ఉద్యోగులు, పెన్షనర్లకు ఇంకా ఎదురుచూపులే!

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ఈ నెలా ఎదురుచూపులు తప్పడం లేదు. రాష్ట్రంలో సగం మందికి పైగా ఉద్యోగులు జనవరి నెల జీతం కోసం ఎదురుచూస్తున్నారు.

Updated : 04 Feb 2023 05:31 IST

కొందరికే చెల్లింపులు

ఈనాడు, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ఈ నెలా ఎదురుచూపులు తప్పడం లేదు. రాష్ట్రంలో సగం మందికి పైగా ఉద్యోగులు జనవరి నెల జీతం కోసం ఎదురుచూస్తున్నారు. అనేక మందికి ఇంకా పింఛను సొమ్ములు దక్కలేదు. ఫిబ్రవరి మూడో తారీకు దాటిపోయింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న నిధుల మేరకు కేవలం కొంత మేర మాత్రమే జీతాలు చెల్లించినట్లు సమాచారం. ఇంతవరకు రూ.1,400 కోట్లు ఉద్యోగులకు జీతాల రూపంలో చెల్లించినట్లు విశ్వసనీయ వర్గాల కథనం. పెన్షనర్లకు రూ.1,100 కోట్ల చెల్లింపులు శుక్రవారం రాత్రి వరకు జరిగాయి. కిందటి నెలలో ఉద్యోగులకు జీతాల రూపంలో రూ.3,700 కోట్లు, పెన్షనర్లకు రూ.2,000 కోట్లు చెల్లించారు. ఈ రకంగా చూస్తే ఇంకా ఎంత మొత్తంలో జీతాలు, పెన్షన్లు పెండింగులో ఉన్నాయో అవగతమవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం కిందటి మంగళవారం రిజర్వుబ్యాంకు నుంచి రూ.1,557 కోట్లు రుణం తీసుకుంది. ఆ మొత్తాలు ఈ నెలలోనే రాష్ట్ర ఖజానాకు చేరుకున్నాయి. దీంతో పాటు రోజువారీ వచ్చే ఆదాయం, ఇవికాక ప్రత్యేక డ్రాయింగ్‌ సదుపాయం, వేస్‌ అండ్‌ మీన్స్‌ తదితరాలు కలిపి రూ.2,700 కోట్ల వరకు వినియోగించుకున్నట్లు తెలిసింది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం రూ.2,000 కోట్ల వరకు ఓవర్‌ డ్రాఫ్ట్‌లో ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో జీతాలు, పెన్షన్లు మొత్తం అన్నీ చెల్లించేందుకు మరికొంత గడువు తప్పదని సమాచారం. వచ్చే మంగళవారం రిజర్వుబ్యాంకు నుంచి బహిరంగ మార్కెట్‌ రుణాలు పొందే అవకాశమూ లేదు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం ఇచ్చిన అనుమతుల మేరకు సంపూర్ణంగా రుణాలు సమీకరించింది. కొత్తగా మరిన్ని అప్పుల కోసం కేంద్రం వద్ద ప్రయత్నాలు సాగిస్తున్నా అవి ఇంకా కొలిక్కి రాలేదని తెలిసింది. వేరే రూపాల్లోనూ రుణాల సమీకరణకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని