సీనియర్‌ దర్శకుడు వి.సాగర్‌ కన్నుమూత

సీనియర్‌ దర్శకుడు వి.సాగర్‌(71) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని నివాసంలో గురువారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు.

Updated : 03 Feb 2023 06:34 IST

కోడంబాక్కం, న్యూస్‌టుడే: సీనియర్‌ దర్శకుడు వి.సాగర్‌(71) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని నివాసంలో గురువారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. గుంటూరు జిల్లా నంబూరుకు చెందిన సాగర్‌ అసలు పేరు విద్యాసాగర్‌ రెడ్డి. ఆయనకి భార్య మాల, కుమారులు చంద్రశేఖర్‌ రెడ్డి,  రాజశేఖర్‌ రెడ్డి, కుమార్తె చందన ఉన్నారు. సినిమాపై ఆసక్తితో 1980లో చెన్నైకి చేరుకున్న సాగర్‌, మొదట ఎడిటింగ్‌ విభాగంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత దర్శకత్వంవైపు దృష్టిపెట్టారు. 1983లో ‘రాకాసిలోయ’ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. ‘పబ్లిక్‌రౌడి’, ‘దాడి’, ‘నక్షత్ర పోరాటం’, ‘ఆలుమగలు’, ‘జగదేకవీరుడు’, ‘అమ్మదొంగా’, ‘ఖైదీ బ్రదర్స్‌’, ‘స్టూవర్ట్‌పురం దొంగలు’, ‘రామసక్కనోడు’, ‘అన్వేషణ’ సహా దాదాపు 30  సినిమాలను తెరకెక్కించి దర్శకుడిగా తనదైన ముద్రవేశారు. సాగర్‌ దగ్గర సహాయ దర్శకులుగా చేరిన శ్రీనువైట్ల, వి.వి వినాయక్‌ అగ్ర దర్శకులుగా ఎదిగారు. రవికుమార్‌ చౌదరి, జి.నాగేశ్వర్‌రెడ్డి కూడా సాగర్‌ శిష్యులే. తెలుగు సినీ దర్శకుల సంఘానికి మూడుసార్లు అధ్యక్షుడిగా పనిచేశారు. సాగర్‌ ఇక లేరన్న విషయం తెలుసుకుని చెన్నై టీనగర్‌లోని నివాసానికి చేరుకుని ఆయన భౌతిక కాయాన్ని పలువురు సినీ ప్రముఖులు సందర్శించి నివాళులర్పించారు. శుక్రవారం చెన్నైలో అంత్యక్రియలు జరగనున్నాయి. నిర్మాత కాట్రగడ్డ ప్రసాద్‌ మాట్లాడుతూ ‘‘క్రమశిక్షణతో అంచెలంచెలుగా ఎదిగిన దర్శకుడు సాగర్‌. ఎంతోమందిని దర్శకులుగా తీర్చిదిద్దారు. మా సంస్థలో ‘నక్షత్ర పోరాటం’, ‘ఆలుమగలు’ చిత్రాలకు దర్శకత్వం వహించార’’ని ఆయనతో ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు