సీట్లు వదలరు.. ఆసుపత్రులను సందర్శించరు!

రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖలో పర్యవేక్షణ గాడి తప్పుతోంది. వివిధ పథకాల అమలును పర్యవేక్షించాల్సిన అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లట్లేదు.

Updated : 03 Feb 2023 06:03 IST

పర్యవేక్షణ అధికారుల తీరిదీ

ఈనాడు, అమరావతి: రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖలో పర్యవేక్షణ గాడి తప్పుతోంది. వివిధ పథకాల అమలును పర్యవేక్షించాల్సిన అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లట్లేదు. జిల్లాల్లో ఉండే అధికారులు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులూ ఇలాగే వ్యవహరిస్తున్నారు. పర్యవేక్షణ అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లి, ఆసుపత్రులను సందర్శించి, అక్కడున్న పరిస్థితులపై నివేదికలు తయారుచేసి, అవసరమైన చర్యలు తీసుకోవాలి. కానీ వారు పట్టించుకోవట్లేదు. జాతీయ ఆరోగ్య మిషన్‌ కింద ఏటా సుమారు రూ.2వేల కోట్లు వరకు కేంద్రం నుంచి రాష్ట్రానికి వస్తున్నాయి. వీటితో 25 పథకాలు రాష్ట్రవ్యాప్తంగా అమలవుతున్నాయి. అమరావతిలో ఉండే రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రధాన కార్యాలయంలోని సీనియర్‌ అధికారులకు కొన్ని పథకాల పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించారు. డయాలసిస్‌, బాలల ఆరోగ్యం, టీబీ, క్షయ, దీర్ఘకాలిక వ్యాధుల నివారణ చర్యలు, ఉప ఆరోగ్యకేంద్రాలు, ముఖ్యమంత్రి పట్టణ ఆరోగ్యకేంద్రాలు, మాతా శిశు ఆరోగ్యం, రక్తహీనత, శిశు సంరక్షణ కేంద్రాలు, పోషకాహార కేంద్రాలు, మానసిక సమస్యల పరిష్కారం వాటి చర్యలు సీనియర్‌ అధికారుల పర్యవేక్షణలో కొనసాగుతున్నాయి. ఇటీవల జరుగుతున్న సమీక్ష సమావేశాల్లో కొందరు అధికారులను పథకం అమలు గురించి ఉన్నతాధికారులు ప్రశ్నిస్తుంటే, అసలు క్షేత్రస్థాయికి వెళ్లట్లేదని తెలిసింది. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారుల్లో చాలామంది పీహెచ్‌సీలను పరిశీలించట్లేదన్న విషయం రాష్ట్ర ప్రధాన కార్యాలయం దృష్టికొచ్చింది. జిల్లా కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌, ఇతర ఉన్నతాధికారులు నిర్వహించే సమీక్షా సమావేశాలకే వీరు పరిమితమవుతున్నారు. జిల్లా, సామాజిక, ప్రాంతీయ ఆసుపత్రుల్లో రక్త పరీక్షలు, ఇతర రోగ నిర్ధారణ పరీక్షలు ఎలా జరుగుతున్నాయి? ఫలితాల్లో నాణ్యత ఉందా.. లేదా అన్న దానిపైనా నిశిత పరిశీలన లేదు. కిందిస్థాయి సిబ్బందికి సకాలంలో శిక్షణ ఇవ్వడం, వారి పనితీరు మదింపులోనూ కొందరు అధికారులు వెనుకబడుతున్నారు. బోధనాసుపత్రుల సూపరింటెండెంట్లలో కొందరికి పెద్ద వయసు కావడం, వ్యక్తిగత సమస్యలు, పరిపాలనాపరమైన అంశాలపై విషయ పరిజ్ఞానం లేకపోవడంతో సమస్యలు ఇబ్బడిముబ్బడిగా ఉంటున్నాయి. బోధ]నాసుపత్రులకు ఏయే కేసులు ఎక్కువగా ఏయే ప్రాంతాల నుంచి.. ఎందుకు వస్తున్నాయన్న కారణాలపై విశ్లేషించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు, వైద్య విద్యార్థులు అందుబాటులో ఉంటున్నా... ఈ దిశగా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు