ఏప్రిల్‌ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఫోర్టిఫైడ్‌ బియ్యం

రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి ఫోర్టిఫైడ్‌ బియ్యాన్నే సరఫరా చేయనున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తెలిపారు.

Updated : 04 Feb 2023 05:44 IST

మంత్రి కారుమూరి నాగేశ్వరరావు

ఈనాడు డిజిటల్‌, విశాఖపట్నం: రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి ఫోర్టిఫైడ్‌ బియ్యాన్నే సరఫరా చేయనున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తెలిపారు. ఉత్తరాంధ్ర జిల్లాల జాయింట్‌ కలెక్టర్లు, అధికారులతో విశాఖలో శుక్రవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటికే పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలతో పాటు కొన్ని జిల్లాలకు ఫోర్టిఫైడ్‌ బియ్యం ఇస్తున్నామని, ఇకనుంచి అన్ని జిల్లాలకూ ఇస్తామని తెలిపారు. ఫలితంగా రీసైక్లింగ్‌కు అవకాశం ఉందన్నారు. ఇప్పటివరకు రూ.6,165 కోట్ల విలువైన 30.19 లక్షల టన్నుల ధాన్యం కొని, రైతులకు రూ.4,800 కోట్లు చెల్లించామన్నారు. ఈ నెల 15లోగా మిగతా ధాన్యం కొనాలని అధికారులకు సూచించినట్లు తెలిపారు. రాగులు, జొన్నలు కావాలని కార్డుదారులు అడుగుతున్నారని.. ఇకపై రైతుల నుంచీ ఆ పంటలను కొనేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. 16 పురపాలక సంఘాల్లో ప్రయోగాత్మకంగా గోధుమపిండి పంపిణీ చేస్తున్నామని వివరించారు. మిగతా రాష్ట్రాలతో పోల్చితే నిత్యావసరాల ధరలు మన రాష్ట్రంలోనే తక్కువగా ఉన్నాయని, సీఎం యాప్‌ ద్వారా ధరల నియంత్రణను పర్యవేక్షిస్తున్నామన్నారు. సమావేశంలో పౌరసరఫరాల కార్పొరేషన్‌ ఎండీ వీరపాండియన్‌, కమిషనర్‌ అరుణ్‌కుమార్‌, డైరక్టర్‌ విజయసునీత తదితరులు పాల్గొన్నారు.

గెలవలేని వాళ్లే వెళ్లిపోతున్నారు

‘రానున్న ఎన్నికల్లో గెలుపు గుర్రాలకే టికెట్‌ అని జగన్‌ చెప్పారు. సర్వేల్లో గెలవలేరని తెలిసినవాళ్లే వెళ్లిపోతున్నారు. ఏదో ఓ వంక పెట్టుకొని వెళ్లిపోవాలి కనుక వారు అలా వెళ్లిపోతున్నారు. తెలుగుదేశంలోకి వెళ్లిపోతామని లీక్‌ చేసుకొని... మేం లీక్‌ చేశామని ఆరోపిస్తున్నారు’ అని ఉమ్మడి నెల్లూరు జిల్లా ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డిలను ఉద్దేశించి కారుమూరి వ్యాఖ్యానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని