K Viswanath: తరలిపోయిన తపస్వి

ప్రముఖ సినీ దర్శకుడు, కళాతపస్వి కె.విశ్వనాథ్‌ (92) అంత్యక్రియలు శుక్రవారం ముగిశాయి. సినీ, రాజకీయ ప్రముఖులు, బంధువులు, సన్నిహితులు, అభిమానుల అశ్రునయనాల నడుమ పంజగుట్ట హిందూ శ్మశానవాటికలో ఆయన కుమారులు నాగేంద్రనాథ్‌, రవీంద్రనాథ్‌ చేతుల మీదుగా ఆరాధ్య సంప్రదాయ ప్రకారం విశ్వనాథ్‌ భౌతిక కాయాన్ని ఖననం చేశారు.

Updated : 04 Feb 2023 06:34 IST

విశ్వనాథ్‌కు కన్నీటి వీడ్కోలు
సినీ, రాజకీయ ప్రముఖుల నివాళి
బహుముఖ ప్రజ్ఞాశాలి: ప్రధాని సంతాపం

ఈనాడు, హైదరాబాద్‌-న్యూస్‌టుడే, ఫిలింనగర్‌, బంజారాహిల్స్‌: ప్రముఖ సినీ దర్శకుడు, కళాతపస్వి కె.విశ్వనాథ్‌ (92) అంత్యక్రియలు శుక్రవారం ముగిశాయి. సినీ, రాజకీయ ప్రముఖులు, బంధువులు, సన్నిహితులు, అభిమానుల అశ్రునయనాల నడుమ పంజగుట్ట హిందూ శ్మశానవాటికలో ఆయన కుమారులు నాగేంద్రనాథ్‌, రవీంద్రనాథ్‌ చేతుల మీదుగా ఆరాధ్య సంప్రదాయ ప్రకారం విశ్వనాథ్‌ భౌతిక కాయాన్ని ఖననం చేశారు. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఆయన అంత్యక్రియలు పూర్తిచేశారు. వయోభారంతో కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విశ్వనాథ్‌ చికిత్స పొందుతూ గురువారం రాత్రి అపోలో ఆసుపత్రిలో కన్నుమూసిన సంగతి తెలిసిందే. మరణవార్తను తెలుసుకొని శుక్రవారం తెల్లవారుజాము నుంచే అనేక మంది సినీ, రాజకీయ ప్రముఖులు ఫిలింనగర్‌లోని ఆయన స్వగృహానికి చేరుకొని నివాళులు అర్పించారు. చిత్ర రంగానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. తెలుగు సినిమాను ఖండాంతరాలకు తీసుకెళ్లిన ఖ్యాతి విశ్వనాథ్‌కే దక్కుతుందని, దర్శకుడిగా మాత్రమే కాకుండా నటుడిగా వెండితెరపై తనదైన ముద్ర వేశారని గుర్తుచేసుకున్నారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఫిలింనగర్‌లోని ఆయన నివాసం నుంచి పంజగుట్ట శ్మశానవాటిక వరకు అంతిమయాత్ర సాగింది. ఆయన్ని చివరిసారిగా చూసేందుకు అభిమానులు, ప్రజలు రోడ్లపైకి వచ్చారు. ప్రభుత్వం తరఫున విశ్వనాథ్‌ అంత్యక్రియలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. అంతిమయాత్రలో ఎంపీ సంతోష్‌కుమార్‌, తెలంగాణ రాష్ట్ర అధికార భాషాసంఘం అధ్యక్షురాలు శ్రీదేవి, సినీనటులు తులసి, ఏడిద శ్రీరాం, ఏడిద రాజా, అనంత్‌ తదితరులు విచ్చేశారు. ఏపీ సీఎం జగన్‌ తరఫున విశ్వనాథ్‌ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు అంతిమయాత్రకు హాజరైన ఆ రాష్ట్ర మంత్రి వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు.  

ప్రముఖుల నివాళి

ఫిలింనగర్‌లోని విశ్వనాథ్‌ నివాస ప్రాంగణంలో ఆయన భౌతికకాయాన్ని పలువురు ప్రముఖులు సందర్శించి నివాళులర్పించారు. మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, సినీ ప్రముఖులు చిరంజీవి, పవన్‌కల్యాణ్‌, నాగబాబు, వెంకటేశ్‌, కె.రాఘవేంద్రరావు, త్రివిక్రమ్‌, గుణశేఖర్‌, అల్లు అరవింద్‌, డి.సురేశ్‌బాబు, ఆదిశేషగిరిరావు, బ్రహ్మానందం, అలీ, వందేమాతరం శ్రీనివాస్‌, కోట శ్రీనివాసరావు, అశోక్‌కుమార్‌, రాజమౌళి, కీరవాణి, ఎల్బీ శ్రీరామ్‌, బ్రహ్మాజీ, మణిశర్మ, తనికెళ్ల భరణి, ఎస్వీ కృష్ణారెడ్డి, కె.అచ్చిరెడ్డి, ఆర్‌.నారాయణమూర్తి, జీవిత రాజశేఖర్‌, జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, ఫిలింనగర్‌ సొసైటీ కార్యదర్శి కాజ సూర్యనారాయణ తదితరులు నివాళులర్పించిన వారిలో ఉన్నారు.

పలువురి సంతాపం

శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు, నిరంజన్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌, శ్రీనివాస్‌గౌడ్‌, కొప్పుల ఈశ్వర్‌, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఆర్మూర్‌ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌, ఎంపీ కె.లక్ష్మణ్‌, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క, సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు తమ్మినేని వీరభద్రం, కూనంనేని సాంబశివరావు తదితరులు సంతాపం తెలిపారు.


ఆయన కీర్తి అజరామరం

తెలంగాణ సీఎం

ర్శకుడు విశ్వనాథ్‌ మరణం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు తీవ్ర సంతాపం తెలిపారు. అతి సామాన్యమైన కథలను కూడా తన అద్భుత ప్రతిభతో వెండితెర దృశ్య కావ్యాలుగా మలిచిన అరుదైన దర్శకుడు విశ్వనాథ్‌ అని, ఆయన కీర్తి అజరామరమని కొనియాడారు. గతంలో విశ్వనాథ్‌ ఆరోగ్యం బాగోలేనప్పుడు వారి ఇంటికి వెళ్లి పరామర్శించిన సమయంలో సినిమాలు, సంగీతం, సాహిత్యంపై తమ మధ్య జరిగిన చర్చను సీఎం గుర్తు చేసుకున్నారు. భారతీయ సామాజిక, సంస్కృతీ సంప్రదాయ విలువలకు తన సినిమాలో పెద్దపీట వేశారని ప్రస్తుతించారు. వారి కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.


బహుముఖ ప్రజ్ఞాశాలి

ప్రధాని మోదీ

ప్రముఖ దర్శకుడు కె.విశ్వనాథ్‌ మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్రమోదీ ట్విటర్‌ ద్వారా ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. సినీ రంగంలో విశ్వనాథ్‌ దిగ్గజం వంటివారని, తనను తాను సృజనాత్మక, బహుముఖీన దర్శకుడిగా ఆవిష్కరించుకున్నారని ప్రస్తుతించారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రధాని సానుభూతి తెలిపారు.


తెలుగు సినిమాకు తీరనిలోటు

తెలంగాణ గవర్నర్‌

విశ్వనాథ్‌ మరణం తెలుగు సినిమా పరిశ్రమకు తీరని లోటని రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సంతాపం వ్యక్తం చేశారు. అద్భుత ప్రతిభతో దిగ్గజ దర్శకుడిగా, స్క్రీన్‌ప్లే రచయితగా, నటుడిగా సినీ పరిశ్రమకు విశేష సేవలు అందించారని కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలని ఆకాంక్షించారు.


అవార్డులు ఆయన ప్రతిభకు దర్పణాలు

రాహుల్‌

ర్శక దిగ్గజం విశ్వనాథ్‌ మృతి పట్ల కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ విచారం వ్యక్తం చేశారు. అయిదు జాతీయ అవార్డులు, దాదాసాహెబ్‌ ఫాల్కే, పద్మశ్రీ పురస్కారాలు ఆయన ప్రతిభావ్యుత్పత్తులకు దర్పణాలని కొనియాడారు. విశ్వనాథ్‌ కుటుంబసభ్యులకు, అభిమానులకు తన సంతాపం తెలిపారు.


తీవ్రంగా కలచివేసింది

తెదేపా అధినేత చంద్రబాబు

‘కె.విశ్వనాథ్‌ మరణ వార్త నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఎన్నో అపురూపు చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’


తెలుగు సినిమాకు తీరని లోటు

ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌

ఈనాడు, అమరావతి: కళాతపస్వి కె.విశ్వనాథ్‌ మృతి తెలుగుచలనచిత్ర రంగానికి తీరని లోటు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా.


కళలకు నిలువుటద్దం

ఏపీ సీఎం జగన్‌

తెలుగువారి గుండెల్లో కళాతపస్వి కె.విశ్వనాథ్‌ చిరస్థాయిగా నిలిచిపోతారు. తెలుగు సంస్కృతికి, భారతీయ కళలకు ఆయన నిలువుటద్దం. ఆయన దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రాలు తెలుగు సినీ రంగానికి అసమాన గౌరవాన్ని తెచ్చిపెట్టాయి.


ఆయన జ్ఞాని

పవన్‌ కల్యాణ్‌

సినిమా స్థాయిని, తెలుగు దర్శకుల సృజనను ఉన్నత శిఖరాన ఉంచిన దర్శక స్రష్ట కె.విశ్వనాథ్‌ శివైక్యం చెందారని తెలిసి తీవ్ర ఆవేదన చెందా. ఆయన్ను ఎప్పుడు కలిసినా జ్ఞాని కళ్లముందున్నట్టే అనిపించేది.Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు