మిరప రైతుకు మొండిచేయి

కరవు, వరద, తెగుళ్లు.. మరేదైనా కారణంతో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం మూడేళ్లుగా తోడుగా నిలుస్తోంది. రైతు నష్టపోతే ఆ కుటుంబమే కాదు, రాష్ట్రమంతా నష్టపోతుంది.

Published : 05 Feb 2023 05:40 IST

గతేడాది నష్టానికీ సాయం శూన్యం
ఈ ఏడాదీ నల్లతామరతో నష్టాలు
నష్టం అంచనాలపైనా దృష్టిపెట్టని ప్రభుత్వం

కరవు, వరద, తెగుళ్లు.. మరేదైనా కారణంతో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం మూడేళ్లుగా తోడుగా నిలుస్తోంది. రైతు నష్టపోతే ఆ కుటుంబమే కాదు, రాష్ట్రమంతా నష్టపోతుంది.

2022 జూన్‌ 14న శ్రీ సత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లిలో పంటల బీమా విడుదల సందర్భంగా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి.

* సీఎం ఇచ్చిన ఈ భరోసా ఆచరణలో విఫలమైంది. మిరప రైతులు గతేడాది నల్లతామరతో నిండా మునిగినా, ఎకరాకు రూ.లక్షకు పైగా నష్టపోయినా.. నిబంధనలు అంగీకరించవంటూ ప్రభుత్వం వారికి సాయం చేయలేదు. పెట్టుబడి రాయితీ ఇవ్వలేదు. అందరికీ ఉచిత పంటల బీమా కూడా ఇవ్వలేకపోయింది. ఈ ఏడాదీ నల్లతామరతో నష్టాలు మొదలైనా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.

మిరప రైతు భవిష్యత్తు.. రెండేళ్లుగా గాలిలో దీపంగా మారింది. మరోవైపు సర్కారు నుంచి భరోసా కొరవడింది. 2021-22లో రాష్ట్రవ్యాప్తంగా దిగుబడులు పడిపోయి, ఎకరాకు రూ.లక్షకుపైగా పెట్టుబడులు నష్టపోయినా పట్టించుకోలేదు. చీడపీడలతో నష్టం వస్తే సాయం చేయడానికి నిబంధనలు వర్తించవంటూ ప్రభుత్వం గతేడాది కాడి కింద పడేసింది. రైతుల్ని ఆదుకోవాలంటూ కేంద్రానికి లేఖ రాసి.. అంతటితోనే సరిపెట్టుకుంది. ఈ ఏడాదీ నల్లతామర విరుచుకుపడుతోంది. అరకొర కాపు వచ్చినా నాణ్యత లేదు. ఎకరాకు రూ.3లక్షలకు పైగా పెట్టుబడి అవుతుంటే.. సగమైనా దక్కుతుందో లేదో అని రైతులు వాపోతున్నారు. అయినా పంటనష్టం అంచనాలు రూపొందించే ఆలోచనే ప్రభుత్వం చేయడం లేదు.

2021-22 ఖరీఫ్‌లో మిరప సాగు పెరిగినా.. ఉత్పత్తి తగ్గింది. నల్లతామర కారణంగా ఎన్నడూ చూడని నష్టం ఎదురైంది. ఎకరానికి సగటున 7.18 క్వింటాళ్ల దిగుబడే వచ్చింది. మిరప సాగు చేసిన రాష్ట్రాల్లో 40% నుంచి 80% వరకు పంటనష్టం జరిగి ఉంటుందని అప్పట్లో కేంద్రం రాజ్యసభలో తెలిపింది. రాష్ట్రంలో మొత్తం 5.60లక్షల ఎకరాల్లో మిరప సాగైతే 24% విస్తీర్ణంలో దెబ్బతిన్న పంటకే అరకొర బీమా పరిహారం అందింది. చీడపీడల నష్టాన్ని గుర్తించనే లేదు. కేంద్రం పేర్కొన్నట్లు సాగు విస్తీర్ణంలో సగటున 60% పంటపోయినా.. రైతులు ఎకరాకు రూ.లక్ష చొప్పున పెట్టుబడి నష్టపోయినట్లు తెలుస్తోంది. అంటే సుమారు రూ.3,360 కోట్ల మేర పెట్టుబడులను కోల్పోయారు.


తాలుగా మారుతున్న మిరప..

ఈ ఏడాది మిరపలో నల్లతామర ఉద్ధృతి పెరిగింది. గతేడాది నవంబరులో కురిసిన వర్షాలకు పడిన పిందె కాస్త తాలుగా మారుతోంది. సాధారణంగా 5 క్వింటాళ్లకు 50కిలోలు తాలు వస్తేనే ఎక్కువ. అదీ.. ఇప్పుడు 2 క్వింటాళ్ల తాలు వస్తోందని రైతులు ఆవేదన చెందుతున్నారు. గుంటూరు యార్డుకు వస్తున్న మిరపలోనూ తాలు శాతం పెరిగిందని వ్యాపారులు పేర్కొంటున్నారు. గతేడాది అప్పుల నుంచి బయటపడని రైతులు, మళ్లీ పెద్దమొత్తంలో అప్పు తెచ్చి పెట్టుబడి పెట్టారు. అందులో సగం కూడా చేతికి వచ్చే పరిస్థితి లేక తీవ్ర ఆందోళన చెందుతున్నారు.


పంజాబ్‌లో పత్తి రైతును ఆదుకున్నారు..

పంజాబ్‌లో గతేడాది గులాబీ పురుగు కారణంగా పంట నష్టపోయిన పత్తి రైతులకు అక్కడి ప్రభుత్వం ఎకరాకు గరిష్ఠంగా రూ.17వేల చొప్పున పరిహారం ఇచ్చింది. అక్కడ గతంలో తెల్లదోమతో జరిగిన పంట నష్టానికీ సాయం అందించారు. మన రాష్ట్రంలోనూ 2016-17 రబీలో వైరస్‌ కారణంగా మినుము నష్టపోయినప్పుడు.. 98 వేల మంది రైతులకు అప్పటి ప్రభుత్వం రూ.68.68 కోట్ల పెట్టుబడి రాయితీని అందించింది. ఇలా రైతుల్ని ఆదుకోవచ్చనే ఆలోచన ప్రస్తుత ప్రభుత్వంలో కొరవడింది.


ఈనాడు, అమరావతి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు