విద్యపైనే ఎక్కువ ఖర్చు చేస్తున్నాం

‘రాష్ట్ర ప్రభుత్వం విద్యపై పెద్ద ఎత్తున పెట్టుబడి పెడుతోంది. ఈ రంగంపై పెట్టే ప్రతి రూపాయి మానవ వనరులపై పెడుతున్నట్లే. దీనివల్ల ఆయా కుటుంబాల తలరాతలు మారతాయి. తద్వారా రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి తలరాత మారుతుంది.

Published : 04 Feb 2023 05:16 IST

అది మానవ వనరులపై పెడుతున్న పెట్టుబడే
ముఖ్యమంత్రి జగన్‌ వెల్లడి
విదేశీ విద్యాదీవెన కింద రూ.19.95 కోట్ల సాయం

ఈనాడు, అమరావతి: ‘రాష్ట్ర ప్రభుత్వం విద్యపై పెద్ద ఎత్తున పెట్టుబడి పెడుతోంది. ఈ రంగంపై పెట్టే ప్రతి రూపాయి మానవ వనరులపై పెడుతున్నట్లే. దీనివల్ల ఆయా కుటుంబాల తలరాతలు మారతాయి. తద్వారా రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి తలరాత మారుతుంది. విదేశీ విద్యాదీవెన కింద పేదలకు సాయం చేయడం ద్వారా విద్యార్థులు గొప్పగొప్ప విశ్వవిద్యాలయాల్లో చదువుకుని ఉన్నతస్థాయికి వెళ్లే అవకాశం లభిస్తోంది’ అని సీఎం జగన్‌ వివరించారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణాల్లోని పేద కుటుంబాలకు చెందిన 213 మంది విద్యార్థులకు విదేశాల్లో చదువుకునేందుకు వీలుగా జగనన్న విదేశీ విద్యాదీవెన కింద సీఎం జగన్‌ శుక్రవారం 19.95 కోట్లు అందించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి బటన్‌ నొక్కి వారి ఖాతాల్లో నిదులు జమచేశారు. ఈ సందర్బంగా ఆయన ఏమన్నారంటే... ‘గాంధీ, నెహ్రూ, అంబేడ్కర్‌ వంటి గొప్ప నాయకులు, మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్యనాదెళ్ల, ఐబీఎం సీఈవో అరవింద కృష్ణ, గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ వంటి వారంతా గొప్ప యూనివర్సిటీల నుంచి వచ్చినవారే. ప్రభుత్వం అందిస్తున్న సాయాన్ని ఆలంబనగా చేసుకుని, పేద విద్యార్థులు కూడా ఆ స్థాయిలో కలలను నిజం చేసుకోవాలి. గత ప్రభుత్వంలో విద్యార్థులకు రూ.10 నుంచి రూ.15 లక్షలు మాత్రమే ఇచ్చేవారు. 2016-17 నుంచి రూ.300 కోట్ల బకాయిలనూ చెల్లించలేదు. ఎలాంటి సమస్యలు రాకుండా మేం టాప్‌ 100 కళాశాలలను పారదర్శకంగా గుర్తించి, వాటిలో చదువుకునే పేదలకు నాలుగు విడతల్లో సాయం అందిస్తున్నాం’ అని పేర్కొన్నారు.

అపోహలు వద్దు

పథకంపై అపోహలు పెంచుకోకుండా సీఎం జగన్‌ అందిస్తున్న సాయాన్ని పేదలు అందిపుచ్చుకోవాలని మంత్రి మేరుగు నాగార్జున కోరారు. ప్రభుత్వం చేస్తున్న ఈ ఆర్థిక సాయం గతంలో ఎవరూ చేయలేదని మరో మంత్రి అంజాద్‌ బాషా అన్నారు. విదేశీ విద్యాదీవెన లబ్ధిదారులైన కొందరు విద్యార్థులు కూడా వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడారు. హార్వర్డ్‌ యూనివర్సిటీలో చదువుతున్న కృష్ణా జిల్లాకు చెందిన బండి సుచరిత బోస్టన్‌ నుంచి మాట్లాడుతూ... ఈ పథకం ఎంతో బాగుందన్నారు. వార్విక్‌ వర్సిటీలో పబ్లిక్‌ హెల్త్‌లో పీజీ చేస్తున్న ఏలూరుకు చెందిన అల్లాడి జ్యోతిర్మయి బ్రిటన్‌లోని కోవెంట్రీ నుంచి మాట్లాడుతూ... ప్రభుత్వ చేయూతతోనే తనకు విదేశాల్లో చదువుకునే అవకాశం వచ్చిందన్నారు. బర్మింగ్‌హామ్‌ వర్సిటీలో ఎంబీఏ చదువుతున్న అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాకు చెందిన నిరూషాదేవి మాట్లాడుతూ... తమ వర్సిటీలో ఇతర రాష్ట్రాల విద్యార్థులూ చదువుతున్నారని, వారికి ఇలాంటి సాయం ఏదీ అందడం లేదన్నారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బి.జయలక్ష్మి, మైనారిటీ సంక్షేమశాఖ కార్యదర్శి ఎ.ఎం.డి. ఇంతియాజ్‌, ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ కె.హేమచంద్రారెడ్డి, కాపు కార్పొరేషన్‌ ఎండీ రేఖారాణి తదితరులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు