సరిపడా యూరియా ఏదీ?

రాష్ట్రంలో రబీ సాగు భారీగా తగ్గినా.. అందుకు సరిపడా ఎరువులు అందుబాటులో లేవు. కొద్ది రోజులుగా యూరియా కొరత వెంటాడుతోంది.

Updated : 01 Feb 2023 05:44 IST

దుకాణాల చుట్టూ తిరుగుతున్న రైతులు
ప్రైవేటులో అదనంగా వసూలు

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో రబీ సాగు భారీగా తగ్గినా.. అందుకు సరిపడా ఎరువులు అందుబాటులో లేవు. కొద్ది రోజులుగా యూరియా కొరత వెంటాడుతోంది. ఎప్పటికప్పుడు సర్దుబాటు చేస్తున్నామని చెప్పడం తప్పితే.. అవసరం మేరకు నిల్వలను సిద్ధం చేయడంపై ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదు. రైతులు బస్తాకు రూ.60 నుంచి రూ.100 వరకు అదనంగా చెల్లించి కొనుగోలు చేయాల్సి వస్తోంది. రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎరువుల్ని అందుబాటులో ఉంచామని చెబుతున్నా.. అక్కడికెళ్లిన అన్నదాతలకు నిల్వలు లేవనే సమాధానం వస్తోంది. పలుకుబడి ఉన్న వారికి, అధికార పార్టీకి చెందిన వారికే ప్రాధాన్యం లభిస్తోందని ఆరోపిస్తున్నారు. నిల్వలు వస్తున్నా తమకు కేటాయింపులు తగ్గిస్తున్నారని సహకార సంఘాలు, ప్రైవేటు డీలర్లు వెల్లడిస్తున్నారు. రామగుండం ఎరువుల కర్మాగారం నుంచి సరఫరా తగ్గడం కూడా కొరతకు కారణంగా చెబుతున్నారు. విజయవాడలో అధికార పార్టీకి చెందిన మాజీ మంత్రుల జోక్యంతో వారి బంధువుల దుకాణాలకు అధిక పరిమాణంలో ఎరువులు ఇస్తున్నారని,  మిగిలిన దుకాణాలకు సరిపడా అందడం లేదనే విమర్శలూ వ్యక్తమవుతున్నాయి. రబీ సాగులో భాగంగా రాష్ట్రంలో జనవరి 25 నాటికి 49.37 లక్షల ఎకరాల్లో పంటలు వేయాలి. వారం కిందటి వరకు 38.62 లక్షల ఎకరాల్లోనే సాగు నమోదైంది. అంటే 10.75 లక్షల ఎకరాలు తగ్గినట్లే. సుమారు 3.5 లక్షల ఎకరాల వరకు వరి, 3 లక్షల ఎకరాల్లో సెనగ తగ్గింది. జొన్న, పెసర సగానికి పడిపోయింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని