నైపుణ్యంతోనే వృత్తిలో రాణింపు

న్యాయసూత్రాలపై విశేష నైపుణ్యం సాధిస్తేనే న్యాయవాదులుగా రాణించేందుకు అవకాశం ఉంటుందని జూనియర్‌ న్యాయవాదులకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఆకుల వెంకట శేషసాయి సూచించారు.

Published : 05 Feb 2023 04:54 IST

హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వెంకట శేషసాయి

నరసాపురం, న్యూస్‌టుడే: న్యాయసూత్రాలపై విశేష నైపుణ్యం సాధిస్తేనే న్యాయవాదులుగా రాణించేందుకు అవకాశం ఉంటుందని జూనియర్‌ న్యాయవాదులకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఆకుల వెంకట శేషసాయి సూచించారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం, పాలకొల్లు బార్‌ అసోసియేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో నరసాపురం వైఎన్‌ కళాశాల సెమినార్‌ హాల్లో ఆంధ్రప్రదేశ్‌ బార్‌ అసోసియేషన్‌ ఛైర్మన్‌ గంటా రామారావు అధ్యక్షతన శనివారం యువన్యాయవాదులకు నిర్వహించిన కార్యశాలకు పలువురు హైకోర్టు న్యాయమూర్తులతో కలిసి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడారు. బెంచ్‌, బార్‌ అసోసియేషన్లకు మధ్య సమన్వయం ఉండాలని సూచించారు. న్యాయవాదులు లా పుస్తకాలు చదువుతూనే జనరల్‌ నాలెడ్జ్‌, చరిత్రలపై అవగాహన, వ్యవస్థలు పనిచేసే విధానాలు, వాటిలోని లోపాల గురించి తెలుసుకోవాలని తెలిపారు. నరసాపురం బార్‌కౌన్సిల్‌కు చెందిన సీనియర్‌ న్యాయవాది జీవీకే రామారావు తమకు ఆదర్శమన్నారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ మానవేంద్రనాథ్‌రాయ్‌ క్రిమినల్‌ కేసుల్లో 138 ఎన్‌ఐ యాక్టు, వరకట్న వేధింపులు, నిందితులు, ఫిర్యాదుదారులకు చట్టం కల్పించిన హక్కులపై అవగాహన కల్పించారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ జయసూర్య న్యాయవాదులు వృత్తిలో పాటించాల్సిన నియమాలు, అనుభవజ్ఞుల వద్ద నైపుణ్యం పెంపొందించుకోవడంపై వివరించారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సుబ్బారెడ్డి సివిల్‌కోర్టుల్లో దావాలు దాఖలుచేసే విధానాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా బార్‌ అసోసియేషన్ల ఆధ్వర్యంలో న్యాయమూర్తులకు ఆత్మీయ సత్కారం చేశారు. ఆయా కార్యక్రమాల్లో పలువురు న్యాయమూర్తులు, బార్‌ అసోసియేషన్ల అధ్యక్షులు కామన బాలసత్యనారాయణ, గంధం వెంకటసుబ్బారావు, పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు