విద్యార్థులు ఆంగ్లంలో ప్రావీణ్యం సాధించాలి

ప్రభుత్వ బడుల్లో చదువుకునే విద్యార్థులు ఆంగ్లంలో మాట్లాడటం, రాయడంలో ప్రావీణ్యం సాధించాలని సీఎం జగన్‌ ఆదేశించారు.

Published : 03 Feb 2023 05:32 IST

కేంబ్రిడ్జ్‌ లాంటి సంస్థల సహకారం తీసుకోవాలి
విద్యాశాఖపై సమీక్షలో సీఎం

ఈనాడు, అమరావతి: ప్రభుత్వ బడుల్లో చదువుకునే విద్యార్థులు ఆంగ్లంలో మాట్లాడటం, రాయడంలో ప్రావీణ్యం సాధించాలని సీఎం జగన్‌ ఆదేశించారు. ఇందుకు కేంబ్రిడ్జ్‌ లాంటి సంస్థల భాగస్వామ్యాన్ని తీసుకోవాలని, వీరి సహాయంతో మూడోతరగతి నుంచే పరీక్షలు నిర్వహించి, సర్టిఫికెట్లు జారీచేసేలా కార్యక్రమం రూపొందించాలని సూచించారు. క్యాంపు కార్యాలయంలో గురువారం పాఠశాల విద్యాశాఖపై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. ‘విద్యార్థులు ఆంగ్లంలో పట్టు సాధించేందుకు వారికి చేదోడుగా నిలవాలి. ఉపాధ్యాయులకు ఆంగ్లభాషపై శిక్షణ కొనసాగించాలి. ఆరో తరగతి, ఆపైన ప్రతి తరగతి గదిలో వచ్చే విద్యా సంవత్సరంలోపు ఐఎఫ్‌బీ ప్యానెల్స్‌, ఐదో తరగతిలోపు టీవీ స్క్రీన్లు ఏర్పాటుచేయాలి. దీంతో బోధన, అభ్యసన సులభతరమవుతుంది. ఎనిమిదో తరగతి నుంచి ట్యాబ్‌లు ఇస్తున్నాం. ఇంటివద్ద సైతం పిల్లలు ఆడియో, వీడియో పాఠ్యాంశాలను నేర్చుకునే అవకాశం కల్పించాం. ట్యాబ్‌ల వినియోగం, పాఠ్యాంశాలను నేర్చుకుంటున్న తీరుపై పిల్లల తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వాలి’ అని సూచించారు.

బోధన సీరియస్‌గా ఉండాలి..

‘ఆరోతరగతిలోకి రాగానే పిల్లలు విద్యను సీరియస్‌గా తీసుకునేలా దృష్టిపెట్టాలి. మొక్కుబడిగా చేస్తే విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతింటుంది. ఎనిమిదో తరగతి విద్యార్థులకు ట్యాబులను వచ్చే విద్యా సంవత్సరంలో పాఠశాల ప్రారంభంలోనే అందించేందుకు చర్యలు తీసుకోవాలి. ఇంటర్‌ విద్యార్థులకు డిజిటల్‌ సౌలభ్యాన్ని కల్పించడంపై ఆలోచించాలి. విద్యారంగంలో అమలుచేస్తున్న కార్యక్రమాలపై నిరంతర సమీక్ష, పర్యవేక్షణ అవసరం. దీంతో విద్యాకానుక నుంచి పాఠ్యాంశాలు, మౌలికసదుపాయాలు, గోరుముద్ద వరకు నాణ్యత పెరుగుతుంది. పిల్లలకు మంచి పాఠశాల వాతావరణం అందుబాటులో ఉంటుంది. ప్రతి ఏటా విద్యాకానుక కింద ఇస్తున్న వస్తువులపై పరిశీలన అవసరం. వచ్చే ఏడాది విద్యాకానుక కిట్లు ఈ విద్యా సంవత్సరం ఆఖరుకే బడులకు చేరాలి. ‘నాడు-నేడు’ రెండోదశలో 23,221, మూడోదశలో 16,968 పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించనున్నాం. వీటితోపాటు అంగన్‌వాడీలు, వసతిగృహాలను బాగుచేయాలి. రెండోదశ పనులు చురుగ్గా సాగాలి’ అని సీఎం ఆదేశించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. సబ్జెక్టు టీచర్ల విధానం వల్ల 3, 4, 5 తరగతులకు మంచిబోధన అందుతోందని వెల్లడించారు. ట్యాబ్‌ల వినియోగంలో వైయస్‌ఆర్‌, విజయనగరం, చిత్తూరు జిల్లాల విద్యార్థులు మొదటి మూడుస్థానాల్లో ఉన్నారని, ఏప్రిల్‌ చివరినాటికి విద్యా కానుక వస్తువులన్నింటినీ పాఠశాలలకు చేర్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. మొదటిదశ ‘నాడు-నేడు’పై ఆడిట్‌ పూర్తిచేశామని వెల్లడించారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు