కాజీపేటలో వ్యాగన్ల తయారీ కర్మాగారం

తెలుగు రాష్ట్రాలకు 2023-24 రైల్వే బడ్జెట్‌లో రూ.12,824 కోట్లు కేటాయించినట్లు కేంద్ర రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు. ఇందులో తెలంగాణకు రూ.4,418 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌కు రూ.8,406 కోట్లు ఇచ్చినట్లు తెలిపారు.

Updated : 04 Feb 2023 06:40 IST

తెలుగురాష్ట్రాలకు రూ.12,824 కోట్లు కేటాయించాం
రైల్వేమంత్రి అశ్వినీవైష్ణవ్‌

ఈనాడు, దిల్లీ: తెలుగు రాష్ట్రాలకు 2023-24 రైల్వే బడ్జెట్‌లో రూ.12,824 కోట్లు కేటాయించినట్లు కేంద్ర రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు. ఇందులో తెలంగాణకు రూ.4,418 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌కు రూ.8,406 కోట్లు ఇచ్చినట్లు తెలిపారు. ఆయన శుక్రవారం దిల్లీలో విలేకరులతో మాట్లాడారు. ‘‘2009-14 మధ్య ఉమ్మడి రాష్ట్రానికి కేవలం రూ.886 కోట్లు మాత్రమే కేటాయించారు. భూసేకరణ, ఇతర అంశాల్లో ఆంధ్రప్రదేశ్‌ నుంచి చాలా సహకారం లభిస్తోంది కాబట్టి అక్కడ ఎక్కువ కేటాయింపులు జరిపాం. ఏపీలో 72, తెలంగాణలో 39 రైల్వే స్టేషన్లను ప్రపంచస్థాయిలో అభివృద్ధి చేస్తున్నాం. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయాలకు అతీతంగా సహకరించాలి. విశాఖపట్నం జోనల్‌ కార్యాలయ భవనం డిజైన్‌ను త్వరలో ఖరారుచేసి నిర్మాణ పనులు ప్రారంభిస్తాం. కాజీపేటకు వ్యాగన్‌ ఓవర్‌హాలింగ్‌, రిపేర్‌ ఫ్యాక్టరీ ఇచ్చాం. తర్వాత అక్కడ వ్యాగన్‌ తయారీని జతచేస్తాం. విభజన చట్టంలో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీపై అధ్యయనం చేస్తామని చెప్పారు. అయితే దేశంలో ఇప్పటికే చాలా కోచ్‌ఫ్యాక్టరీలు ఉన్నాయి. ప్రస్తుతం వ్యాగన్‌లకున్న అత్యధిక డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని కాజీపేటలో వ్యాగన్‌ ఫ్యాక్టరీ ఏర్పాటుచేయాలని ఆ అధ్యయనంలో తేలినందున దానిపై నిర్ణయం తీసుకున్నాం.

హైదరాబాద్‌లో ఎంఎంటీఎస్‌ విస్తరణకు తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి సహకారం అందించడంలేదు. సబ్‌కా సాత్‌ సబ్‌కా వికాస్‌ ప్రధానమంత్రి నినాదం కాబట్టి ఆయన రాజకీయాలను పక్కనపెట్టి దేశాభివృద్ధికోసం ఆలోచిస్తుంటారు. ఎంఎంటీఎస్‌కు రెండోదశకు ఈ ఏడాది రూ.600 కోట్లు కేటాయించాం. వన్‌ స్టేషన్‌ వన్‌ ప్రొడక్ట్‌లో భాగంగా స్థానిక ఉత్పత్తులను రైల్వేస్టేషన్లలో ప్రదర్శించి విక్రయించే కార్యక్రమం విజయవంతమైంది. ప్రస్తుతం 750 స్టాళ్లు ఉన్నాయి. వీటిని వెయ్యికిపైగా పెంచుతాం.

వందే భారత్‌ రైలు విజయవంతమైన నేపథ్యంలో ఈ ఏడాది వందే మెట్రో రైళ్లను తీసుకొస్తాం. వైజాగ్‌-సికింద్రాబాద్‌ వందేభారత్‌ రైల్లో ఆక్యుపెన్సీ రేటు 120% దాకా ఉంది. ఇటీవల నేను దావోస్‌ పర్యటనకు వెళ్లినప్పుడు జ్యురిక్‌ నుంచి దావోస్‌కు రైల్లో వెళ్లాను. యూరప్‌లోని రైళ్లతో పోలిస్తే వందేభారత్‌ రైలు అన్ని కొలమానాల్లోనూ మెరుగ్గా ఉంది.  ఈఏడాది వందే మెట్రో కాన్సెప్ట్‌ ఖరారుచేసి ఒక నమూనా రైలును రూపొందించి పరీక్షిస్తాం. తర్వాతి ఏడాది దాన్ని తదుపరి దశకు తీసుకొస్తాం. ప్రధానమంత్రి 2017లో వందేభారత్‌ రైలు ఉద్దేశాన్ని చెబితే 2019లో తొలి రైలు రూపొందించి లక్షల కిలోమీటర్ల పాటు పరీక్షించాం. 2021 నుంచి ప్రధాన ఉత్పత్తి ప్రారంభమైంది. అదే తరహాలో వందే మెట్రో రైలును అభివృద్ధి చేస్తాం. ఇప్పుడు హైడ్రోజన్‌ రైలు రూపొందించే కసరత్తు జరుగుతోంది.’’ అని అశ్వినీవైష్ణవ్‌ వెల్లడించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు