పరోక్ష ఎన్నికలపై ఉత్సాహం ప్రత్యక్ష ఎన్నికలపై తాత్సారం

స్థానిక సంస్థల్లో ఖాళీగా ఉన్న సర్పంచి, ఎంపీటీసీ, జడ్పీటీసీ, కార్పొరేటర్‌, కౌన్సిలర్ల స్థానాల్లో ప్రత్యక్ష ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ ఇవ్వాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండు చేస్తున్నాయి.

Published : 03 Feb 2023 05:31 IST

రాష్ట్రంలో 50 సర్పంచి స్థానాలు ఖాళీ 105, ఎంపీటీసీ, 6 జడ్పీటీసీ స్థానాలూ..

ఈనాడు, అమరావతి: స్థానిక సంస్థల్లో ఖాళీగా ఉన్న సర్పంచి, ఎంపీటీసీ, జడ్పీటీసీ, కార్పొరేటర్‌, కౌన్సిలర్ల స్థానాల్లో ప్రత్యక్ష ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ ఇవ్వాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండు చేస్తున్నాయి. పరోక్ష పద్ధతిలో ఎన్నికలు నిర్వహించే 7 మండల పరిషత్‌ అధ్యక్ష, 11 ఉపాధ్యక్ష, 30 ఉప సర్పంచుల స్థానాలకే జనవరి 27న ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ ఇచ్చింది. వీటికి  శుక్రవారం ఎన్నికలు నిర్వహించనున్నారు. రాష్ట్రంలో 50 సర్పంచి స్థానాలు, 105 ఎంపీటీసీ, 6 జడ్పీటీసీ, మరో 760 వార్డు సభ్యుల స్థానాలు ఖాళీగా ఉన్నాయి. పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం వీటిలో గడువులోగా తిరిగి ఎన్నికలు నిర్వహించాలి. కానీ తీవ్ర జాప్యం జరుగుతోంది. విజయనగరం జిల్లాకు చెందిన ఒకరు హైకోర్టులో ఇటీవల కేసు వేశారు. పడాలపేట సర్పంచి మృతి చెంది 9 నెలలైనా ఎన్నికలు నిర్వహించడంలేదని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. భారత ఎన్నికల సంఘం తాజాగా జనవరిలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ-2023ను విడుదల చేసింది. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం నుంచి ఓటర్ల జాబితాల్ని సేకరించిన రాష్ట్ర ఎన్నికల సంఘం ఖాళీ స్థానాలకు నోటిఫికేషన్‌ ఇచ్చే విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదు. శ్రీకాకుళం, కాకినాడ, రాజమహేంద్రవరం, మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థలతోపాటు 19 పురపాలక, నగర పంచాయతీలకు, పలు నగరపాలక సంస్థల్లో ఖాళీ అయిన 4 కార్పొరేటర్ల, 11 కౌన్సిలర్ల స్థానాలకూ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. వీటిలో కొన్నిచోట్ల కోర్టు కేసులున్నా.. మిగతాచోట్ల ఇబ్బందులు లేవు. అయినా ఎన్నికల సంఘం దృష్టి సారించడం లేదన్నది ప్రతిపక్ష పార్టీల ఆరోపణ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని