CBI: అవినాష్‌ ఎన్నిసార్లు కాల్‌ చేశారు?

‘మాజీ మంత్రి వై.ఎస్‌.వివేకానందరెడ్డి హత్య జరిగిన రోజున కడప ఎంపీ అవినాష్‌రెడ్డి మీకు ఎన్ని సార్లు కాల్‌ చేశారు? కాల్‌ చేసి ఆ ఫోన్‌ ఎవరికి ఇవ్వమని చెప్పారు? మీరు ఎవరికిచ్చారు? సీఎం జగన్‌, ఆయన సతీమణి భారతితో మాట్లాడించారా?

Updated : 04 Feb 2023 09:48 IST

ఆ ఫోన్‌ ఎవరికి ఇవ్వమని అడిగారు?
వివేకా హత్య కేసులో జగన్‌ ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి, భారతి పీఏ నవీన్‌పై సీబీఐ ప్రశ్నల వర్షం
ఆరున్నర గంటల పాటు కడపలో విచారణ
అనంతరం సీఎస్‌ జవహర్‌రెడ్డితో కలిసి వెళ్లిన కృష్ణమోహన్‌రెడ్డి, నవీన్‌
త్వరలో ‘‘కీలక వ్యక్తులకు’’ నోటీసులు

ఈనాడు డిజిటల్‌-కడప, ఈనాడు-అమరావతి: ‘మాజీ మంత్రి వై.ఎస్‌.వివేకానందరెడ్డి హత్య జరిగిన రోజున కడప ఎంపీ అవినాష్‌రెడ్డి మీకు ఎన్ని సార్లు కాల్‌ చేశారు? కాల్‌ చేసి ఆ ఫోన్‌ ఎవరికి ఇవ్వమని చెప్పారు? మీరు ఎవరికిచ్చారు? సీఎం జగన్‌, ఆయన సతీమణి భారతితో మాట్లాడించారా? అవినాష్‌ వారితో ఎన్ని సార్లు, ఎంతసేపు మాట్లాడారు? అవినాష్‌ కాకుండా ఆ రోజున మీకు ఇంకా ఎవరెవరు కాల్‌ చేశారు?’ అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి, సీఎం సతీమణి వైఎస్‌ భారతి వ్యక్తిగత సహాయకుడు నవీన్‌పై సీబీఐ ప్రశ్నల వర్షం కురిపించింది. వివేకా హత్య కేసులో శుక్రవారం వీరిరువురినీ కడపలో దాదాపు ఆరున్నర గంటల పాటు సుదీర్ఘంగా విచారించింది. వారి సమాధానాల్లో తేడాలున్నాయని భావించినప్పుడల్లా.. తమ వద్దనున్న కాల్‌ డేటా, ఇతర సమాచారం ఆధారంగా ప్రశ్నలు సంధించినట్లు తెలిసింది.

‘అవినాష్‌ మీకు తొలుత కాల్‌ చేసినప్పుడు వివేకా మృతిచెందారన్న విషయం చెప్పారా? చెబితే ఆయన ఎలా చనిపోయారని చెప్పారు? అవినాష్‌ నుంచి కాల్‌ వచ్చిన తర్వాత జగన్‌, భారతిల స్పందన ఏంటి? ఆ కాల్‌ వచ్చిన తర్వాత ఆ రోజున అక్కడ ఏయే పర్యవసానాలు చోటుచేసుకున్నాయి?’ అని ఆరా తీసినట్లు సమాచారం. వివేకా హత్య కేసులో ఇప్పటివరకూ పలువుర్ని విచారించిన సీబీఐ ముఖ్యమంత్రి వద్ద, ఆయన సతీమణి వద్ద పనిచేసేవారిని ప్రశ్నించి, వివరాలు రాబట్టడం సంచలనంగా మారింది. వీరిరువురు వెల్లడించిన అంశాల ఆధారంగా త్వరలో మరికొందరు ‘‘కీలక వ్యక్తులకు’’ సీబీఐ నోటీసులు ఇవ్వనున్నట్లు సమాచారం.

అవినాష్‌ కాల్‌ డేటా ఆధారంగా...

వివేకా హత్య జరిగిన రోజు ఉదయం, ఆ తర్వాత కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి మొబైల్‌ నుంచి కృష్ణమోహన్‌రెడ్డి, నవీన్‌ల ఫోన్‌ నంబర్‌లకు ఎక్కువగా కాల్స్‌ వెళ్లినట్లు కాల్‌ డేటా ఆధారంగా గుర్తించిన సీబీఐ..ఇదే విషయమై గత నెల 28న అవినాష్‌ను ప్రశ్నించిన సంగతి తెలిసిందే.. సీఎం జగన్‌, ఆయన సతీమణి భారతితో మాట్లాడేందుకు ఆయా ఫోన్‌ నంబర్లకు కాల్‌ చేసినట్లు ఆయన విచారణలో వెల్లడించిన నేపథ్యంలో కృష్ణమోహన్‌రెడ్డి, నవీన్‌లకు నోటీసులు జారీ చేసి శుక్రవారం విచారించింది. కడప కేంద్ర కారాగారం అతిథిగృహంలో సీబీఐ ఎస్పీ రామ్‌సింగ్‌ నేతృత్వంలోని బృందం వీరిరువురినీ ప్రశ్నించింది. అవినాష్‌ నుంచి తొలి ఫోన్‌ కాల్‌ వచ్చినప్పటి నుంచి ఆ రోజంతా జరిగిన పరిణామాలన్నింటిపైనా ప్రశ్నించింది. ఉదయం 11 గంటలకు విచారణకు హాజరైన కృష్ణమోహన్‌రెడ్డి, నవీన్‌లు సాయంత్రం 5.30 గంటలకు బయటకొచ్చారు. ఈ సందర్భంగా కారాగారం ఎదుట పోలీసులు, నిఘా విభాగం సిబ్బంది పదుల సంఖ్యలో చేరారు. వైకాపా నేతలు కూడా పలువురు అక్కడికి వచ్చారు. సీబీఐ అధికారులు మరికొన్ని రోజుల పాటు కడపలోనే ఉండి పలువురిని విచారించనున్నారు.


సీఎస్‌తో కలిసి కారులో తిరుపతి వైపు..

సీబీఐ విచారణ ముగిసిన అనంతరం.. కృష్ణమోహన్‌రెడ్డి, నవీన్‌లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డితో కలిసి ఆయన వాహనంలోనే తిరుపతి వైపు వెళ్లారు. కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో శుక్రవారం జవహర్‌రెడ్డి పర్యటించారు. ముద్దనూరు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను ఆయన సందర్శించారు. ఈ పర్యటన ముగించుకుని సాయంత్రం 5.30 గంటల తర్వాత ఆయన కడప కేంద్ర కారాగారం సమీపంలోకి చేరుకున్నారు. అదే సమయంలో సీబీఐ విచారణ ముగించుకుని కేంద్ర కారాగారం అతిథిగృహం నుంచి వారిరువురూ బయటకొచ్చారు. అక్కడి నుంచి కొద్దిదూరంలో ఉన్న జవహర్‌రెడ్డి వాహనశ్రేణి వద్దకు చేరుకుని ఆయనతో పాటు కలిసి తిరుపతి వైపు వెళ్లారు. ఇది సంచలనంగా మారింది.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని