AP High Court: రోజూ మిమ్మల్ని చూడ్డానికే చికాకేస్తోంది
కోర్టు ధిక్కరణ కేసుల్లో తరచూ న్యాయస్థానం మెట్లెక్కుతున్న ఉన్నతాధికారులపై హైకోర్టు మండిపడింది. రోజూ మిమ్మల్ని చూడటానికి న్యాయస్థానానికే చికాకు పుడుతోందని శుక్రవారం విచారణకు హాజరైన పంచాయతీరాజ్‌శాఖ పూర్వ ముఖ్య కార్యదర్శి, వ్యవసాయశాఖ ప్రస్తుత ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.ఎస్.రావత్‌లను ఉద్దేశించి ఘాటుగా వ్యాఖ్యానించింది.
కోర్టు ఉత్తర్వులంటే బరితెగింపా?
అధికారుల తీరుపై హైకోర్టు ఆగ్రహం
దేశంలో ధిక్కరణ కేసులు ఇక్కడే ఎక్కువని వెల్లడి
ఐఏఎస్ అధికారులు గోపాలకృష్ణ ద్వివేది, రావత్ 70 కేసుల్లో హాజరు కావడంపై విస్మయం
ఈనాడు, అమరావతి: కోర్టు ధిక్కరణ కేసుల్లో తరచూ న్యాయస్థానం మెట్లెక్కుతున్న ఉన్నతాధికారులపై హైకోర్టు మండిపడింది. రోజూ మిమ్మల్ని చూడటానికి న్యాయస్థానానికే చికాకు పుడుతోందని శుక్రవారం విచారణకు హాజరైన పంచాయతీరాజ్‌శాఖ పూర్వ ముఖ్య కార్యదర్శి, వ్యవసాయశాఖ ప్రస్తుత ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.ఎస్.రావత్‌లను ఉద్దేశించి ఘాటుగా వ్యాఖ్యానించింది. ఈ ఇద్దరు అధికారులే సుమారు 70 కోర్టు ధిక్కరణ వ్యాజ్యాల్లో న్యాయస్థానం ముందు హాజరయ్యారని గుర్తుచేసింది. ఏమిటీ పరిస్థితని విస్మయం వ్యక్తంచేసింది. దేశంలోని మిగతా హైకోర్టులతో పోలిస్తే ఏపీ హైకోర్టులోనే ఎక్కువ సంఖ్యలో ధిక్కరణ కేసులు నమోదవుతున్నాయని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వ అధికారుల తీరు వల్లనే ఇలాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయని చెప్పడానికి సంకోచించడం లేదని తేల్చిచెప్పింది. అధికారులు కోర్టు ఆదేశాలను సరైన స్ఫూర్తితో అమలు చేయడం లేదని తప్పుపట్టింది. విచారణకు హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించాకే న్యాయస్థానం ఉత్తర్వులను అమలు చేస్తున్నారంటే.. అధికారుల తీరు ఎలా ఉందో అర్థమవుతోందని వ్యాఖ్యానించింది. కోర్టు ఉత్తర్వులంటే లెక్కలేనితనమా.. లేక ఏమౌతుందిలే అనే బరితెగింపా.. అని తీవ్ర స్థాయిలో మండిపడింది. ఉపాధి హామీ పథకం పనుల్లో భాగంగా రహదారి నిర్మాణానికి గ్రావెల్ సరఫరా చేసినందుకు ఓ వ్యక్తికి బిల్లుల చెల్లింపులో జరిగిన జ్యాప్యానికి వివరణ ఇస్తూ అదనపు అఫిడవిట్లు దాఖలు చేయాలని అధికారులను ఆదేశిస్తూ విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ శుక్రవారం ఈ మేరకు ఆదేశాలు జారీచేశారు.
ఇదీ కేసు నేపథ్యం..
ఉపాధి హామీ పథకం పనుల్లో భాగంగా రహదారి నిర్మాణానికి 2016లో గ్రావెల్ సరఫరా చేసినందుకు బిల్లులు చెల్లించలేదని ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం తాడివారిపల్లె గ్రామానికి చెందిన కంచర్ల కాసయ్య 2022లో హైకోర్టులో వ్యాజ్యం వేశారు. విచారణ జరిపిన న్యాయమూర్తి.. నాలుగు వారాల్లో సొమ్ము చెల్లించాలని అధికారులను ఆదేశించారు. అధికారులు దానిని అమలు చేయకపోవడంతో కోర్టు ధిక్కరణ వ్యాజ్యం దాఖలు చేశారు. ఇటీవల దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తి ప్రతివాదులు స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. దీంతో శుక్రవారం ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.ఎస్.రావత్, పంచాయతీరాజ్‌శాఖ అప్పటి ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ప్రకాశం జిల్లా కలెక్టర్ ఎ.దినేశ్‌కుమార్, ఒంగోలు పంచాయతీరాజ్ డివిజన్ ఈఈ రమేశ్‌బాబు, తర్లుపాడు ఎంపీడీవో నరసింహులు తదితరులు హాజరయ్యారు.
రావత్‌పై కేసు కొట్టివేత
పిటిషనర్‌కు చెందిన బిల్లులను ఈ ఏడాది జనవరి 13న అప్‌లోడ్ చేయగా.. 23న ఆర్థికశాఖ సొమ్ము విడుదల చేసిందని న్యాయమూర్తి గుర్తుచేశారు. ఆర్థికశాఖ జాప్యం ఏమీ లేదన్నారు. దీంతో ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రావత్‌పై ధిక్కరణ వ్యాజ్యాన్ని న్యాయమూర్తి కొట్టేశారు. మిగిలిన అధికారులను అదనపు అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను రెండు వారాలకు వాయిదా వేశారు.
మళ్లీ వచ్చారా..
కోర్టు హాలులో ఎస్.ఎస్.రావత్, గోపాలకృష్ణ ద్వివేదిని చూసిన న్యాయమూర్తి.. ఈనెల 2న విచారణకు వచ్చారు, మళ్లీ ఈరోజు వచ్చారు. అసలు ఎన్ని కేసుల్లో కోర్టుకు హాజరై ఉంటారని వారి తరఫు ప్రభుత్వ న్యాయవాది (జీపీ)ని ప్రశ్నించారు. 60-70 కేసుల్లో ఈ ఇద్దరు అధికారులు హాజరై ఉంటారని జీపీ బదులిచ్చారు. పిటిషనర్‌కు ఈ ఏడాది జనవరి 23న సొమ్ము చెల్లించామన్నారు. న్యాయమూర్తి స్పందిస్తూ.. కోర్టు ఉత్తర్వులను అలవాటు ప్రకారం ఉల్లంఘిస్తున్నారని అందుకే ఇన్నిసార్లు హాజరుకావలసి వస్తోందన్నారు. కోర్టుకు రమ్మని ఆదేశించాకే పిటిషనర్‌కు సొమ్ము చెల్లించారని గుర్తుచేశారు. వచ్చి వివరణ ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశిస్తేనే కోర్టు ఉత్తర్వులను అమలు చేస్తామనేది అధికారుల ఉద్దేశమైతే ప్రతి కోర్టు ధిక్కరణ కేసులోనూ మొదటి విచారణలోనే హాజరుకు ఆదేశిస్తామన్నారు. బిల్లుల చెల్లింపులో ఐదేళ్ల జాప్యానికి ఎవరు బాధ్యత వహిస్తారని నిలదీశారు. కోర్టు ఉత్తర్వులు అంటే.. ఏమౌతుందిలే అనే భ్రమల్లో అధికారులు ఉండొద్దని హెచ్చరించారు. గోపాలకృష్ణ ద్వివేది బదులిస్తూ.. సాఫ్ట్‌వేర్ తెరుచుకోకపోవడంతో సమస్య ఏర్పడిందని.. కోర్టు అంటే తమకు గౌరవం ఉందని చెప్పారు. ఆ వివరణపై న్యాయమూర్తి స్పందిస్తూ.. గౌరవం ఉంటే బిల్లులు చెల్లించాలని 2022 జనవరిలో న్యాయస్థానం చెప్పిన వెంటనే అమలు చేసేవారన్నారు. ఏపీ ఆన్‌లైన్ లీగల్ కేస్ మానిటరింగ్ సిస్టం ద్వారా ఏ కేసులో ఎలాంటి ఉత్తర్వులు వెలువడ్డాయి, వాటిని ఎప్పటిలోగా అమలు చేయాలనే అంశాలను అధికారుల సమావేశాల్లో చర్చించుకోరా? అని ప్రశ్నించారు. ఆ సమావేశాలు జడ్జీల గురించి చర్చించుకోవడానికి కాదని హితవు పలికారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
‘వచ్చే ఎన్నికల్లో వైకాపాకు ఓటేయం’.. ఎచ్చెర్ల ఎమ్మెల్యేకు తేల్చిచెప్పిన వైకాపా కార్యకర్తలు
-
Ap-top-news News
సీఎం జగన్ కోసం 2 గంటలు వాహనాల మళ్లింపు
-
Ts-top-news News
రైళ్లపై రాళ్లేస్తే అయిదేళ్ల శిక్ష.. ద.మ.రైల్వే హెచ్చరిక
-
World News
Belarus: ‘అమెరికా ఒత్తిడివల్లే.. రష్యా అణ్వాయుధాలకు చోటు!’
-
India News
కరెంటు కోతతో కోపోద్రిక్తుడై.. డిప్యూటీ సీఎం ఇంట్లో బాంబు పెట్టానంటూ ఫోన్!
-
Sports News
IPL 2023: ఆర్సీబీ మార్చ్‌లో గేల్ డ్యాన్స్..కోహ్లీ అని అరుస్తూ ప్రేక్షకుల కేరింతలు