వర్సిటీలకు నామమాత్ర నిధులు!

రాష్ట్రంలోని గిరిజన, కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు ప్రతిసారి కేంద్ర బడ్జెట్‌లో నామమాత్రపు నిధులే కేటాయిస్తున్నారు. ఇదే విధానంలో నిధుల కేటాయింపు చేస్తే ఈ రెండు వర్సిటీలు పూర్తయ్యేందుకు 12 ఏళ్లు పడుతుంది.

Published : 02 Feb 2023 04:36 IST

ఇలాగైతే గిరిజన, కేంద్రీయ వర్సిటీలు  పూర్తికావాలంటే 12 ఏళ్లు పడుతుంది

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలోని గిరిజన, కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు ప్రతిసారి కేంద్ర బడ్జెట్‌లో నామమాత్రపు నిధులే కేటాయిస్తున్నారు. ఇదే విధానంలో నిధుల కేటాయింపు చేస్తే ఈ రెండు వర్సిటీలు పూర్తయ్యేందుకు 12 ఏళ్లు పడుతుంది. కేంద్రీయ విశ్వవిద్యాలయానికి కేటాయించిన భూమిలో ప్రహారీ తప్ప ఇప్పటి వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదు. 2018లో ప్రారంభమైన ఈ వర్సిటీ ఇప్పటికీ అద్దె భవనాల్లోనే కొనసాగుతోంది. గత మూడేళ్లుగా గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఆంధ్ర వర్సిటీకి చెందిన భవనాల్లో నిర్వహిస్తున్నారు. విజయనగరంలో ఈ వర్సిటీకి కేటాయించిన భూముల్లో ఇప్పటి వరకు ఎలాంటి పనులు ప్రారంభంకాలేదు. అరకొరగా నిధులు కేటాయిస్తున్నా.. కేంద్రాన్ని నిలదీసి, నిధులు తెచ్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించడంలేదు. ఒక్కో విశ్వవిద్యాలయాన్ని పూర్తి చేసేందుకు రూ.500కోట్ల చొప్పున నిధులు అవసరం కానున్నాయి. ఏటా బడ్జెట్‌లో ప్రస్తుతం కేటాయిస్తున్న విధానంలోనే నిధులు ఇస్తే 12 ఏళ్లకుపైగా సమయం పడుతుంది. అప్పటి వరకు వీటిల్లో ప్రవేశాలు పొందే విద్యార్థులు ఇబ్బందులు పడాల్సిందే. తెలంగాణ, ఏపీ గిరిజన వర్సిటీలకు కలిపి బడ్జెట్‌లో కేవలం రూ.37.67 కోట్లే కేంద్రం కేటాయించింది. 2021-22లో రెండు రాష్ట్రాలకు కలిపి రూ.11.14కోట్లు కేటాయించగా.. రూ.44 కోట్లు ఖర్చు చేసింది. గతేడాది రూ.44 కోట్లు ఇవ్వగా.. రూ.43.75 కోట్లకు సవరించింది.

కేంద్రీయ విశ్వవిద్యాలయానికి 2021-22లో రూ.117.92 కోట్లు కేటాయించగా.. రూ.56.66 కోట్లు మాత్రమే కేంద్రం ఖర్చు చేసింది. 2022-23లో రూ.56.66కోట్లు కేటాయించగా.. రూ.13.08 కోట్లకు సవరించింది. కేటాయించిన మొత్తాన్ని ఖర్చు చేయని దుస్థితి నెలకొంది. ప్రస్తుత బడ్జెట్‌లో కేవలం రూ.47.40 కోట్లే ఇచ్చింది. విభజన హామీల్లో భాగంగా కేటాయించిన వీటికి నిధులు మాత్రం సరిపడా ఇవ్వడం లేదు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని