డిసెంబరు నాటికి లడ్డూ తయారీ యంత్రాలు: తితిదే

తిరుమలలో లడ్డూల తయారీకి డిసెంబరు నాటికి రూ.50 కోట్లతో అత్యాధునిక యంత్రాల వ్యవస్థ అందుబాటులోకి వస్తుందని తితిదే ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు.

Updated : 04 Feb 2023 05:52 IST

తిరుమల, న్యూస్‌టుడే: తిరుమలలో లడ్డూల తయారీకి డిసెంబరు నాటికి రూ.50 కోట్లతో అత్యాధునిక యంత్రాల వ్యవస్థ అందుబాటులోకి వస్తుందని తితిదే ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. మ్యూజియాన్ని ప్రపంచంలోనే నం.1 స్థాయిలో భక్తులకు అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు. శుక్రవారం  అన్నమయ్య భవనంలో నిర్వహించిన డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘లడ్డూల తయారీ యంత్రాలను స్విట్జర్లాండ్‌, జర్మనీ, ఆస్ట్రేలియా నుంచి తెస్తున్నాం. అవసరమైన అన్ని పదార్థాలు వేస్తే యంత్రమే లడ్డూలను సిద్ధం చేస్తుంది. రోజూ ఆరు లక్షలు తయారు చేయించవచ్చు. నాణేల వర్గీకరణ, ప్యాకింగ్‌కు జర్మనీ నుంచి రూ.1.2 కోట్లు, రూ.1.25 కోట్లతో వస్తున్న యంత్రాలు ఈ నెల 15 నుంచి 20 తేదీలోపు తిరుమల పరకామణి కేంద్రానికి చేరుకుంటాయి. యువతకు ధార్మిక అంశాలపై శిక్షణ ఇచ్చేందుకు ఈ నెల 5, 6, తేదీల్లో తిరుమల ఆస్థాన మండపంలో యువ ధార్మికోత్సవం నిర్వహిస్తాం. తిరుమలలో అకేషియా చెట్లను తొలగించి వాటి స్థానంలో సంప్రదాయ మొక్కలు పెంచుతాం’అని ఈవో తెలిపారు. జనవరిలో 20.78 లక్షల మంది శ్రీవారిని దర్శించుకోగా.. హుండీ కానుకలు రూ.123.07 కోట్లు వచ్చాయని ధర్మారెడ్డి వెల్లడించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని