన వనరులున్న కొన్ని రాష్ట్రాల్లో ఏపీ ఒకటి. అక్కడ హైబ్రిడ్‌ ప్రాజెక్టులూ పెట్టొచ్చు. సుదీర్ఘమైన తీరప్రాంతం ఉండటం గ్రీన్‌ హైడ్రోజన్‌ ప్రాజెక్టుల ఏర్పాటుకు అత్యంత అనుకూలం.


డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌లో ఏపీకి అనుకూలతలు
- దేవయాని ఘోష్‌, నాస్కామ్‌ అధ్యక్షురాలు

రవాణా, మౌలిక వసతులు, పోర్టు ఆధారిత మౌలిక సదుపాయాలు కలిగి ఉండటం, సులభతర వాణిజ్యంలో నం.1గా ఉండటం ఆంధ్రప్రదేశ్‌కి పెట్టుబడుల్ని ఆకర్షించడంలో ఉపయోగపడే అంశాలు. ఇంధనం, సప్లైచైన్‌ నిర్వహణ, మెరుగైన పోర్టు ఆధారిత మౌలిక వసతులు, డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌లో ముందంజలో ఉన్నవారు లీడర్లుగా మారతారు. మిగతావారు ఫాలోయర్స్‌గా మిగిలిపోతారు. ఆయా అంశాల్లో ఏపీకి ఇప్పటికే అనేక అనుకూలతలు ఉన్నాయి.


పెట్టుబడుల్ని ఆకర్షించేందుకు మంచి వేదిక
-సుచిత్ర ఎల్ల, సీఐఐ సదరన్‌ రీజియన్‌ ఛైర్‌పర్సన్‌

ఆంధ్రప్రదేశ్‌ను పెట్టుబడులకు అనుకూలమైన రాష్ట్రంగా ప్రపంచానికి చాటిచెప్పేందుకు నిర్వహిస్తున్న గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమిట్‌కు జాతీయ పారిశ్రామిక భాగస్వామిగా సీఐఐ వ్యవహరిస్తున్నందుకు సంతోషంగా ఉంది. పెట్టుబడుల్ని ఆకర్షించేందుకు అది మంచి వేదిక. వ్యవసాయం, ఆహారశుద్ధి, ఎంఎస్‌ఎంఈ, రసాయనాలు, స్టార్టప్స్‌, ఐటీ, ఎలక్ట్రానిక్స్‌, టెక్స్‌టైల్స్‌, రక్షణ, ఏరోస్పేస్‌, మైనింగ్‌, పర్యాటకం, ఫార్మా, ఆటోమోటివ్‌, పునరుత్పాదక ఇంధన వనరుల రంగాల్లో ఏపీలో పెట్టుబడులకు విస్తృత అవకాశాలున్నాయి. పారిశ్రామికవేత్తలు వీటిని అందిపుచ్చుకోవాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని