ధిక్కరించి.. కోర్టు మెట్లెక్కి!

న్యాయస్థానం ఉత్తర్వులంటే రాష్ట్ర ప్రభుత్వ అధికారుల్లో చాలా మందికి లెక్కే లేకుండా పోయింది. కోర్టు ఆదేశాలను అమలు చేయకుండా వారు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. కొంత మంది అధికారులు మరో అడుగు ముందుకేసి కోర్టును, ఉత్తర్వులిచ్చిన న్యాయమూర్తులను దూషించే స్థాయికి వెళ్తున్నారు.

Published : 04 Feb 2023 05:15 IST

పదేపదే న్యాయస్థానం ఉత్తర్వులను ఉల్లంఘిస్తున్న ఉన్నతాధికారులు
నిందితులుగా కోర్టులకు హాజరు
కొంత మందికి శిక్షలూ పడుతున్న వైనం
ధర్మాసనాలకు క్షమాపణలతో తాత్కాలిక ఉపశమనం

ఈనాడు, అమరావతి: న్యాయస్థానం ఉత్తర్వులంటే రాష్ట్ర ప్రభుత్వ అధికారుల్లో చాలా మందికి లెక్కే లేకుండా పోయింది. కోర్టు ఆదేశాలను అమలు చేయకుండా వారు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. కొంత మంది అధికారులు మరో అడుగు ముందుకేసి కోర్టును, ఉత్తర్వులిచ్చిన న్యాయమూర్తులను దూషించే స్థాయికి వెళ్తున్నారు. ఆదేశాలను అమలు చేయాల్సిందేనని న్యాయమూర్తులు కఠినంగా చెబితే... వారిపై ప్రభుత్వ వ్యతిరేకులుగా ముద్ర వేస్తున్నారు. చివరకు తమ ఉత్తర్వులను ఎందుకు అమలు చేయలేదో తెలియజేయాలంటూ ఇచ్చిన ఆదేశాలతో హైకోర్టు చుట్టూ తిరుగుతున్నారు. హైకోర్టుకు సమీపంలో అధికారులు అతిథి గృహం ఏర్పాటు చేసుకోవడం మంచిదని ఓ ధర్మాసనం ఇటీవల వ్యాఖ్యానించడం తీవ్రతను తెలియజేస్తోంది. మరోవైపు ఇటీవలి కాలంలో ధిక్కరణ కేసుల్లో జైలుశిక్షల సంఖ్య పెరిగింది. కోర్టు ఉత్తర్వుల హుందాతనాన్ని కాపాడాల్సిన ప్రభుత్వ న్యాయవాదులే న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాల అమలులో కొర్రీలు వేస్తూ ప్రభుత్వాధికారులకు తప్పుడు సలహాలిస్తున్నారని హైకోర్టు బాహాటంగా దుయ్యబట్టిన సందర్భాలెన్నో. కోర్టు ఆదేశాలను అమలు చేయకపోవడంలో అధికారుల బాధ్యత ఎంతుందో.. వారి న్యాయవాదుల బాధ్యతా అంతే ఉందని ఇటీవల ఓ కేసులో ఘాటుగా విమర్శించింది. 2019 జులై నుంచి 2023 జనవరి 20వరకూ వివిధ కారణాలతో హైకోర్టు ముందుకు వచ్చిన అధికారుల జాబితా ఇదే.


హాజరైన తేదీ: 12.7.19

కేసు వ్యవహారం: ఎన్నికల కోడ్‌ అమల్లో ఉందని.. కారాగారంలో ఉన్న గని శ్రీనివాసులు అనే వ్యక్తిని కోర్టు ఆదేశించినా విడుదల చేయడంలో జాప్యం చేయడంపై దాఖలైన కోర్టు ధిక్కరణ కేసు.

అధికారులు: హోంశాఖ పూర్వ ముఖ్య కార్యదర్శి ఏఆర్‌ అనురాధ, నెల్లూరు కేంద్ర కారాగారం సూపరింటెండెంట్‌ ఎం.రవికిరణ్‌

ధర్మాసనం: అప్పటి తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సి.ప్రవీణ్‌ కుమార్‌, జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తి.


హాజరైన తేదీ: 20.11.19

కేసు వ్యవహారం: ప్రకాశం జిల్లా ఒంగోలు తహసీల్దారుగా ఉన్నప్పుడు టి.చిరంజీవి 2010 ఫిబ్రవరి 20న అధికార దుర్వినియోగానికి పాల్పడి, బోగస్‌ పట్టాలిచ్చిన ఘటనపై దాఖలైన వ్యాజ్యంలో ప్రమాణ పత్రం దాఖలు చేయడంలో తీవ్ర జాప్యంపై కోర్టు ధిక్కరణ

అధికారులు: రెవెన్యూశాఖ అప్పటి ముఖ్య కార్యదర్శి ఉషారాణి

ధర్మాసనం: అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి, జస్టిస్‌ జి.శ్యాంప్రసాద్‌


హాజరైన తేదీ: 8.9.20

కేసు వ్యవహారం: శ్రీకాకుళం జిల్లాకు చెందిన నలుగురు యువకులకు పోలీసు నియామక ఉత్తర్వులిచ్చి, ఇతర ప్రయోజనాలు కల్పించాలంటూ 2018 జనవరి 23న ఇచ్చిన తీర్పును అమలు చేయనందుకు దాఖలైన కోర్టు ధిక్కరణ కేసు

అధికారులు: మాజీ డీజీపీ ఎం.మాలకొండయ్య, అప్పటి హోంశాఖ ముఖ్య కార్యదర్శి ఏఆర్‌ అనూరాధ, శ్రీకాకుళం జిల్లా అప్పటి ఎస్పీ త్రివిక్రమ్‌ వర్మ హాజరు. అప్పటి రాష్ట్ర స్థాయి పోలీసు నియామక బోర్డు ఛైర్మన్‌, ఐపీఎస్‌ అధికారి ఎన్‌.సంజయ్‌ కోర్టుకు హాజరు కాకపోవడంపై ధర్మాసనం ఆగ్రహం

ధర్మాసనం: అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి, జస్టిస్‌ కె.సురేశ్‌రెడ్డి


హాజరైన తేదీ: 18.8.21

కేసు వ్యవహారం: గత ప్రభుత్వ హయాంలో ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులకు బకాయిలు చెల్లించకపోవడంపై వివరణ ఇచ్చేందుకు..

అధికారులు: ఐఏఎస్‌ అధికారులు పంచాయతీరాజ్‌శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్‌ గిరిజా శంకర్‌, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌.ఎస్‌.రావత్‌

ధర్మాసనం: జస్టిస్‌ సి.ప్రవీణ్‌ కుమార్‌, జస్టిస్‌ బి.కృష్ణమోహన్‌


హాజరైన తేదీ: 3.1.22

కేసు వ్యవహారం: విశాఖ జిల్లా సబ్బవరం గ్రామ పరిధిలోని ఎనిమిదెకరాల ప్రభుత్వ భూమిలో అక్రమ కట్టడాలను అడ్డుకోవాలంటూ ఇచ్చిన ఆదేశాలను అమలు చేయకపోవడం

అధికారులు: జిల్లా కలెక్టర్‌ మల్లికార్జున

ధర్మాసనం: ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్ర, జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తి


హాజరైన తేదీ: 11.3.22

కేసు వ్యవహారం: ప్రభుత్వాసుపత్రుల్లో రోగులకు ఆహారం సరఫరా చేసిన గుత్తేదారులకు డైట్‌ఛార్జీలు చెల్లించకపోవడం

అధికారులు: వైద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్‌, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ భాస్కర్‌ కాటంనేని

ధర్మాసనం: జస్టిస్‌ బట్టు దేవానంద్‌


హాజరైన తేదీ: 24.3.22

కేసు వ్యవహారం: శ్రీకాళహస్తిలో అదనపు జిల్లా కోర్టు ఏర్పాటులో జాప్యం, సిబ్బంది కేటాయింపులో అలసత్వంపై వ్యాజ్యం

అధికారులు: న్యాయశాఖ కార్యదర్శి వి.సునీత (ఎఫ్‌ఏసీ)

ధర్మాసనం: ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్ర, జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తి


హాజరైన తేదీ: 28.7.22

కేసు వ్యవహారం: 2005 మే నుంచి 2019 జులై వరకు వేతన బకాయిలు రూ.10.59 లక్షలను వడ్డీతోసహా చెల్లించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ బి.కృష్ణమూర్తి అనే ఉద్యోగి హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఉత్తర్వులను అమలు చేయకపోవడంతో దాఖలైన కోర్టు ధిక్కరణ వ్యాజ్యం

అధికారులు: ఏలూరు జల వనరులశాఖ ఎస్‌ఈ ఆర్‌.శ్రీరామకృష్ణ, మరో ఇద్దరు అధికారులు పి.నాగార్జునరావు, పి.సుబ్రహ్మణేశ్వరావు. విచారణకు గైర్హాజరైన సీఎం అప్పటి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.జవహర్‌రెడ్డిపై తీవ్ర అసహనం

ధర్మాసనం: జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులు


హాజరైన తేదీ: 24.8.2021

కేసు వ్యవహారం: ఉపాధి హామీ పథకం కింద గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన పనులకు బకాయిలు చెల్లించకపోవడంపై వివరణ ఇచ్చేందుకు..

అధికారులు: పంచాయతీరాజ్‌శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌.ఎస్‌.రావత్‌

ధర్మాసనం: అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఏకే గోస్వామి, జస్టిస్‌ ఎన్‌.జయసూర్య


హాజరైన తేదీ: 22.9.2021

కేసు వ్యవహారం: ఉపాధి హామీ పథకం కింద గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన పనులకు బకాయిలు చెల్లించకపోవడంపై వివరణ ఇచ్చేందుకు..

అధికారులు: పంచాయతీరాజ్‌శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్‌ గిరిజా శంకర్‌, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌.ఎస్‌.రావత్‌

ధర్మాసనం: అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఏకే గోస్వామి, జస్టిస్‌ ఎన్‌.జయసూర్య


హాజరైన తేదీ: 24.9.2021

కేసు వ్యవహారం: నరేగా కింద గత ప్రభుత్వ హయాంలో చేసిన పనులకు రాష్ట్ర ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడాన్ని సవాలు చేస్తూ దాఖలైన 500 వ్యాజ్యాలపై హైకోర్టు విచారణ

అధికారులు: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) ఆదిత్యనాథ్‌ దాస్‌

ధర్మాసనం: జస్టిస్‌ బట్టు దేవానంద్‌


హాజరైన తేదీ: 21.12.2021

కేసు వ్యవహారం: సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణతో అనంతపురంలో నమోదైన కేసులో తెదేపా మహిళా నేతల ఇళ్లలోకి చొరబడి పోలీసుల సోదాలు

అధికారులు: అనంతపురం జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప

ధర్మాసనం: జస్టిస్‌ డి.రమేశ్‌


హాజరైన తేదీ: 7.2.2022

కేసు వ్యవహారం: బిల్లుల సొమ్ము చెల్లింపులో సీఎఫ్‌ఎంఎస్‌వద్ద జాప్యంపై వివరణ

అధికారులు: ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్‌

ధర్మాసనం: జస్టిస్‌ బట్టు దేవానంద్‌


హాజరైన తేదీ: 4.3.2022

కేసు వ్యవహారం: ప్రకాశం జిల్లా కొమరోలులోని ఎస్‌ఎల్‌వీ ఎడ్యుకేషనల్‌ సొసైటీపై వచ్చిన అవినీతి ఆరోపణల్లో కేసు నమోదు చేసి ఏళ్లు గడుస్తున్నా అభియోగ పత్రం దాఖలులో జాప్యంపై వివరణ ఇచ్చేందుకు

అధికారులు: అనిశా పూర్వ డీజీ, ప్రస్తుత నిఘా విభాగాధిపతి పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు

ధర్మాసనం: ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్ర, జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తి


హాజరైన తేదీ: 8.3.2022

కేసు వ్యవహారం: కొవిడ్‌ కేంద్రాలకు ఆహారాన్ని సరఫరా చేసిన కాంట్రాక్టర్లకు, పాఠశాలలకు ఫర్నిచర్‌ సరఫరా చేసిన వారికి, ఉపాధి హామీ పనులు చేపట్టిన గుత్తేదారులకు, విద్యాశాఖలో నిర్మాణాలు చేపట్టిన వారికి, టెక్స్‌టైల్‌ టెక్నాలజీకి చెందిన పరిపాలన భవన నిర్మాణానికి బిల్లులు చెల్లించకపోవడం

అధికారులు: సీఎస్‌ సమీర్‌ శర్మ, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌.ఎస్‌.రావత్‌

ధర్మాసనం: జస్టిస్‌ బట్టు దేవానంద్‌


హాజరైన తేదీ: 31.3.2022

కేసు వ్యవహారం: ప్రభుత్వ పాఠశాల ప్రాంగణాల్లో గ్రామ, వార్డు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, ఆరోగ్య కేంద్రాల నిర్వహణ, నిర్మాణాలు సరికాదని, వాటిని తొలగించాలని 2020 జూన్‌ 11న ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయకపోవడంపై కోర్టు ధిక్కరణ కేసు

అధికారులు: ఐఏఎస్‌ అధికారులు గోపాలకృష్ణ ద్వివేది, ఎం.గిరిజా శంకర్‌, బి.రాజశేఖర్‌, వాడ్రేవు చిన వీరభద్రుడు, జె.శ్యామలరావు, వై.శ్రీలక్ష్మి, జి.విజయ కుమార్‌, ఎం.ఎం నాయక్‌

ధర్మాసనం: జస్టిస్‌ బట్టు దేవానంద్‌


హాజరైన తేదీ: 18.4.2022

కేసు వ్యవహారం: స్నాతకోత్సవం నిర్వహణ సందర్భంగా వేదిక, తదితర ఏర్పాట్లకు బిల్లుల చెల్లింపు కోసం దాఖలైన వ్యాజ్యం

అధికారులు: ఎన్టీఆర్‌ వైద్య, ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉపకులపతి శ్యాంప్రసాద్‌, రిజిస్ట్రార్‌ శంకర్‌

ధర్మాసనం: జస్టిస్‌ బట్టు దేవానంద్‌


హాజరైన తేదీ: 6.5.2022

కేసు వ్యవహారం: కర్నూలు డీఎస్సీ తనను విలేజ్‌ అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌ (గ్రేడ్‌-2)గా ఎంపిక చేయకపోవడాన్ని సవాలు చేస్తూ కర్నూలు జిల్లాకు చెందిన ఎన్‌.మదన సుందర్‌గౌడ్‌ దాఖలు చేసిన వ్యాజ్యంలో కోర్టు ఉత్తర్వులను అమలు చేయకపోవడంతో పిటిషనర్‌ వేసిన కోర్టు ధిక్కరణ వ్యాజ్యం

అధికారులు: వ్యవసాయశాఖ పూర్వ కమిషనర్‌ హెచ్‌ అరుణ్‌ కుమార్‌, పౌరసరఫరాల సంస్థ ఎండీ జి.వీరపాండియన్‌

ధర్మాసనం: జస్టిస్‌ బట్టు దేవానంద్‌


హాజరైన తేదీ: 14.6.2022

కేసు వ్యవహారం: ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులకు బిల్లులు చెల్లించాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయలేదంటూ దాఖలైన కోర్టు ధిక్కరణ వ్యాజ్యం

అధికారులు: పంచాయతీరాజ్‌ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్‌ కె.శశిధర్‌, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌.ఎస్‌ రావత్‌

ధర్మాసనం: జస్టిస్‌ బట్టు దేవానంద్‌


హాజరైన తేదీ: 30.9.2022

కేసు వ్యవహారం: రేషన్‌ బియ్యం తరలింపు ఆరోపణలు, వాహనాల సీజ్‌ వ్యవహారంలో ఎస్సై హోదాకు తగ్గని వ్యక్తి తనిఖీలు చేయడానికి వీల్లేదని గతంలో హైకోర్టు తీర్పు ఇచ్చినా పోలీసులు పట్టించుకోకపోవడం

అధికారులు: డీజీపీ రాజేంద్రనాథరెడ్డి

ధర్మాసనం: జస్టిస్‌ బట్టు దేవానంద్‌


హాజరైన తేదీ: 15.11.2022

కేసు వ్యవహారం: జాతీయ జూనియర్‌ కబడ్డీ పోటీల్లో పాల్గొనేందుకు రెండు గ్రూపుల్లోని ప్రతిభావంతులైన క్రీడాకారుల పేర్లను ఎంపికచేసి అమెచ్యూర్‌ కబడ్డీ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియాకు పంపే వ్యవహారం

అధికారులు: శాప్‌ ఎండీ ఎన్‌.ప్రభాకర్‌రెడ్డి

ధర్మాసనం: జస్టిస్‌ సీహెచ్‌ మానవేంద్రనాథ్‌ రాయ్‌


హాజరైన తేదీ: 18.11.2022

కేసు వ్యవహారం: ఉపాధి హామీ బిల్లులు చెల్లించకపోవడాన్ని సవాలు చేస్తూ పెదనందిపాడుకు చెందిన రాఘవయ్య తదితరులు హైకోర్టును ఆశ్రయించారు. బిల్లులు చెల్లించాలన్న న్యాయస్థానం ఉత్తర్వులను అమలు చేయకపోవడంతో కోర్టు ధిక్కరణ వ్యాజ్యాలు

అధికారులు: పంచాయతీరాజ్‌శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్‌ కోన శశిధర్‌, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్‌, గుంటూరు జిల్లా పూర్వ కలెక్టర్‌ వివేక్‌ యాదవ్‌

ధర్మాసనం: జస్టిస్‌ బట్టు దేవానంద్‌


హాజరైన తేదీ: 18.11.2022

కేసు వ్యవహారం: తమకు పింఛను ప్రయోజనాలను కల్పించే విషయంలో.. క్రమబద్ధీకరించడానికి ముందున్న సర్వీసునూ పరిగణనలోకి తీసుకోవాలని 1985-1991 మధ్య ప్రభుత్వ పాఠశాలల్లో పార్ట్‌టైం టీచర్లుగా పని చేసిన పలువురు ఏపీ పరిపాలనా ట్రైబ్యునల్‌ (ఏపీఏటీ)ని ఆశ్రయించారు. ఆ ప్రయోజనాలను కల్పించాలని ఏపీఏటీ 2017 ఏప్రిల్‌లో తీర్పు ఇచ్చింది. ఆ తీర్పుపై ప్రభుత్వం హైకోర్టు, సుప్రీంకోర్టును ఆశ్రయించింది. న్యాయస్థానాలు తోసిపుచ్చాయి. పింఛను ప్రయోజనాలను కల్పించకపోవడంతో 2020లో ఉపాధ్యాయులు కోర్టు ధిక్కరణ వ్యాజ్యాలు వేశారు.

అధికారులు: పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్‌, అప్పటి కమిషనర్‌, విశ్రాంత ఐఏఎస్‌ అధికారి చిన వీరభద్రుడు, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌.ఎస్‌.రావత్‌

ధర్మాసనం: జస్టిస్‌ ఏవీ శేషసాయి, జస్టిస్‌ ఆర్‌ రఘునందన్‌రావు


హాజరైన తేదీ: 22.12.2022

కేసు వ్యవహారం: పాఠశాల ప్రాంగణాల్లో కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా గ్రామ, వార్డు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, ఆరోగ్య కేంద్రాల నిర్మాణంపై వివరణ ఇచ్చేందుకు

అధికారులు: సీఎస్‌ కేఎస్‌ జవహర్‌రెడ్డి, పంచాయతీరాజ్‌శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌

ధర్మాసనం: జస్టిస్‌ బట్టు దేవానంద్‌


హాజరైన తేదీ: 29.12.2022

కేసు వ్యవహారం: పూర్వ పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు మండలం సమిశ్రగూడెం పంచాయతీలో జడ్పీ హైస్కూలు భవనం, స్థలం ఆక్రమణ వ్యవహారం. సర్వే చేసి, పాఠశాల స్థలంలో ఆక్రమణలుంటే తొలగించాలని, ప్రహరీ నిర్మించాలని న్యాయస్థానం ఆదేశం. ఆ ఉత్తర్వులను అమలు చేయకపోవడంతో కోర్టు ధిక్కరణ వ్యాజ్యం

అధికారులు: పశ్చిమ గోదావరి జిల్లా పూర్వ కలెక్టర్‌, సీఎం అదనపు కార్యదర్శి రేవు ముత్యాలరాజు, నిడదవోలు అప్పటి తహసీల్దారు శాస్త్రి, పంచాయతీరాజ్‌ సబ్‌డివిజినల్‌ ఇంజినీర్‌ ఎం.గంగరాజు

ధర్మాసనం: జస్టిస్‌ బట్టు దేవానంద్‌


హాజరైన తేదీ: 6.1.2023

కేసు వ్యవహారం: ఎస్సీ కార్పొరేషన్‌ నిధుల మళ్లింపు, ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా యువతకు పోటీ పరీక్షలకు శిక్షణ ఇచ్చిన ఓ సంస్థకు బకాయిలు చెల్లించకపోవడంపై వివరణ ఇచ్చేందుకు..

అధికారులు: ఎస్సీ కార్పొరేషన్‌ ఎండీ చినరాములు

ధర్మాసనం: జస్టిస్‌ బట్టు దేవానంద్‌


హాజరైన తేదీ: 6.1.2023

కేసు వ్యవహారం: ప్రకాశం జిల్లాకు చెందిన వీఎల్‌ గణపతి గ్రానైట్స్‌ సంస్థ రూ.43 లక్షల బకాయిలు చెల్లించాల్సి ఉందన్న కారణంతో విద్యుత్‌ కనెక్షన్‌ తొలగింపు. పునరుద్ధరించాలని ఇచ్చిన ఆదేశాలను అధికారులు అమలు చేయకపోవడం

అధికారులు: ఇంధనశాఖ ఎస్‌సీఎస్‌ కె.విజయానంద్‌, సీపీడీసీఎల్‌ సీఎండీ జనార్దన్‌రెడ్డి, ఎస్‌ఈ సత్యనారాయణ, ఈఈ సయ్యద్‌ అబ్దుల్‌ కరీం

ధర్మాసనం: జస్టిస్‌ బట్టు దేవానంద్‌


హాజరైన తేదీ: 18.1.2023

కేసు వ్యవహారం: ఓ పార్ట్‌టైం లెక్చరర్‌ సర్వీసును క్రమబద్ధీకరించాలని ఇచ్చిన ఆదేశాల అమలులో తీవ్ర జాప్యం చేసినందుకు కోర్టు ధిక్కరణ కేసులో హాజరు. న్యాయస్థానం శిక్ష విధించింది. తర్వాత దాఖలైన అప్పీల్లో ధర్మాసనం స్టే ఇచ్చింది.

అధికారులు: ఇంటర్మీడియట్‌ విద్య పూర్వ కమిషనర్‌ వి.రామకృష్ణ, పాఠశాల విద్యాశాఖ పూర్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్‌

ధర్మాసనం: జస్టిస్‌ బట్టు దేవానంద్‌


హాజరైన తేదీ: 19.01.2023

కేసు వ్యవహారం: ఏపీఎస్‌ఆర్టీసీలో అప్రెంటిస్‌గా పనిచేసిన పిటిషనర్లకు ‘శ్రామిక్‌’ పోస్టుల భర్తీలో 30% బోనస్‌ మార్కులిచ్చే విషయంలో తగిన ఉత్తర్వులు ఇవ్వాలంటూ ఇచ్చిన ఆదేశాలను ఆర్టీసీ అధికారులు అమలు చేయకపోవడం

అధికారులు: ఆర్టీసీ అప్పటి ఎండీ ఎంటీ కృష్ణబాబు, అనంతపురం ఆర్టీసీ ఆర్‌ఎం సుమంత్‌ ఆర్‌.ఆంటోనీ

ధర్మాసనం: జస్టిస్‌ బట్టు దేవానంద్‌


హాజరైన తేదీ: 20.1.2023

కేసు వ్యవహారం: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు మండలం సమిశ్రగూడెం పంచాయతీలో జడ్పీ హైస్కూలు భవనం, స్థలం ఆక్రమణ వ్యవహారం. సర్వేచేసి, పాఠశాల స్థలంలో ఆక్రమణలుంటే తొలగించాలని, ప్రహరీ నిర్మించాలని న్యాయస్థానం ఆదేశం. ఆ ఉత్తర్వులను అమలుచేయకపోవడంతో కోర్టుధిక్కరణ వ్యాజ్యం దాఖలు

అధికారులు: పశ్చిమగోదావరి జిల్లా పూర్వ కలెక్టర్‌, సీఎం అదనపు కార్యదర్శి రేవు ముత్యాలరాజు, నిడదవోలు అప్పటి తహసీల్దారు శాస్త్రి, పంచాయతీరాజ్‌ సబ్‌డివిజినల్‌ ఇంజినీర్‌ ఎం.గంగరాజు

ధర్మాసనం: జస్టిస్‌ బట్టు దేవానంద్‌


హాజరైన తేదీ: 20.1.2023

కేసు వ్యవహారం: ఓ వ్యక్తికి చెందిన విద్యుత్‌ సర్వీసును అనధికారికంగా మరొకరికి బదిలీ చేయడంపై వివరణ ఇచ్చేందుకు

అధికారులు: ఏపీఎస్పీడీసీఎల్‌ సీఎండీ సంతోషరావు

ధర్మాసనం: జస్టిస్‌ బట్టు దేవానంద్‌



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు