ఆత్మస్థైర్యంతో ఏదైనా సాధ్యమే... నేనే సాక్ష్యం

‘జీవితంలో ఏం సాధించాలన్నా ధైర్యం, ఆత్మస్థైర్యం ఉండాలి. అవి ఉంటేనే విజయం మీ సొంతమవుతుంది. నాకు పుట్టుకతోనే రెండు కాళ్లు, చేతులు లేవు.

Published : 01 Feb 2023 04:54 IST

ప్రఖ్యాత ప్రేరణకర్త నిక్‌ వుజిసిక్‌

ఈనాడు, అమరావతి: ‘జీవితంలో ఏం సాధించాలన్నా ధైర్యం, ఆత్మస్థైర్యం ఉండాలి. అవి ఉంటేనే విజయం మీ సొంతమవుతుంది. నాకు పుట్టుకతోనే రెండు కాళ్లు, చేతులు లేవు. అయినా పట్టుదలతో ముందుకు సాగుతున్నా. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మందిని ఉత్తేజ పరిచేలా ప్రసంగాలిస్తున్నా. ధైర్యంగా ముందుకు సాగడమే నాకున్న బలం’ అని అంతర్జాతీయ ప్రఖ్యాత ప్రేరణవక్త, రచయిత నిక్‌ వుజిసిక్‌ విద్యార్థులకు స్పష్టంచేశారు. మంగళవారం రాత్రి గుంటూరు బీఆర్‌ స్టేడియంలో భరత్‌రెడ్డి నిత్య వెల్ఫేర్‌ సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో ‘ఇంపాజిబుల్‌ టు పాజిబుల్‌’ అనే అంశంపై వేల మంది పాఠశాల విద్యార్థులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ‘జీవితంలో కష్టాలు, సమస్యలు, సవాళ్లు ప్రతి ఒక్కరికీ ఉండేవే. అలాగని కుంగిపోవద్దు. ఎలా పరిష్కరించుకోవాలో మనసు పెట్టి నింపాదిగా ఆలోచిస్తే కచ్చితంగా పరిష్కారాలు దొరుకుతాయి. చాలామందిలో ఈ నైపుణ్యం లోపించే కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. పిల్లలు ప్రయోజకులుగా మారడానికి తల్లిదండ్రుల కృషి నూరు శాతం కావాలి. నాకు నా తల్లిదండ్రుల నుంచి ఆ రకమైన సహకారం లభించటంతోనే జీవితంలో విజయం సాధించా. మొదట అనేక పాఠశాలలు నా ప్రేరణ తరగతులకు నిరాకరించాయి. నేను వెళితే అక్కడి పిల్లలు భయపడతారని హేళన చేసినవారూ లేకపోలేదు. అలా అని కుంగిపోలేదు. ఏదైనా సానుకూలంగా తీసుకోవాలి. ఇతరులను చులకనగా చూడొద్దు. ప్రేమ, ఆప్యాయతలను పంచండి’ అన్నారు.

పుస్తకాల్లో నుంచి నేరుగా...

‘పదో తరగతి ఆంగ్ల పుస్తకంలో నా జీవితంపై పాఠం పొందుపరచిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి నా కృతజ్ఞతలు. ఇప్పటివరకు మీరు నా గురించి పుస్తకాల్లోనే చదువుకున్నారు. ప్రస్తుతం నేరుగా మీ ముంగిటకే వచ్చి ప్రసంగించటం అదృష్టంగా భావిస్తున్నా. భారతీయ యువతలో మేధోశక్తికి కొదవలేదు. ఈ దేశాన్ని ఆర్థికంగా పరిపుష్ఠం చేయడానికి మీ అందరి ఆలోచనలకు పదునుపెట్టండి. దేశానికి సేవ చేయండి’ అంటూ ప్రసంగాన్ని ముగించారు. అంతకుముందు గుంటూరులోని చౌత్రా ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో నిక్‌ వుజిసిక్‌ మమేకమయ్యారు. విద్యార్థులు నిక్‌ బలాలు, బలహీనతలు, ప్రేమ వివాహం తదితర అంశాలపై ప్రశ్నలు అడిగారు. జిల్లా యంత్రాంగం ఆయన్ని సత్కరించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని