వీఆర్వోలకు తగ్గిన బాధ్యతలు!

గ్రామ రెవెన్యూ అధికారులకు బాధ్యతలు తగ్గిస్తూ రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేయడాన్ని గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం స్వాగతించింది.

Updated : 01 Feb 2023 05:58 IST

పూర్వ జీఓల సవరణ

ఈనాడు, అమరావతి: గ్రామ రెవెన్యూ అధికారులకు బాధ్యతలు తగ్గిస్తూ రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేయడాన్ని గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం స్వాగతించింది. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన జారీ చేసింది. ఇప్పటివరకు గ్రామ రెవెన్యూ అధికారులు సుమారు 50 రకాల విధులు నిర్వహించాలన్న నిబంధనలు ఉన్నాయి. కొత్తగా గ్రామ/వార్డు సచివాలయాలు వచ్చిన అనంతరం 2019లో వార్డు రెవెన్యూ సెక్రటరీకి ఓటర్ల జాబితా తయారీ, ఎన్నికల విధులతో కలిపి సుమారు 44 రకాల బాధ్యతలు అప్పగించారు. అలాగే విలేజ్‌ రెవెన్యూ ఆఫీసర్స్‌ (గ్రేడ్‌-1, గ్రేడ్‌-2)కు కేటాయించిన జాబ్‌ఛార్టులో ఎన్నికల విధులతో పాటు 32 రకాల బాధ్యతలు కేటాయించారు. 2007లో ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో ప్రకారం గ్రామ రెవెన్యూ అధికారుల విధులు సుమారు 50 వరకు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించిన జీఓలు సవరిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. గ్రామ/వార్డు సచివాలయాల్లో పనిచేసే గ్రామ రెవెన్యూ అధికారులు, వార్డు రెవెన్యూ సెక్రటరీలకు 13 రకాల విధులతో ఉమ్మడి జాబ్‌ ఛార్టును ఖరారు చేస్తూ రెవెన్యూ శాఖ సోమవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో ఎన్నికల విధులు, ఓటర్ల జాబితా తయారీ, విపత్తులు (అగ్నిప్రమాదాలు, తుపాను), మ్యుటేషన్లు, రీ-సర్వే, రెసిడెన్సీ, స్థానిక సర్టిఫికెట్ల జారీ, స్పందన కార్యక్రమాలకు యథావిధిగా హాజరుకావాల్సి ఉంది. పూర్వ ఉత్తర్వులతో పోలిస్తే విధుల నిర్వహణలో ముఖ్యంగా అంటువ్యాధుల నివారణ చర్యలు, వివాహాల తప్పనిసరి నమోదు, దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాల వారీగా జాబితాల రూపకల్పన, పోలీసు విధులు, ఉపాధి హామీ పథకం, ఇతర వాటిల్లో వెసులుబాటు లభించింది. జాబ్‌ఛార్టులో పేర్కొన్న విధులకు హాజరయ్యేందుకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని వీఆర్వో, వార్డు రెవెన్యూ సెక్రటరీలకు రెవెన్యూ శాఖ స్పష్టం చేసింది. జాబ్‌ఛార్టులో పేర్కొన్న నిబంధనలు జిల్లాల నుంచి మండలాల వరకు అమలు జరిగేలా స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలని రెవెన్యూ గ్రామ అధికారుల సంఘం అధ్యక్షుడు రవీంద్రరాజు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని