చేపకు చేవ

సంక్షోభంలో ఉన్న ఆక్వా రంగానికి ఊరట లభించేలా కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఆక్వాలో మేత తయారీకి ఉపయోగించే వివిధ రకాల ఉత్పత్తులపై దిగుమతి సుంకాలను తగ్గించింది.

Published : 02 Feb 2023 03:55 IST

ఫీడ్‌ ఉత్పత్తులపై సుంకం తగ్గించిన కేంద్రం
కిలోకు రూ.5 వరకు తగ్గే అవకాశం

ఈనాడు-అమరావతి: సంక్షోభంలో ఉన్న ఆక్వా రంగానికి ఊరట లభించేలా కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఆక్వాలో మేత తయారీకి ఉపయోగించే వివిధ రకాల ఉత్పత్తులపై దిగుమతి సుంకాలను తగ్గించింది. ఈ మేరకు పరిశ్రమల యజమానులు రొయ్యలు, చేపల మేత ధర తగ్గిస్తే కిలోకు రూ.5 వరకు ధర తగ్గుతుందని ఆక్వా రైతులు పేర్కొంటున్నారు. రొయ్యల ఉత్పత్తి, ఎగుమతుల్లో దేశవ్యాప్తంగా ఏపీ తొలిస్థానంలో ఉంది. మొత్తం ఎగుమతుల్లో 60శాతానికిపైగా రాష్ట్రంనుంచే వెళుతున్నాయి. దేశంలో ఉత్పత్తయ్యే మొత్తం చేపల్లోనూ రాష్ట్ర వాటా 30శాతంపైనే.  అన్ని జిల్లాల్లో కలిపి 1.38లక్షల మంది రైతులు 5.30 లక్షల ఎకరాల్లో చేపలు, రొయ్యల సాగు చేస్తున్నారని ఇటీవలి ఈ-ఫిష్‌ సర్వే తేల్చింది. రాష్ట్రంలో ఏటా సగటున రూ.6వేల కోట్ల మేర మేత వ్యాపారం సాగుతోంది. అయితే నాలుగేళ్లుగా దాణా ధరలు 35శాతానికిపైగా పెరిగాయి. గతేడాదిలోనే ధరలు మూడు సార్లు ఎగశాయి. కిలో ధర రూ.108 వరకు చేరింది. దీనికితోడు రాయితీ విద్యుత్తు నిలిపేశారు. ఇదే సమయంలో రొయ్యల ధరలు భారీగా పతనమయ్యాయి. వంద కౌంట్‌ రొయ్య ధర కిలో రూ.200 దిగువకు పడిపోయింది. అధిక శాతం రైతులు సాగు మానేసి చెరువులు ఎండబెట్టారు. ఈ నేపథ్యంలోనే రొయ్యల మేత ధర తగ్గించే దిశగా కేంద్రం చర్యలు తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా విద్యుత్తు రాయితీ వర్తింపజేస్తే ఆక్వా రంగానికి మరింత ఊరట లభిస్తుందనే అభిప్రాయాలున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని