నిర్దేశిత వ్యవధిలోనే బిల్లులు చెల్లించాలి

సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) నుంచి తీసుకున్న ఉత్పత్తులకు నిర్దేశిత వ్యవధిలో బిల్లులు చెల్లించేలా 2023-24 బడ్జెట్‌లో కేంద్రం నిర్ణయం తీసుకొచ్చింది.

Published : 02 Feb 2023 04:36 IST

దీనికోసం ఎంఎస్‌ఎంఈ  చట్టంలో కొత్త క్లాజ్‌
రూ.1,500 కోట్ల బిల్లుల చెల్లింపు   జాప్యంపై 400 కేసులు

ఈనాడు, అమరావతి: సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) నుంచి తీసుకున్న ఉత్పత్తులకు నిర్దేశిత వ్యవధిలో బిల్లులు చెల్లించేలా 2023-24 బడ్జెట్‌లో కేంద్రం నిర్ణయం తీసుకొచ్చింది. దీంతో పాటు వాటికి అదనపు నిర్వహణ మూలధనాన్ని సమకూర్చడానికి, రుణ పరిమితి పెంచడానికి వీలుగా బడ్జెట్‌లో నిధులు కేటాయించింది. దీనివల్ల రాష్ట్రంలోని 97 వేల ఎంఎస్‌ఎంఈలకు ప్రయోజనం కలగనుంది. కొవిడ్‌ తర్వాత నిర్వహణ మూలధనం సరిపడక సుమారు 25 శాతం ఎంఎస్‌ఎంఈలు మూతపడ్డాయని పారిశ్రామిక అసోసియేషన్లు పేర్కొన్నాయి. కొవిడ్‌ సమయంలో చిన్న పరిశ్రమలను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం రీస్టార్ట్‌ ప్యాకేజీ కింద రూ.1,100 కోట్ల సాయం ప్రకటించినా.. ఇప్పటికీ పూర్తిగా ఇవ్వలేదు. ఈ ఏడాది చెల్లించాల్సిన ప్రోత్సాహకాలనూ చెల్లించలేదు. దీంతో చిన్న పరిశ్రమలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.

ఇక ఎప్పటి చెల్లింపులు.. అప్పుడే

ఎంఎస్‌ఎంఈల నుంచి ప్రభుత్వ విభాగాలు, వివిధ సంస్థలు తీసుకునే ఉత్పత్తులకు నిర్దేశిత వ్యవధిలో చెల్లింపులు జరిపేలా ఎంఎస్‌ఎంఈ డెవలప్‌మెంట్‌ చట్టం 43బి సెక్షన్‌కు అదనంగా ‘హెచ్‌’ క్లాజ్‌ను కేంద్రం తీసుకొచ్చింది. ఈ క్లాజ్‌ వల్ల అవి సరఫరా చేసిన ఉత్పత్తులకు బిల్లుల కోసం నెలల తరబడి నిరీక్షించే ఇబ్బందులు తప్పనున్నాయి. నిర్దేశిత వ్యవధిలో చెల్లించనట్లయితే.. ఆ మొత్తాన్ని ఖర్చు కింద అనుమతించకుండా ప్రభుత్వం పన్ను విధిస్తుంది. ప్రస్తుతం ఇలాంటి నిబంధన లేని కారణంగా వాటికి చెల్లించాల్సిన బిల్లులు భారీగా పెండింగ్‌లో ఉన్నాయి. రాష్ట్రంలో రూ.1,500 కోట్ల బిల్లుల చెల్లింపు జాప్యంపై ఆల్‌ ఇండియా ఫెసిలిటేషన్‌ కౌన్సిల్‌లో 400 ఎంఎస్‌ఎంఈలు కేసులు వేశాయి.

కొల్లేటరల్‌ సెక్యూరిటీ లేకుండా అదనపు రుణం

కొల్లేటరల్‌ సెక్యూరిటీ లేకుండా ఎంఎస్‌ఎంఈలకు అదనపు వర్కింగ్‌ క్యాపిటల్‌ వడ్డీలో 1 శాతం రిబేటుతో ఎమర్జెన్సీ క్రెడిట్‌ లైన్‌ గ్యారంటీ స్కీం కింద ఇచ్చేలా బడ్జెట్‌లో రూ.2 లక్షల కోట్లు కేటాయించింది. నిర్వహణ మూలధనం కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఎంఎస్‌ఎంఈలకు దీంతో ఊరట లభిస్తుందని పారిశ్రామిక వర్గాలు పేర్కొన్నాయి.  

కొత్తగా ఏర్పాటు చేసే ఎంఎస్‌ఎంఈలకు కొల్లేటరల్‌ సెక్యూరిటీ లేకుండా ‘క్రెడిట్‌ గ్యారంటీ ట్రస్ట్‌ ఫర్‌ ఎంఎస్‌ఎంఈ’ హామీతో గరిష్ఠంగా రూ.2 కోట్ల రుణాన్ని ఇచ్చేలా బడ్జెట్‌లో పేర్కొంది. దీనిపై బ్యాంకులు వసూలు చేసే వడ్డీకి అదనంగా 1.5 శాతం కలిపి.. అదనపు మొత్తాన్ని ట్రస్టు ఖాతాకు మళ్లిస్తుంది. ఈ ట్రస్ట్‌కు బడ్జెట్‌లో రూ.9 వేల కోట్లను కేటాయించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని