పార్లమెంటులో ఆంధ్రప్రదేశ్‌

పోలవరం ప్రాజెక్టు కోసం చేపట్టిన భూసేకరణ, సహాయ, పునరావాసంతోపాటు ఏపీ ప్రభుత్వం చేసిన అవసరమైన ఖర్చులను తిరిగి చెల్లించే విషయంలో ఏమాత్రం జాప్యం జరగలేదని కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ వెల్లడించారు.

Updated : 03 Feb 2023 05:59 IST

పోలవరం చెల్లింపుల్లో జాప్యం లేదు
కేంద్ర మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌

ఈనాడు, దిల్లీ: పోలవరం ప్రాజెక్టు కోసం చేపట్టిన భూసేకరణ, సహాయ, పునరావాసంతోపాటు ఏపీ ప్రభుత్వం చేసిన అవసరమైన ఖర్చులను తిరిగి చెల్లించే విషయంలో ఏమాత్రం జాప్యం జరగలేదని కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ వెల్లడించారు. 2014 ఏప్రిల్‌ నుంచి 2022 డిసెంబరు వరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.6,046.79 కోట్ల బిల్లులు సమర్పిస్తే తాము రూ.5,541.82 కోట్లు (91.64%) చెల్లించినట్లు తెలిపారు. గురువారం లోక్‌సభలో వైకాపా ఎంపీ వంగా గీత అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ‘‘ప్రాజెక్టు నిర్వాసిత కుటుంబాలకు ప్రత్యక్ష నగదు బదిలీ కింద పరిహారాన్ని పంపిణీచేయాలని 2022 ఏప్రిల్‌లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కోరింది. అయితే ఆ ప్రతిపాదన ఈ ప్రాజెక్టు అమలుకోసం రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం ఇచ్చిన అనుమతుల ప్రకారం లేదు’’ అని గజేంద్రసింగ్‌ షెకావత్‌ స్పష్టంచేశారు.  

* ఆంధ్రప్రదేశ్‌లో వశిష్ఠ, గోస్తని, ఉప్పుటేరు నదులు కలుషితమయ్యాయని గజేంద్రసింగ్‌ షెకావత్‌ చెప్పారు. ముఖ్యంగా నర్సాపురం పొడవునా వశిష్ఠ నది అత్యధికంగా కలుషితమైనట్లు వెల్లడించారు.


విశాఖ మెట్రోరైల్‌ ప్రాజెక్ట్‌ కోసం.. రాష్ట్రం నుంచి ప్రతిపాదనలు రాలేదు

ఈనాడు, దిల్లీ: విశాఖలో మెట్రోరైల్‌ ప్రాజెక్టు నిర్మాణం కోసం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి ఇంతవరకూ ఎలాంటి ప్రతిపాదనలూ రాలేదని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ సహాయమంత్రి కౌశల్‌ కిషోర్‌ తెలిపారు. ‘‘విశాఖపట్నంలో రూ.15,933 కోట్ల ఖర్చుతో 75.3 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేయాలనుకున్న వైజాగ్‌ మెట్రో ప్రాజెక్టుకు ఆర్థిక సాయం చేయడానికి కొరియన్‌ ఎగ్జిమ్‌ బ్యాంకు నిస్సహాయత వ్యక్తంచేసిన నేపథ్యంలో.. కేంద్ర ప్రభుత్వం ఏమైనా దానికి ఆర్థికసాయం చేసే ప్రతిపాదన చేస్తోందా? ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ రవాణాకు మద్దతివ్వడానికి కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకుంటోంది’’ అని విశాఖపట్నం, అనకాపల్లి ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ, బీశెట్టి వెంకట సత్యవతి గురువారం లోక్‌సభలో అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు కేంద్రమంత్రి ఈమేరకు సమాధానమిచ్చారు. 


పరిశీలనలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తుల నియామక ప్రతిపాదన

ఈనాడు, దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తుల నియామకానికి సంబంధించిన ఒక ప్రతిపాదన సుప్రీంకోర్టు కొలీజియం వద్ద పరిశీలనలో ఉందని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు తెలిపారు. గురువారం రాజ్యసభలో తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. 37 పోస్టులున్న ఏపీ హైకోర్టులో ప్రస్తుతం 32 మంది జడ్జీలు పనిచేస్తున్నారని, 5 పోస్టులు ఖాళీగా ఉన్నాయని మంత్రి తెలిపారు. అందులో ఒక పోస్టు భర్తీ ప్రతిపాదన సుప్రీంకోర్టు కొలీజియం వద్ద ఉందన్నారు. మిగిలిన 4 ఖాళీల భర్తీకి హైకోర్టు కొలీజియం ఇంకా ప్రతిపాదనలు పంపాల్సి ఉందన్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న విధానం ప్రకారం న్యాయమూర్తి పోస్టు ఖాళీ కావడానికి ఆరునెలల ముందునుంచే దాని భర్తీకి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి చర్యలు మొదలుపెట్టాలని తెలిపారు. సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసినవారినే హైకోర్టు న్యాయమూర్తులుగా కేంద్రం నియమిస్తుందని వివరించారు.


కొవ్వాడలో అణువిద్యుత్తు కేంద్రంపై చర్చలు

శ్రీకాకుళం జిల్లా కొవ్వాడలో 6 అణు విద్యుత్తు రియాక్టర్ల ఏర్పాటుపై అమెరికాకు చెందిన వెస్టింగ్‌హౌస్‌ ఎలక్ట్రిక్‌ కంపెనీతో చర్చలు జరుపుతున్నట్లు కేంద్ర అణు ఇంధనశాఖ సహాయమంత్రి జితేంద్రసింగ్‌ తెలిపారు. ఆయన గురువారం రాజ్యసభలో వైకాపా సభ్యుడు విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. ఈ చర్చల్లో ప్రాజెక్టు వ్యయం, నిర్మాణ గడువు ఖరారవుతాయన్నారు. ప్రస్తుతం భూసేకరణ, చట్టబద్ధ అనుమతులు, స్థల పరిశీలన పనులను చేపట్టినట్లు వివరించారు. మొత్తం 2079.66 ఎకరాల్లో 2061.1 ఎకరాలను న్యూక్లియర్‌ పవర్‌ కార్పొరేషన్‌కు బదిలీచేసినట్లు చెప్పారు. నిర్మాణపనులు వేగవంతమైతే ఇక్కడ 8 వేల మందికి ఉపాధి లభించే అవకాశం ఉందన్నారు. ప్రాజెక్టులో ఉత్పత్తి ప్రారంభమయ్యాక ప్రతి రెండు స్టేషన్లలో ప్రత్యక్షంగా, పరోక్షంగా 2వేల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. ఇక్కడ వ్యాపార అవకాశాల కారణంగా చుట్టుపక్కల ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతాయని కేంద్రమంత్రి విశ్లేషించారు.


ఏపీ సముద్ర తీరంలో 294 కిలోమీటర్ల మేర కోత

ఆంధ్రప్రదేశ్‌కున్న 1,027.58 కిలోమీటర్ల సముద్రతీరంలో 294.89 కిలోమీటర్లు (28.7%) కోతకు గురైనట్లు కేంద్ర శాస్త్ర, సాంకేతికశాఖ మంత్రి జితేంద్రసింగ్‌ తెలిపారు. ఆయన గురువారం రాజ్యసభలో ఒక ప్రశ్నకు సమాధానంగా ఈ విషయం చెప్పారు. రాష్ట్ర తీరంలో 223.36 కి.మీ. (217%) స్థిరంగా ఉందని, 509.33 కి.మీ. (49.6%) పెరిగిందని తెలిపారు. ఒడిశా (51%) తర్వాత ఏపీలో తీరం (49.6%) ఎక్కువ పెరిగినట్లు వెల్లడించారు. నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ కోస్టల్‌ రీసెర్చ్‌ (ఎన్‌సీసీఆర్‌) ఆంధ్రప్రదేశ్‌తో పాటు వివిధ రాష్ట్రాల్లో తీరప్రాంత సంరక్షణకు తగిన సాంకేతిక మద్దతు ఇస్తోందని తెలిపారు.


రాష్ట్రంలో రోజుకు 2,882 మిలియన్‌ లీటర్ల మురుగు
శుద్ధి చేస్తోంది 443 మిలియన్‌ లీటర్లే

రాష్ట్రంలో రోజుకు 2,882 మిలియన్‌ లీటర్ల మురుగునీరు వస్తోందని కేంద్ర జల్‌శక్తిశాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్‌ టుడు తెలిపారు. ప్రస్తుతం 833 మిలియన్‌ లీటర్ల శుద్ధి సామర్థ్యం గల 66 ప్లాంట్లు ఉండగా.. అవినూ 443 మిలియన్‌ లీటర్లు మాత్రమే శుద్ధి చేయగలుగుతున్నాయని వివరించారు.


వచ్చే ఏడాదికి గ్యాస్‌ పైపులైన్లు పూర్తి

ఈనాడు, దిల్లీ: రాష్ట్రంలో గ్యాస్‌ పైపులైన్ల నిర్మాణం వచ్చే ఏడాదికి పూర్తి కానున్నట్లు కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్‌పూరీ తెలిపారు. గురువారం లోక్‌సభలో ఓ ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. ఏపీ గ్యాస్‌ డిస్ట్రిబ్యూషన్‌ కార్పొరేషన్‌ నిర్మిస్తున్న కాకినాడ-శ్రీకాకుళం పైపులైను 2024 జూన్‌ 30 నాటికి, ఐఎంసీ సంస్థ చేపట్టిన కాకినాడ-విజయవాడ-నెల్లూరు ప్రాజెక్టు 2024 మార్చి 31 నాటికి పూర్తి కానున్నట్లు వెల్లడించారు. శ్రీకాకుళం-అంగుల్‌ పైపులైను ఈ ఏడాది జులై 31 నాటికి పూర్తిచేయాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు తెలిపారు.


అనంతపురం, విశాఖపట్నం ఎంఎంఎల్‌పీ డీపీఆర్‌పై కసరత్తు

అనంతపురం, విశాఖపట్నం మధ్య మల్టీ మోడల్‌ లాజిస్టిక్‌ పార్క్‌ (ఎంఎంఎల్‌పీ)నిర్మాణానికి భూమిని గుర్తించి, డీపీఆర్‌ రూపొందిస్తున్నట్లు కేంద్ర రహదారి, రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. తొలిదశలో 35 పార్కులను ఏర్పాటు చేయాలని నిర్ణయించగా అందులో 2 ఏపీలో ఉన్నాయన్నారు.


రాష్ట్రంలో పెట్రోల్‌ బంకులు.. 4,307

ఏపీలో పెట్రోలియం సంస్థలు 4,307 రిటైల్‌ విక్రయ కేంద్రాలను నిర్వహిస్తున్నట్లు కేంద్ర పెట్రోలియంశాఖ సహాయమంత్రి రామేశ్వర్‌ తేలి గురువారం లోక్‌సభలో తెలిపారు. ఇందులో 3,829 కేంద్రాలు ప్రభుత్వ, 478 ప్రైవేటు చమురు సంస్థల ఆధ్వర్యంలో నడుస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతపురం జిల్లాలో అత్యధికంగా 254, అల్లూరి సీతారామరాజు జిల్లాలో అత్యల్పంగా 13 ప్రభుత్వ బంకులు ఉన్నాయన్నారు.

*  తెలంగాణలో 3,609 ప్రభుత్వ, 286 ప్రైవేటు పెట్రోల్‌ విక్రయ కేంద్రాలున్నట్లు వెల్లడించారు. దేశవ్యాప్తంగా 77,158 ప్రభుత్వ, 8,371 ప్రైవేటు బంకులు నడుస్తున్నట్లు తెలిపారు.


జలవనరుల మరమ్మతుకు ఏపీ నుంచి ప్రతిపాదనలు రాలేదు

చెరువులు, సాగునీటి కాలువల మరమ్మతుకు సాయం కోరుతూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి కేంద్రానికి ప్రతిపాదనలు రాలేదని కేంద్ర జల్‌శక్తిశాఖ సహాయమంత్రి బిశ్వేశ్వర్‌ టుడు తెలిపారు. ‘రూ.2,100 కోట్లతో 9,200 చెరువుల పునరుద్ధరణ, 600 సాగునీటి కాలువల మరమ్మతు, 3,250 చెక్‌డ్యామ్‌ల నిర్మాణం చేపట్టాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి కేంద్రం ఏమైనా ఆర్థిక మద్దతు ఇచ్చే ప్రతిపాదన ఉందా’’ అని రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్‌ ప్రశ్నించారు. ఇందుకు మంత్రి సమాధానమిస్తూ.. ‘జలం రాష్ట్రం పరిధిలోని అంశం. ఆ పనులన్నీ రాష్ట్ర ప్రభుత్వాలే చేపట్టాలి. కొన్ని గుర్తించిన ప్రాజెక్టులకు కేంద్రం కొంత సాయం చేస్తుంది. అయితే.. ఏపీ నుంచి ప్రాజెక్టుల ఆధునికీకరణకు ఎలాంటి ప్రతిపాదనలు రాలేదు’ అని స్పష్టంచేశారు.


విశాఖ ఈఎస్‌ఐ ఆసుపత్రి స్థాయి 400 పడకలకు కుదింపు

ఈనాడు, దిల్లీ: ఉద్యోగ రాజ్యబీమా సంస్థ (ఈఎస్‌ఐసీ) విశాఖపట్నంలో నిర్మించ తలపెట్టిన 500 పడకల ఆసుపత్రిని ఇప్పుడు 400  పడకలకు తగ్గించినట్లు కేంద్ర కార్మికశాఖ సహాయమంత్రి రామేశ్వర్‌ తేలీ తెలిపారు. ఇందులో 350 సాధారణ పడకలు, 50 సూపర్‌ స్పెషాలిటీ పడకలు ఉంటాయన్నారు. సిబ్బంది క్వార్టర్ల నిర్మాణానికి అదనపు భూమి అందుబాటులో లేకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు గురువారం రాజ్యసభలో భాజపా సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఇందుకు రూ.384.26 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. అచ్యుతాపురం మండలం దుప్పిటూరులో 30 పడకలు, కాకినాడలోని వెంకటేశ్వరనగర్‌లో 100 పడకలు, విజయనగరం జిల్లా గాజులరేగలో 100 పడకల ఆసుపత్రుల నిర్మాణానికి ఆమోదముద్ర వేసినట్లు వెల్లడించారు. విశాఖపట్నంలోని మల్కాపురంలో ఉన్న 125 పడకల ఈఎస్‌ఐసీ ఆసుపత్రికి ప్రస్తుతం మరమ్మతులు చేస్తున్నట్లు తెలిపారు. విశాఖలో 400 పడకల ఆసుపత్రికి అవసరమైన భూమిని గత ఏడాది అక్టోబరు 28న ఈఎస్‌ఐసీ పేరుమీద మ్యుటేషన్‌ చేసి ఇచ్చినట్లు వెల్లడించారు. గుంటూరు, నెల్లూరు, పెనుకొండ, నెల్లూరు శ్రీసిటీల్లో 100 పడకల సామర్థ్యంతో నిర్మించతలపెట్టిన ఈఎస్‌ఐ ఆసుపత్రులు ప్రస్తుతం భూకేటాయింపుల దశల్లో ఉన్నట్లు వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లా పైడిభీమవరంలో 6 పడకల సామర్థ్యంతో నిర్మిస్తున్న ఆధునిక డిస్పెన్సరీ-కం-డయాగ్నస్టిక్‌ సెంటర్‌ 92% పూర్తయినట్లు కేంద్రమంత్రి వివరించారు.


విజయవాడ, హైదరాబాద్‌ విమానాశ్రయాల్లో మార్చి కల్లా డిజీయాత్ర సేవలు

విజయవాడ, హైదరాబాద్‌, కోల్‌కతా, పుణె విమానాశ్రయాల్లో ఈ ఏడాది మార్చి కల్లా డిజీయాత్ర సేవలు ప్రారంభించనున్నట్లు కేంద్ర పౌర విమానయానశాఖ సహాయమంత్రి వీకే సింగ్‌ తెలిపారు. ముఖ గుర్తింపు సాంకేతికతను ఉపయోగించుకొని బయోమెట్రిక్‌ బోర్డింగ్‌ విధానాన్ని అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. టికెట్లు, గుర్తింపు కార్డుల తనిఖీ లేకుండా చూస్తున్నామన్నారు. ఈ సౌకర్యాన్ని అన్ని విమానాశ్రయాల్లో దశలవారీగా అందుబాటులోకి తెస్తామని చెప్పారు.  


ఏపీలో 68.62% గ్రామీణ ఇళ్లకే కుళాయి నీరు

రాష్ట్రంలో ఇప్పటివరకు 68.62% గ్రామీణ ఇళ్లకే కుళాయి నీటి సరఫరా చేస్తున్నట్లు కేంద్ర జల్‌శక్తిశాఖ సహాయమంత్రి బిశ్వేశ్వర్‌ టుడు తెలిపారు. ‘జనవరి 30నాటికి రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో 95.18 లక్షల ఇళ్లు ఉన్నాయి. వీటిలో 30.74 లక్షల ఇళ్లకు 2019 ఆగస్టు 15నాటికే కుళాయి నీటి సరఫరా అవుతోంది. ఆ తర్వాత మిగిలిన ఇళ్లకు సమకూర్చారు’ అని వివరించారు. రాష్ట్రంలోని 12 జిల్లాల భూగర్భ జలాల్లో ఉప్పు, 12 జిల్లాలు ఫ్లోరైడ్‌, 13 జిల్లాల్లో నైట్రేట్‌ ప్రభావం అధికంగా ఉన్నట్లు చెప్పారు.


5 సోలార్‌ పార్కుల్లో 3,050 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి

ఆంధ్రప్రదేశ్‌లోని 5 సోలార్‌ పార్కుల్లో ప్రస్తుతం 3,050 మెగావాట్ల సౌర విద్యుత్తు ఉత్పత్తి అవుతున్నట్లు కేంద్ర విద్యుత్తుశాఖ మంత్రి ఆర్‌కే సింగ్‌ తెలిపారు. గురువారం లోక్‌సభలో వైకాపా ఎంపీలు వల్లభనేని బాలశౌరి, మాగుంట శ్రీనివాసులురెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి బదులిచ్చారు. అనంతపురం, కర్నూలులోని సోలార్‌ పార్కులు పూర్తిస్థాయిలో పనిచేస్తున్నట్లు వెల్లడించారు. కడప సోలార్‌ పార్కు మాత్రం 1000 మెగావాట్లకుగాను 250 మెగావాట్లు, అనంతపురం-2 పార్కు 500 మెగావాట్లకు 400 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేస్తున్నాయన్నారు. సోలార్‌ విండ్‌ హైబ్రీడ్‌ పార్కును 200 మెగావాట్ల సామర్థ్యంతో అనుమతివ్వగా ఇప్పటివరకూ ఉత్పత్తి ప్రారంభం కాలేదని తెలిపారు. వీటి ఏర్పాటుకు 2024 మార్చి వరకు గడువు ఇచ్చినట్లు వెల్లడించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని