గృహ సారథుల నియామకాలు త్వరగా పూర్తవ్వాలి

‘ప్రతీ వాలంటీరు క్లస్టర్‌ పరిధిలో ఇద్దరు చొప్పున జగనన్న గృహసారథుల నియామకాలు అతి త్వరలో పూర్తవ్వాలి. వారంతా క్షేత్రస్థాయిలోకి వెళ్లాలి’ అని వైకాపా ప్రాంతీయ సమన్వయకర్తలకు సీఎం జగన్‌ స్పష్టంచేశారు.

Published : 03 Feb 2023 04:50 IST

‘గడప గడపకు’ కార్యక్రమంలో ఎమ్మెల్యేలపై పర్యవేక్షణ పెరగాలి
వైకాపా ప్రాంతీయ సమన్వయకర్తలతో భేటీలో సీఎం జగన్‌

ఈనాడు, అమరావతి: ‘ప్రతీ వాలంటీరు క్లస్టర్‌ పరిధిలో ఇద్దరు చొప్పున జగనన్న గృహసారథుల నియామకాలు అతి త్వరలో పూర్తవ్వాలి. వారంతా క్షేత్రస్థాయిలోకి వెళ్లాలి’ అని వైకాపా ప్రాంతీయ సమన్వయకర్తలకు సీఎం జగన్‌ స్పష్టంచేశారు. ఈమేరకు ఆయన గురువారం క్యాంపు కార్యాలయంలో వారితో సమావేశమయ్యారు. అప్పగించిన పనులను సకాలంలో, సరైన పద్ధతిలో చేయలేదని, సచివాలయ పార్టీ సమన్వయకర్తలను ఇంకా పూర్తిస్థాయిలో నియమించలేదని సీఎం అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇప్పటివరకు చేసిన నియామకాలకు సంబంధించిన వివరాలను వైకాపా రాజకీయ వ్యూహ సంస్థ ఐప్యాక్‌ సహ వ్యవస్థాపకుడు రిషిరాజ్‌ ఒక ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. నియోజకవర్గాల వారీగా నివేదికలను ఆయా ప్రాంతీయ సమన్వయకర్తలకు అందజేశారు. ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఇంటింటికీ ఎలా తిరుగుతున్నారు... అసలు తిరుగుతున్నారా లేదా అనే విషయాన్ని ప్రాంతీయ సమన్వయకర్తలు కచ్చితంగా పర్యవేక్షించాలని సూచించినట్లు సమాచారం. పార్టీ నేతల మధ్య విభేదాల పరిష్కారంలో చొరవ చూపాలని, తద్వారా పార్టీ కార్యక్రమాలు చెప్పినట్లుగా నిర్వహించేలా చూడాలని సీఎం చెప్పారంటున్నారు. ప్రాంతీయ సమన్వయకర్తలుగా వ్యవహరిస్తున్న వారిలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, తితిదే ఛైర్మన్‌ వైవి సుబ్బారెడ్డి, ఎంపీలు పీవీ మిథున్‌రెడ్డి, అయోధ్య రామిరెడ్డి, బీద మస్తాన్‌రావు, పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, ఎమ్మెల్యేలు బాలినేని శ్రీనివాసరెడ్డి, భూమన కరుణాకరరెడ్డి, కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్‌ జిల్లాల సమన్వయకర్త మర్రి రాజశేఖర్‌ తదితరులు సమావేశానికి హాజరయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని