Vani Jayaram: మూగబోయిన సుస్వరాల ‘వాణి’

వంటి వేల పాటలకు తన అమృత గాత్రంతో ప్రాణం పోసిన సుమధుర గాయని ఇకలేరన్న వార్త శ్రోతలు, సినీ అభిమానులను విషాదంలోకి నెట్టేసింది.

Published : 05 Feb 2023 05:48 IST

చెన్నైలో కన్నుమూసిన మధురగాయని
19 భాషల్లో వేల పాటలతో శ్రోతలను అలరించిన వాణీజయరాం
న్యూస్‌టుడే, చెన్నై (కోడంబాక్కం)

నేనా... పాడనా పాటా...’ అంటూనే పూజలు చేయ పూలు తెచ్చాను...
దొరకునా ఇటువంటి సేవ...
తెలిమంచు కరిగిందీ తలుపు తీయనా ప్రభూ....
ఆనతినీయరా హరా...
మానస సంచరరే...
మిన్నేటి సూరీడు వచ్చేనమ్మా....
ఒక బృందావనం.... సోయగం...
అందెల రవమిది పదములదా...

వంటి వేల పాటలకు తన అమృత గాత్రంతో ప్రాణం పోసిన సుమధుర గాయని ఇకలేరన్న వార్త శ్రోతలు, సినీ అభిమానులను విషాదంలోకి నెట్టేసింది. ప్రముఖ సినీ గాయని వాణీ జయరాం(78) చెన్నైలో కన్నుమూశారు. శనివారం మధ్యాహ్నం నగరంలోని నుంగంబాక్కంలోని తన గృహంలో తలకు గాయాలు, రక్తస్రావంతో పడి ఉన్న ఆమెను సన్నిహితులు గుర్తించారు. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. థౌజండ్‌లైట్స్‌ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. మంచం నుంచి జారిపడి గాయాలైనందువల్లే ఆమె కన్నుమూసినట్లు పోలీసులు చెబుతున్నారు. దర్యాప్తు కొనసాగుతోంది. ఆమె భర్త జయరాం 2018లో కన్నుమూశారు. పిల్లలు లేకపోయినా సంగీతమే ఆ లోటు తీర్చిందని పలు సందర్భాల్లో చెప్పారు వాణి.

పాట ఏదైనా తనదైన గాత్రం

ఆమె 1945 నవంబరు 30న తమిళనాడులోని వేలూరుకు చెందిన దురైస్వామి, పద్మావతి దంపతులకు జన్మించారు. అసలు పేరు కలైవాణి. చిన్నతనంలోనే శాస్త్రీయ సంగీతంలో పట్టు సాధించడంతో పాఠశాలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా తన ప్రత్యేకతను చాటుకున్నారు. పదేళ్ల వయసులోనే ఆలిండియా రేడియోలో పాటలు పాడే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజల్లోకి వెళ్లారు. దీంతోపాటు నాటకాలు, కవితలు చదివి శ్రోతలను మెప్పించారు. అలా 1970లో ‘గుడ్డీ’ అనే హిందీ చిత్రంలో ‘బోలే రే’ అనే పాటతో గాయనిగా తన ప్రయాణాన్ని ఆరంభించారు. ఆమె పాడిన తొలిపాటే దేశవ్యాప్తంగా ప్రజాదరణ పొందింది. సుశీల, జానకి లాంటి గాయనీమణుల హవా కొనసాగిస్తున్న సమయంలో తనదైన గానంతో అలరించారు వాణి. ‘అభిమానవంతుడు’ చిత్రంలో ‘ఎప్పటివలె కాదురా స్వామి...’ పాటతో తెలుగులో తొలిసారి ఆమె గొంతు వినిపించింది. ఆ తర్వాత ‘ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది’ పాటతో బాగా పాపులర్‌ అయ్యారు. ‘ఏళు స్వరంగల్‌కుళ్‌’, ‘అపూర్వ రాగంగళ్‌’, ‘అండమాన్‌ కాలనీ’, ‘పాదపూజై’ ‘అవన్‌దాన్‌ మణిదన్‌’, ‘రోజాపూ రవిక్కైక్కారి’, ‘మీనవ నన్బన్‌’ లాంటి ఎన్నో చిత్రాల్లో పాటలు పాడి తమిళ ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిరస్థానాన్ని సంపాదించారు. శాస్త్రీయం, జానపదం, బీట్... ఇలా ఏ పాటైనా తన ప్రత్యేకతను చాటుకున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, ఉర్దూ, బెంగాలీ, ఒరియా, ఆంగ్లం వంటి 19 భాషల్లో వేల పాటలు పాడారు. ఏ భాషలో పాడినా ఆ భాషలోని స్పష్టతను గొంతులో పలికించడం వాణీజయరాం ప్రత్యేకత.

మూడు జాతీయ పురస్కారాలు

తన అమృత గాత్రంతో వెండితెరపై రసభరిత గీతాల్ని ఒలికించిన వాణీ జయరాం... తన సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఎన్నో పురస్కారాలు సొంతం చేసుకున్నారు. 1976లో వచ్చిన తమిళ చిత్రం ‘అపూర్వ రాగంగళ్‌’తో ఉత్తమ గాయనిగా తొలి జాతీయ పురస్కారాన్ని అందుకున్న ఆమె.. ఆ తర్వాత ‘శంకరాభరణం’లోని మానస సంచరరే, ‘స్వాతికిరణం’లోని ఆనతి నీయరా హరా గీతాలతో మరో రెండు జాతీయ అవార్డుల్ని దక్కించుకున్నారు. ఇక ఫిల్మ్‌ఫేర్‌ సహా మరెన్నో ప్రతిష్ఠాత్మక పురస్కారాలు అందుకున్న వాణీకి ఇటీవలే కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్‌ పురస్కారం ప్రకటించింది. కానీ, ఆమె దాన్ని అందుకోకుండానే తుది శ్వాస విడవడం విచారకరం.


వాణీ జయరాం మృతిపై ప్రధాని, సీఎం సంతాపం

ఈనాడు, హైదరాబాద్‌: ప్రముఖ గాయని వాణీ జయరాం మృతిపై ప్రధాని మోదీ తీవ్ర సంతాపం వ్యక్తంచేశారు. ఆమె మరణం సృజన ప్రపంచానికి తీరని లోటని ట్వీట్‌ చేశారు. వాణీ జయరాం మృతిపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.  వేల పాటలు పాడిన వాణీ జయరాం మరణం భారత సినీ పరిశ్రమకు, సంగీత ప్రపంచానికి తీరని లోటని అన్నారు. మంత్రులు కేటీఆర్‌, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, శ్రీనివాస్‌గౌడ్‌, ఇంద్రకరణ్‌రెడ్డి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తదితరులు వాణీ జయరాం మృతిపై సంతాపం తెలిపారు.

పాడిన తొలిపాటకే అయిదు అవార్డులు సాధించడమే కాకుండా మూడుసార్లు జాతీయ ఉత్తమ గాయనిగా వాణీజయరాం గుర్తింపు పొందారని ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి, ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ సంతాప సందేశంలో పేర్కొన్నారు. వాణీజయరాం మృతికి తెదేపా అధినేత చంద్రబాబు సంతాపం తెలియజేశారు. ‘మధురగాయని ఆత్మకు శాంతి చేకూరాలి. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’ అని శనివారం ట్వీట్‌ చేశారు. వాణీజయరామ్‌ ఆకస్మిక మరణం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని