Gudivada Amarnath: త్వరలో విశాఖ భవిష్యత్తు మారుతుంది: మంత్రి అమర్‌నాథ్‌

రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వివిధ దేశాల పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపుతున్నారని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ పేర్కొన్నారు.

Updated : 02 Feb 2023 10:10 IST

ఈనాడు డిజిటల్‌, విశాఖపట్నం: రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వివిధ దేశాల పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపుతున్నారని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ పేర్కొన్నారు. విశాఖలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సదస్సు’కు సంబంధించి దిల్లీలో జరిగిన సన్నాహక సమావేశ వివరాలను వెల్లడించారు. ‘49 దేశాలకు చెందిన ప్రతినిధులు, అసోచామ్‌, ఫిక్కీ, సీఐఐ, నాస్కామ్‌ ప్రతినిధులు హాజరయ్యారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి ఉన్న అవకాశాలను స్థానిక పారిశ్రామికవేత్తలతోనే వివరించాం. దీనివల్ల వారిలో మరింత నమ్మకం పెరిగి కొత్త పెట్టుబడులతో పాటు ఉన్నవాటిని విస్తరించేందుకు ముందుకొస్తున్నారు. రాష్ట్రంలో 49 వేల ఎకరాల భూమి పరిశ్రమల ఏర్పాటుకు సిద్ధంగా ఉంది. మార్చి 3, 4న విశాఖలో నిర్వహించే గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌, మార్చి 28, 29వ తేదీల్లో నిర్వహించే జి-20 సన్నాహక సదస్సులు విశాఖ భవిష్యత్తును మార్చబోతున్నాయి. ముఖ్యమంత్రే నేరుగా విశాఖకు వస్తున్నట్లు ప్రకటించారు. పరిపాలనా రాజధానిపై ఇక అనుమానాలు తీరిపోయినట్లే. సీఎం ఎక్కడుంటే అక్కడే రాజధాని. ఐటీ, పర్యాటక, పట్టణ పరిపాలన శాఖల పరిధిలో చాలా భవనాలున్నాయి’ అని మంత్రి పేర్కొన్నారు.


ఫోన్‌ ట్యాపింగ్‌ కాదు.. రికార్డింగ్‌

‘ఉమ్మడి నెల్లూరు జిల్లా ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నట్లు అది ఫోన్‌ ట్యాపింగ్‌ కాదు... వారి సన్నిహితులే రికార్డింగ్‌ చేసి బయటపెట్టినట్లు తెలుస్తోంది. పార్టీలో ఉండడానికి ఇష్టం లేకపోతే వెళ్లిపోవచ్చుగాని ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం తగదు. నాకు 600 ఎకరాల వెంచర్‌ ఉన్నట్లు పవన్‌కల్యాణ్‌ ఆరోపిస్తున్నారు. ఆయన వస్తే ఆ భూములు రాసిస్తాను. కాపులను చంద్రబాబుకు తాకట్టుపెట్టే నాయకుడిగానే పవన్‌ను చూస్తాను’ అని మంత్రి విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని