ఉద్యోగుల జీతభత్యాలకు ప్రత్యేక చట్టం చేయాలి

ఉద్యోగులు, పింఛనుదారుల ఆర్థిక ప్రయోజనాలు, జీతభత్యాల చెల్లింపులకు ప్రత్యేకచట్టం చేయాలని ఉద్యోగసంఘాల నాయకులు డిమాండు చేశారు.

Updated : 03 Feb 2023 06:54 IST

ప్రభుత్వం నిబంధనలు ఉల్లంఘిస్తోంది
ఉద్యోగుల సీపీఎస్‌ వాటాను వాడేసుకుంటోంది
పిల్లల పెళ్లిళ్లు వాయిదాలు వేసుకుంటున్నాం
చర్చావేదికలో ఉద్యోగసంఘాల నాయకుల ఆవేదన

ఈనాడు, అమరావతి: ఉద్యోగులు, పింఛనుదారుల ఆర్థిక ప్రయోజనాలు, జీతభత్యాల చెల్లింపులకు ప్రత్యేకచట్టం చేయాలని ఉద్యోగసంఘాల నాయకులు డిమాండు చేశారు. జీతభత్యాల చెల్లింపులకు ప్రత్యేకచట్టం చేయాలని కోరుతున్నట్లు వెల్లడించారు. విజయవాడలో గురువారం ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ‘ఉద్యోగుల బకాయిలు-చెల్లింపులు-చట్టబద్ధత’ అనే అంశంపై ఉద్యోగసంఘాల నాయకులతో చర్చావేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ‘జీతాలు, పీఎఫ్‌, జీపీఎఫ్‌, ఏపీజీఎల్‌ఐ రుణాలు, ఆర్జిత సెలవుల చెల్లింపుల్లో ప్రభుత్వం మార్గదర్శకాలను పాటించనప్పుడు ఏంచేయాలి? రుణాలు, క్లెయిములను ప్రభుత్వం చెల్లించకపోవడంతో ఉద్యోగులు పిల్లల పెళ్లిళ్లు వాయిదా వేసుకోవాల్సి వస్తోంది. అధికారులు, మంత్రులకు విన్నవించాకే చట్టం చేయాలని గవర్నరును కలవాల్సి వచ్చింది. నాలుగేళ్లుగా ప్రభుత్వాన్ని మనం ప్రశ్నించలేదు. చట్టం చేస్తే ఉద్యోగులకు హక్కు వస్తుంది. దీన్ని ఉల్లంఘిస్తే న్యాయస్థానాల నుంచి రక్షణ లభిస్తుంది’ అని వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఏ నిర్ణయం తీసుకున్నా పూర్తిమద్దతు ఇస్తామని ప్రకటించారు.


గవర్నరును కలవడం తప్పెలా అవుతుంది

ఆర్థిక ప్రయోజనాలు, జీతభత్యాలపై చట్టం చేయాలని గవర్నరును కలవడం తప్పు ఎలా అవుతుంది? అవసరమైతే మరోసారి కలుస్తాం. సగటు ఉద్యోగి, పింఛనుదారులకు ప్రతినిధిగా మా సంఘం వ్యవహరిస్తోంది. ఒకటో తేదీన జీతాలు ఇవ్వట్లేదు. ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు ప్రస్తుతం రూ.12వేల కోట్లు ఉన్నాయి. నెలవారీ జీతభత్యాలు, పింఛన్లకే రూ.6వేల కోట్ల వరకు అవసరమవుతాయి. 2024 ఫిబ్రవరి నుంచి పదవీవిరమణలు ఉంటాయి. నెలవారీ జీతభత్యాలు, ఆర్థిక ప్రయోజనాలు చెల్లిస్తూ పెండింగ్‌ బకాయిలను ఎప్పటికి చెల్లిస్తుంది? ప్రతిపక్షాల వద్దకు వెళ్తే రాజకీయముద్ర వేస్తారు. ఇక మిగిలినది గవర్నరే అని భావించి ఆయనకు విన్నవించాం. దీన్ని తప్పనే అధికారం ఎవ్వరికీ లేదు. ఉద్యోగులకు తెలియకుండా జీపీఎఫ్‌ డబ్బులు రూ.480 కోట్లను ప్రభుత్వం తీసేసుకుంది. ఉద్యోగుల సమస్యలపై ఆందోళనకు సిద్ధమవుతుంటే మరో సంఘం వారు సంక్రాంతికి డీఏ ఇస్తారని, ఏప్రిల్‌ నుంచి చెల్లిస్తారని చెప్పారు.

సూర్యనారాయణ, అధ్యక్షుడు, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం


ప్రభుత్వం రూ.1300కోట్లు వాడేసుకుంది

కాంట్రిబ్యూటరీ పింఛను పథకం(సీపీఎస్‌) ఉద్యోగుల జీతాల నుంచి మినహాయించిన 10%, ప్రభుత్వం చెల్లించాల్సిన వాటాను గతేడాది మార్చి నుంచి చెల్లించడం లేదు. ఇది రూ.1300 కోట్ల వరకు ఉంటుంది. జమ చేయకపోవడంతో మార్కెట్‌లో పెట్టుబడి లేక.. ఉద్యోగులు పింఛను నష్టపోతారు. ఎన్నికల ముందు అధికారంలోకి వచ్చిన వారంలోనే సీపీఎస్‌ రద్దుచేస్తామని ప్రతిపక్ష నేతగా జగన్‌ చెప్పారు. ఇప్పుడు జీపీఎస్‌ అంటున్నారు.

ఎల్‌.యుగేందర్‌, సలహాదారు, ఏపీ సీపీఎస్‌ ఉద్యోగుల సంఘం


జీతాలు పెంచితే సంక్షేమం జరగదని చెబుతోంది

ఉద్యోగులకు జీతాలు పెంచితే సంక్షేమానికి ఇబ్బందులు వస్తాయని ప్రభుత్వం చెబుతోంది. ప్రజలకు, ఉద్యోగులకు మధ్య వైషమ్యాలు సృష్టిస్తోంది. ఉద్యోగ సంఘాలన్నీ ఒకే తాటిపైకి రావాలి.

శ్రీనివాస్‌ కుమార్‌, అధ్యక్షుడు, గ్రూపు-1 ఉద్యోగుల సంఘం


ప్రశ్నించడమే తప్పుగా ఉంది

ఈ ప్రభుత్వంలో ప్రశ్నించడం కూడా పాలకులకు తప్పుగా ఉందని ఎన్‌ఎంఆర్‌ ఐకాస అధ్యక్షుడు సురేష్‌ అన్నారు. ధరలు పెరుగుతుంటే డీఏ ఇవ్వాలని అడగడం తప్పా అని డైరెక్టు రిక్రూట్‌ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు నరసింహారావు ప్రశ్నించారు. ప్రభుత్వం ఉద్యోగులను ప్రజలకు దూరం చేయాలని చూస్తోందని నవ్యాంధ్ర టీచర్స్‌ సంఘం అధ్యక్షుడు శ్రీనివాసరావు పేర్కొన్నారు.


తీర్మానాలు..

* ఉద్యోగుల బకాయిలు, పింఛన్లు, గ్రాట్యుటీ, ఇతర ఆర్థిక ప్రయోజనాలను చెల్లించాలి. జీపీఎఫ్‌ ఖాతాల నుంచి తీసేసుకున్న మొత్తాలను ఎప్పుడు జమచేస్తారో కాలవ్యవధిని ప్రభుత్వం నిర్ణయించాలి.

* వేతనాలు, పింఛన్లు, ఆర్థిక ప్రయోజనాల చెల్లింపులకు వచ్చే బడ్జెట్‌ సమావేశాల్లోనే చట్టం చేయాలి.

* సీపీఎస్‌ ఉద్యోగులకు ప్రభుత్వ వాటా 10% నుంచి 14%కు పెంచి, 2019 ఏప్రిల్‌ నుంచి వడ్డీ సహా జమచేయాలి. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి ప్రొబేషన్‌ ఆలస్యంగా ఖరారు చేసినందున 9 నెలలకు పూర్తివేతనం చెల్లించాలి.

* 11వ పీఆర్సీలో రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలను ఎప్పటిలోగా చెల్లిస్తారో ప్రభుత్వం తెలియజేయాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు