కీలక ప్రాజెక్టులకు కేటాయింపులు అరకొర
రాష్ట్రంలో కీలకమైన రైల్వేప్రాజెక్టులకు కేంద్రం మరోసారి మొండిచెయ్యి చూపింది. సుదీర్ఘకాలంగా నిర్మాణంలో ఉన్నవాటికి అరకొర కేటాయింపులు చేయడంతో అవి ఇప్పట్లో పూర్తయ్యే అవకాశాలు కనిపించడంలేదు. అనేక కొత్త లైన్లను ప్రకటించి, గతంలోనే బడ్జెట్లలో చూపించినా.. వాటికి నామమాత్రంగా రూ.వెయ్యి, రూ.లక్ష, రూ.10 లక్షల చొప్పున విదిల్చింది.
అమరావతి మీదగా కొత్తలైన్‌కు కేవలం రూ.10 లక్షలు
విశాఖ జోన్, రాయగడ డివిజన్‌కు కలిపి రూ.10 కోట్లు
రెండోలైన్, మూడో లైన్ పనులకే ఆశాజనకం
రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులకు రూ.9,406 కోట్ల కేటాయింపు
ఈనాడు-అమరావతి, విశాఖపట్నం: రాష్ట్రంలో కీలకమైన రైల్వేప్రాజెక్టులకు కేంద్రం మరోసారి మొండిచెయ్యి చూపింది. సుదీర్ఘకాలంగా నిర్మాణంలో ఉన్నవాటికి అరకొర కేటాయింపులు చేయడంతో అవి ఇప్పట్లో పూర్తయ్యే అవకాశాలు కనిపించడంలేదు. అనేక కొత్త లైన్లను ప్రకటించి, గతంలోనే బడ్జెట్లలో చూపించినా.. వాటికి నామమాత్రంగా రూ.వెయ్యి, రూ.లక్ష, రూ.10 లక్షల చొప్పున విదిల్చింది. రాజధాని అమరావతి మీదుగా విజయవాడ-గుంటూరుకు అనుసంధానం చేసే కొత్తలైన్‌కు రూ.10 లక్షలే కేటాయించారు. విశాఖ కేంద్రంగా ఏర్పాటయ్యే దక్షిణకోస్తా కొత్తజోన్‌తోపాటు, రాయగడ డివిజన్‌కు కలిపి రూ.10 కోట్లే ఇచ్చారు. పలు రెండోలైన్, మూడోలైన్ పనులకు దండిగానే కేటాయించారు. 2023-24 కేంద్ర బడ్జెట్‌లో రైల్వేశాఖ ప్రాజెక్టుల వారీగా నిధుల కేటాయింపు వివరాలు తెలిపే పింక్‌బుక్‌ను అధికారులు శుక్రవారం విడుదల చేశారు. దక్షిణమధ్య రైల్వేజోన్‌లోని విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లలో కలిపి రూ.8,406 కోట్లు, తూర్పుకోస్తా రైల్వే పరిధిలోని వాల్తేరు డివిజన్‌లో రూ.వెయ్యి కోట్లు కలిపి మొత్తంగా రూ.9,406 కోట్లు కేటాయించారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టులకు భారీగా నిధులు సాధించడంలో రాష్ట్రప్రభుత్వం, వైకాపా ఎంపీలు విఫలం కావడంతో.. మరోసారి బడ్జెట్‌లో అరకొర నిధులే మంజూరయ్యాయి. రాష్ట్రప్రభుత్వ భాగస్వామ్యంతో నిర్మించే కొత్త ప్రాజెక్టులకు మూడేళ్లుగా నిధులివ్వకపోవడంతో అవి ముందుకు సాగట్లేదు. ఈసారి రైల్వేశాఖ అందులో రెండింటికే కొంత నిధులిచ్చింది. పలు కొత్తలైన్లకు మంజూరుచేసిన నిధులు చూస్తే.. అవి పూర్తయ్యేందుకు దశాబ్దాలు పట్టినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.
రాష్ట్ర వాటాలేక కేంద్రమూ నిర్లక్ష్యం
విభజన హామీలో భాగంగా విశాఖపట్నం కేంద్రంగా దక్షిణకోస్తా జోన్, రాయగడ కేంద్రంగా కొత్త డివిజన్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించి నాలుగేళ్లయింది. వీటికి అవసరమైన భవనాల నిర్మాణం, వసతుల కల్పనలకు రూ.170 కోట్లు ఖర్చవుతుందని ప్రతిపాదించి, రూ.10 కోట్లే కేటాయించారు. ఇటీవల ప్రధాన కార్యాలయం, సిబ్బంది క్వార్టర్ల నిర్మాణానికి స్థల పరిశీలన చేసి, లేఅవుట్ ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. వచ్చే ఏడాది రూ.10 కోట్లతో ఎంతమేరకు పనులు జరుగుతాయనేది ప్రశ్నార్థకం కానుంది.
కొత్తలైన్లు పూర్తయ్యేదెప్పుడు?
అనేక కొత్తలైన్ల నిర్మాణప్రాజెక్టులకు నిధుల కేటాయింపు చూస్తే.. అవి ఇప్పట్లో పూర్తయ్యే అవకాశాలు లేవు.
* కడప-బెంగళూరు మధ్య 255 కి.మీ. (రాష్ట్రంలో 218 కి.మీ.) నిర్మించాల్సిన కొత్తలైనుకు బడ్జెట్‌లో రూ.10 లక్షలే కేటాయించారు. 2008-09లో మంజూరైన ఈ ప్రాజెక్టు విలువ రూ.2,849 కోట్లుకాగా, అయిదేళ్ల కిందట 21 కి.మీ. నిర్మాణం జరిగింది. తర్వాత నుంచి రాష్ట్రప్రభుత్వం వాటా 50% ఇవ్వకపోవడంతో పనులు ఆగిపోయాయి. ఈలెక్కన ఈ ప్రాజెక్టు పూర్తయ్యేందుకు మరో 20-30 ఏళ్లు పట్టనుంది.
* నడికుడి-శ్రీకాళహస్తి కొత్తలైన్ 309 కి.మీ. మేర నిర్మించాలి. దీని అంచనావిలువ రూ.2,289 కోట్లు. రెండేళ్లుగా 50% రాష్ట్రవాటా ఇవ్వకపోయినా రైల్వేశాఖ కొంతమేర పనులు చేసింది. ఈసారి బడ్జెట్‌లో దీనికి రూ.202 కోట్లు కేటాయించారు.
* 2000-01లో మంజూరైన కోటిపల్లి-నరసాపురం (57.21 కి.మీ.) కొత్తలైన్ పనులు తూతూమంత్రంగా సాగుతున్నాయి. రూ.2,120 కోట్లు వ్యయమయ్యే ఈ ప్రాజెక్టుకు రాష్ట్రవాటా 25% ఇవ్వలేదు. రైల్వేశాఖ గత బడ్జెట్‌లో రూ.21.40 కోట్లు, ఈసారి రూ.100 కోట్లు మంజూరుచేసింది. ఇది పూర్తయ్యేందుకు 10-20 ఏళ్లు పట్టే సూచనలు కనిపిస్తున్నాయి.
ఈ లైన్లు పట్టాలెక్కేది ఎప్పుడు?
గతంలో మంజూరైన కొత్తలైన్లకు రైల్వేశాఖ మొక్కుబడిగా బడ్జెట్‌లో నిధులు విదిల్చింది.
* మాచర్ల-నల్గొండ (92 కి.మీ.) లైన్‌కు రూ.వెయ్యి, కాకినాడ-పిఠాపురం (21.51 కి.మీ.) లైన్‌కు రూ.లక్ష, గూడూరు-దుగరాజపట్నం (41.55 కి.మీ.) లైన్‌కు రూ.10 లక్షలు, కొండపల్లి-కొత్తగూడెం (125 కి.మీ.) లైన్‌కు రూ.10 లక్షలు, కంభం-ప్రొద్దుటూరు (142 కి.మీ.) లైన్‌కు రూ.కోటి, భద్రాచలం-కొవ్వూరు (151 కి.మీ.) లైన్‌కు రూ.20 కోట్లు కేటాయించారు.
* సర్వేదశలో ఉన్న దువ్వాడ-విజయవాడ లైన్‌కు రూ.10 లక్షలే ఇచ్చారు.
రెండు, మూడో లైన్లకు అధిక నిధులు
మనరాష్ట్ర పరిధిలో ఉన్న పలు రెండో, మూడోలైన్లకు నిధులు అధికంగానే కేటాయించారు. గుంటూరు-గుంతకల్లు (401 కి.మీ.) రెండోలైన్‌కు రూ.980 కోట్లు, విజయవాడ-గూడూరు (287 కి.మీ.) మూడోలైన్‌కు రూ.800 కోట్లు, కాజీపేట-విజయవాడ (219 కి.మీ.) మూడోలైన్‌కు రూ.337.51 కోట్లు మంజూరుచేశారు.
* విజయవాడ-గుడివాడ, మచిలీపట్నం-భీమవరం, నరసాపురం-నిడదవోలు మధ్య విద్యుదీకరణతో కూడిన రెండోలైన్‌కు రూ.100 కోట్లు కేటాయించారు.
* గుంటూరు-బీబీనగర్ మధ్య 248 కి.మీ.మేర నిర్మించనున్న రెండోలైన్‌కు రూ.60 కోట్లే కేటాయించారు. ఈ ప్రాజెక్టు 2019-20లో రూ.2,480 కోట్లతోమంజూరైంది.
* కొత్తవలస-కోరాపుట్ (189 కి.మీ.) రెండోలైన్‌కు రూ.410 కోట్లు, విజయనగరం-సంబల్‌పూర్ (264 కి.మీ.) రెండో లైన్‌కు రూ.920 కోట్లు, ధర్మవరం-పాకాల-కాట్పాడి (290 కి.మీ.) రెండోలైన్‌కు రూ.40 కోట్లు, గుత్తి-ధర్మవరం (90 కి.మీ.) రెండోలైన్‌కు రూ.90.6 కోట్లు కేటాయించారు.
నాలుగు బైపాస్‌లకు..
రద్దీ ఉండే పలు రైల్వేజంక్షన్లలో గూడ్సురైళ్లు స్టేషన్‌కు రాకుండానే బయట నుంచి వెళ్లేందుకు వీలుగా నిర్మిస్తున్న బైపాస్ లైన్లకు నిధులు కేటాయించారు. రేణిగుంట (9.60 కి.మీ.), గుత్తి (3.8 కి.మీ)తో పాటు వాడి (7.6 కి.మీ.) బైపాస్‌లకు కలిపి రూ.73.12 కోట్లు కేటాయించారు. విజయవాడ బైపాస్‌లైన్ (19.5 కి.మీ.), కాజీపేట బైపాస్‌లైన్ (10.65 కి.మీ)కు రూ.310 కోట్లు మంజూరుచేశారు.
వ్యాగన్ మరమ్మతుల కేంద్రానికి రూ.125 కోట్లు
* కర్నూలులోని వ్యాగన్ మరమ్మతుల కేంద్రానికి రూ.125కోట్లు కేటాయించారు. ఇది 2013-14లో మంజూరు కాగా, పదేళ్లుగా పనులు జరుగుతూనే ఉన్నాయి.
ఎన్నేళ్లవుతుందో..
కేంద్రం విడుదల చేస్తున్న నిధులను పరిశీలిస్తే జోన్ ఎప్పుడు పూర్తవుతుందోనన్న సందేహం తలెత్తుతోంది. ఇప్పటికే జోన్ ప్రకటించి నాలుగేళ్లు అవుతోంది. డీపీఆర్ తయారుచేసి రైల్వేబోర్డుకు నివేదిక సమర్పించి మూడేళ్లు అయింది. జోన్‌ను అమల్లోకి తీసుకురావడంలో కీలకమైన అడ్మినిస్ట్రేటివ్ గ్రేడ్ లెవెల్ కమిటీ ఇంకా ఏర్పడలేదు. ఈ కమిటీ జోన్‌పై పూర్తిస్థాయి కసరత్తు చేస్తుంది. అలాంటిదేమీ జరగలేదని తెలుస్తోంది.
అమరావతి లైన్‌కు మొండిచేయి
రాజధాని ప్రాంతమైన అమరావతికి ఇటు విజయవాడ, అటు గుంటూరువైపు రైల్వేలైన్లతో అనుసంధానం చేసే ఎర్రుపాలెం-అమరావతి-నంబూరు, అమరావతి-పెదకూరపాడు, సత్తెనపల్లి-నరసరావుపేట మధ్య 106 కి.మీ. కొత్తలైన్‌కు రైల్వేశాఖ మళ్లీ మొండిచేయి చూపింది. దీనికి రూ.2,679 కోట్లు వ్యయమవుతుందని అంచనా వేయగా.. బడ్జెట్‌లో రూ.10 లక్షలే కేటాయించారు. రాష్ట్రప్రభుత్వం ఎంత వాటా ఇస్తుందో తెలపాలని రైల్వేశాఖ కోరుతుంటే.. రాష్ట్రప్రభుత్వం స్పందించట్లేదు. దీంతో కేంద్రం కూడా నిధులివ్వకుండా నిర్లక్ష్యం చూపింది.
దక్షిణకోస్తా జోన్‌కు మిగిలింది నిరాశే
విశాఖ కేంద్రంగా దక్షిణకోస్తా రైల్వేజోన్ ఏర్పాటుకు నిధులు ఎప్పుడిస్తారనేది అర్థం కావట్లేదు. తూర్పుకోస్తా రైల్వేపరిధిలోని వాల్తేరు డివిజన్‌కు రూ.2,857 కోట్లను కేటాయించిన రైల్వేశాఖ... జోన్ ఏర్పాటుకు ఇచ్చే నిధులేంటో 2023-24 బడ్జెట్‌లో పేర్కొనలేదు. కంటితుడుపుగా రూ.పది కోట్లనే కేటాయించింది. జోన్‌తో పాటు కొత్త రాయగడ డివిజన్ కోసం ఆ నిధులను ఇచ్చినట్లు పింక్‌బుక్‌లో పేర్కొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Tourism: ఈ దేశాల్లో పర్యటన.. భారతీయులకు చాలా సులువు
-
World News
School Shooting: పక్కా ప్రణాళిక రచించి.. మ్యాపుతో వచ్చి..: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం
-
Movies News
Nani: ఆ రాంబాబేనా ఈ ‘ధరణి’?.. ఆసక్తికరం నాని జర్నీ!
-
Crime News
Vizag : ఆత్మహత్య చేసుకుంటామని బంధువులకు సెల్ఫీ వీడియో పంపిన దంపతులు..
-
India News
Rahul Gandhi: ‘చట్టాన్ని గౌరవించడమే.. ’: రాహుల్ ‘అనర్హత’పై అమెరికా స్పందన ఇదే..
-
Sports News
Virat -Babar: ఆ ఒక్క క్వాలిటీనే వ్యత్యాసం.. అందుకే బాబర్ కంటే విరాట్ అత్యుత్తమం: పాక్ మాజీ ఆటగాడు