వ్యసన విముక్తి పేరుతో అనైతిక వ్యాపారం

మద్యం వ్యసనం నుంచి విముక్తి కల్పిస్తామంటూ అనైతిక వ్యాపారానికి పాల్పడినందున బాధితుడికి రూ.5 లక్షల పరిహారం చెల్లించాలని సికింద్రాబాద్‌కు చెందిన సెరినిటీ ఫౌండేషన్‌ను రాష్ట్ర వినియోగదారుల కమిషన్‌ ఆదేశించింది.

Updated : 05 Feb 2023 05:36 IST

రూ.5 లక్షల పరిహారం చెల్లించండి
సెరినిటీ ఫౌండేషన్‌కు రాష్ట్ర వినియోగదారుల కమిషన్‌ ఆదేశం

ఈనాడు, హైదరాబాద్‌: మద్యం వ్యసనం నుంచి విముక్తి కల్పిస్తామంటూ అనైతిక వ్యాపారానికి పాల్పడినందున బాధితుడికి రూ.5 లక్షల పరిహారం చెల్లించాలని సికింద్రాబాద్‌కు చెందిన సెరినిటీ ఫౌండేషన్‌ను రాష్ట్ర వినియోగదారుల కమిషన్‌ ఆదేశించింది. ఖర్చుల కింద మరో రూ.20 వేలు చెల్లించాలంటూ ఇటీవల తీర్పు వెలువరించింది. బెంగళూరులో ఉద్యోగం చేసే ఆర్‌.విజయ్‌కుమార్‌ మద్యానికి బానిస కావడంతో కుటుంబ సభ్యులు ఆ ఫౌండేషన్‌ గురించి తెలిసి 2013లో అందులో చేర్పించారు. వైద్యపరీక్షల నిమిత్తం రూ.63 వేలదాకా చెల్లించారు. వారు ఎప్పుడు వెళ్లినా బాధితుడిని కలవడానికి ఓ పట్టాన అనుమతించే వారు కాదు. అనుమతించినా అక్కడి లోటుపాట్లపై ఫిర్యాదు చేయకుండా పక్కనే ఓ కౌన్సెలర్‌ ఉండి బెదిరించేవారు. ఫౌండేషన్‌లో జరుగుతున్న దారుణాల గురించి మరో వ్యక్తి ద్వారా తెలుసుకుని ఓ పుట్టిన రోజు వేడుకల పేరుతో కుటుంబ సభ్యులు విజయ్‌కుమార్‌ను ఇంటికి తీసుకొచ్చారు. అక్కడ తనను ఎలా చిత్రహింసలకు గురి చేసిందీ ఆయన బయట పెట్టారు. దీనిపై ఆయన తండ్రి పోలీసులకు, తెలంగాణ మెడికల్‌ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేశారు. సరైన సేవలు అందించకపోవడంతో రూ.25 లక్షలు పరిహారం చెల్లించేలా ఆదేశాలు జారీ చేయాలంటూ విజయ్‌కుమార్‌ రాష్ట్ర వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. సభ్యులు వి.వి.శేషుబాబు, ఆర్‌.ఎస్‌.రాజెశ్రీలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టి ఇటీవల తీర్పు వెలువరించింది. ఫౌండేషన్‌కు 2014దాకా అనుమతులు ఉన్నాయని, 10 మందికి అనుమతి తీసుకుని ఎక్కువ మందిని చేర్చుకున్న విషయం విచారణలో వెల్లడైందని పేర్కొంది. రెగ్యులర్‌ సైకియాట్రిస్ట్‌, తగినంతమంది డాక్టర్లు లేకపోవడం వంటివి సేవాలోపాలేనని, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఫౌండేషన్‌ అనైతిక వ్యాపారం చేస్తోందని పేర్కొంది. ఫిర్యాదుదారుకు రూ.5 లక్షల పరిహారం, ఖర్చుల కింద రూ.20 వేలు చెల్లించాలని ఆదేశించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు