సలహాదారులకు జవాబుదారీతనం ఏముంటుంది?
ప్రభుత్వ సలహాదారుల నియామకంపై హైకోర్టు మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేసింది. రాష్ట్ర కార్యనిర్వహణ వర్గంలో ఉన్నతస్థాయి వ్యక్తులు సలహాదారుల నియామకానికి నిర్ణయం తీసుకున్నారన్న అడ్వకేట్ జనరల్ వాదనపై తీవ్రంగా స్పందించింది.
వారి నియామకాల రాజ్యాంగబద్ధతను తేలుస్తాం
హైకోర్టు పునరుద్ఘాటన
వారి ద్వారా అంతర్గత సమాచారం బయటికిపొక్కే ప్రమాదం ఉందని వ్యాఖ్య
ఈనాడు - అమరావతి
ప్రభుత్వ సలహాదారుల నియామకంపై హైకోర్టు మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేసింది. రాష్ట్ర కార్యనిర్వహణ వర్గంలో ఉన్నతస్థాయి వ్యక్తులు సలహాదారుల నియామకానికి నిర్ణయం తీసుకున్నారన్న అడ్వకేట్ జనరల్ వాదనపై తీవ్రంగా స్పందించింది. ఉన్నతస్థాయి వ్యక్తులు కూడా ప్రభుత్వంలో భాగమే కానీ.. వారే ప్రభుత్వం కాదని తేల్చిచెప్పింది. వారు చట్టబద్ధపాలనను పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. పరిపాలనా వ్యవహారంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. రోడ్డుమీదున్న వ్యక్తులను రాత్రికి రాత్రి సలహాదారులుగా నియమించుకోవడానికి వీల్లేదంది. బయట నుంచి ప్రభుత్వంలోకి సలహాదారులుగా వచ్చిన వ్యక్తులకు జవాబుదారీతనం ఏముంటుందని నిలదీసింది. వారి నియామకానికి నిబంధనలు, ప్రవర్తన నియమావళి ఎక్కడున్నాయని ప్రశ్నించింది. సలహాదారులు మంత్రుల సమావేశాల్లో పాల్గొంటారని.. ప్రభుత్వ టెండర్లు, కీలక నిర్ణయాలపై అంతర్గత సమాచారం వారి ద్వారా బయటకు వచ్చే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. సలహాదారుల నియామక రాజ్యాంగబద్ధతను తేలుస్తామని పునరుద్ఘాటించింది. సలహాదారులను నియమించుకుంటూ పోతే ఆ సంఖ్యకు అంతు ఎక్కడని వ్యాఖ్యానించింది. వాదనల కొనసాగింపునకు విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్ర, జస్టిస్ ఎన్.జయసూర్యతో కూడిన ధర్మాసనం గురువారం ఈ ఆదేశాలిచ్చింది. దేవాదాయశాఖ సలహాదారుగా జ్వాలాపురపు శ్రీకాంత్ నియామకాన్ని సవాలు చేస్తూ ఏపీ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య అధికార ప్రతినిధి హెచ్‌కే రాజశేఖరరావు, ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమ సలహాదారుగా ఎన్.చంద్రశేఖరరెడ్డిని నియమించడాన్ని సవాలు చేస్తూ విశ్రాంత ఉద్యోగి ఎస్.మునెయ్య హైకోర్టులో వ్యాజ్యాలు వేశారు. ఇవి గురువారం హైకోర్టులో విచారణకు వచ్చాయి.
అవి రాజ్యాంగేతర నియామకాలు
రాజశేఖరరావు తరఫున సీనియర్ న్యాయవాది వేదుల వెంకటరమణ వాదనలు వినిపిస్తూ.. ‘నచ్చినవారిని సలహాదారులుగా నియమించి, వారి జీతభత్యాల కోసం ప్రభుత్వ ఖజానా నుంచి భారీగా ఖర్చు చేస్తున్నారు. సలహాదారుల నియామక వివరాలను కోర్టు ముందుంచిన ప్రభుత్వం.. నియామక నిబంధనలు, అర్హతలేమిటో అందులో పేర్కొనలేదు. సలహాదారులను నియమించే శాసనాధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. అవి రాజ్యాంగేతర నియామకాలు’ అని చెప్పారు. చట్టబద్ధత లేని ఆ నియామకాలను రద్దు చేయాలని కోర్టును కోరారు. మరో పిటిషనర్ మునెయ్య తరఫున న్యాయవాది పీవీజీ ఉమేశ్‌చంద్ర వాదనలు వినిపిస్తూ.. ‘రాష్ట్ర ప్రభుత్వం 100 మందికి పైగా సలహాదారులను నియమించి, వారందరికీ క్యాబినెట్ హోదా కల్పించింది. భారీగా జీతభత్యాలు చెల్లిస్తోంది. కొందరు రాజకీయ నాయకులను సలహాదారులుగా నియమిస్తూ పునరావాస కేంద్రంగా మార్చింది’ అన్నారు. సలహాదారు చంద్రశేఖరరెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది హేమేంద్రనాథ్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ గత ప్రభుత్వ హయాంలోనూ సలహాదారులను నియమించారని, అప్పుడు ఎవరూ ప్రశ్నించలేదన్నారు. సలహాదారుల నియామకాలు స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచీ జరుగుతున్నవేనన్నారు. రాజకీయ కారణాలతో వేసిన వ్యాజ్యాలను కొట్టేయాలని కోరారు.
నిలువరించే చట్టం లేదు: ఏజీ
రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజీ ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ..‘సలహాదారుల నియామకాన్ని నిలువరిస్తూ చట్టమేమీ లేదు. గత ప్రభుత్వాలూ సలహాదారులు, నిపుణులు, కన్సల్టెంట్లను నియమించాయి. వారి వల్ల ప్రభుత్వ పనితీరు మెరుగుపడింది. సలహాదారులు ప్రభుత్వ అధికారులు కాదు. అధికార విధుల్లో జోక్యం చేసుకోరు. అవసరానికి తగినట్లు నిర్దిష్ట కాలానికే సలహాదారులను నియమిస్తున్నాం. వారి సంఖ్య భారీగా లేదు. వారివి రాజ్యాంగేతర నియామకాలు కాదు. సలహాదారులపై గతంలో ఏవైనా క్రమశిక్షణ చర్యలు తీసుకొని ఉంటే ఆ వివరాలతో పాటు, న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులను కోర్టు ముందుంచుతాం. సమయం ఇవ్వండి. సలహాదారుల నియామకంపై న్యాయస్థానం ఏదైనా విధానం, మార్గదర్శకాలు సూచిస్తే అనుసరిస్తాం’ అని అన్నారు. ధర్మాసనం స్పందిస్తూ.. తాము ఎలాంటి మార్గదర్శకాలు ఇవ్వబోమని, సలహాదారుల నియామక రాజ్యాంగబద్ధతను మాత్రమే తేలుస్తామని స్పష్టం చేసింది. సలహాదారులను అన్ని ప్రభుత్వాలూ నియమిస్తున్నాయని, తాము నిర్దిష్టంగా ఏ ప్రభుత్వాన్నీ తప్పుపట్టడం లేదంటూ విచారణను వాయిదా వేసింది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Sarus Crane: కొంగతో అనుబంధం.. కాపాడిన వ్యక్తిపై కేసు..!
-
Sports News
IPL 2023:చెన్నై సూపర్ కింగ్స్‌కు బిగ్ షాక్.. కీలక ఆటగాడు దూరం!
-
Movies News
SS Karthikeya: ‘RRR’ ఆస్కార్ క్యాంపెయిన్ ఖర్చు ఇదే.. విమర్శకులకు కార్తికేయ కౌంటర్!
-
Politics News
Madhyapradesh: 200కు పైగా సీట్లు గెలుస్తాం.. మళ్లీ అధికారం మాదే..: నడ్డా
-
India News
Fact Check: ₹239 ఉచిత రీఛార్జ్ పేరుతో వాట్సాప్‌లో నకిలీ మెసేజ్!
-
Sports News
Dinesh Karthik: టీమ్ఇండియాలో అతడే కీలక ప్లేయర్.. కోహ్లీ, రోహిత్‌కు నో ఛాన్స్