రామోజీ ఫౌండేషన్‌ ద్వారా రూ.89 కోట్లతో అభివృద్ధి పనులు

రామోజీ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో కార్పొరేట్‌ సామాజిక బాధ్యత కింద ఇప్పటివరకూ రూ. 89 కోట్లు ఖర్చుచేసి తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధి పనులు చేపట్టామని మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ ఎండీ సీహెచ్‌.శైలజాకిరణ్‌ చెప్పారు.

Updated : 06 Feb 2023 05:58 IST

మాతృభూమి, మాతృభాష అంటే రామోజీరావుకు అమితమైన ప్రేమ
ఆయన జన్మించిన పెదపారుపూడిని రూ.16.50 కోట్లతో అభివృద్ధి చేశాం
మున్ముందు మరిన్ని సదుపాయాలు: శైలజాకిరణ్‌
రూ.3.50 కోట్లతో నిర్మించిన భవనాల ప్రారంభం

ఈనాడు, అమరావతి: రామోజీ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో కార్పొరేట్‌ సామాజిక బాధ్యత కింద ఇప్పటివరకూ రూ. 89 కోట్లు ఖర్చుచేసి తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధి పనులు చేపట్టామని మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ ఎండీ సీహెచ్‌.శైలజాకిరణ్‌ చెప్పారు. రామోజీ గ్రూప్‌ ఛైర్మన్‌ రామోజీరావు జన్మస్థలమైన కృష్ణాజిల్లా పెదపారుపూడి గ్రామాన్ని 2015లో దత్తత తీసుకుని.. ఇప్పటివరకూ రూ.16.50 కోట్లు వెచ్చించి పలు అభివృద్ధి కార్యక్రమాలు, నిర్మాణాలు చేపట్టామన్నారు. గ్రామస్థులు కోరినట్లుగా ఇక్కడ మున్ముందు మరిన్ని సదుపాయాలు కల్పిస్తామన్నారు. రూ.3.50 కోట్లతో నిర్మించిన ప్రాథమిక పాఠశాల, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం, పశువైద్యశాల భవనాలను ఆదివారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘‘మాతృభూమి, మాతృభాష అంటే రామోజీరావుకు అమితమైన ప్రేమ. ప్రజాహితమే ఆయన జీవనశైలి. ఆయన జీవితంలో ఏ పనైనా సరే... ప్రజలు బాగుండాలనే ఉద్దేశంతోనే చేశారు. సర్వేజనా సుఖినోభవంతు అనేదే ఆయన జీవన విధానం. ఆయన పుట్టిన ఊరు రుణం తీర్చుకోవటానికి అవకాశం కల్పించినందుకు పెదపారుపూడి గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు. ఆదర్శవంతమైన, అందమైన, ఆనందభరితమైన గ్రామంగా పెదపారుపూడి ఉండాలని కోరుకుంటున్నా’’ అని శైలజాకిరణ్‌ అన్నారు.

సదుపాయాలు సద్వినియోగం చేసుకోవాలి

‘‘గ్రామంలో రక్షిత మంచినీటి పథకం నిర్మించాం. ఇంటింటికీ కుళాయి, ఆర్వో శుద్ధజల కేంద్రాలు ఏర్పాటుచేశాం. శ్మశానవాటికల మెరుగుదల, అంతర్గత సీసీ రహదారుల నిర్మాణం చేపట్టాం. చెరువు ఆధునికీకరణ, సుందరీకరణ, మండలస్థాయి కార్యాలయాలకు వెళ్లే రహదారి విస్తరణ, సుందరీకరణ చేపట్టాం. అంగన్‌వాడీ కేంద్రం, వీఆర్వో కార్యాలయం, స్త్రీశక్తి భవనాలు నిర్మించాం. గృహనిర్మాణం చేపట్టాం. ప్రాథమిక, ఉన్నత పాఠశాల్లో మౌలికవసతుల కల్పనతో పాటు బల్లలు, ఫ్యాన్లు తదితర సౌకర్యాలు ఏర్పాటుచేశాం. రూ.13 కోట్లు వెచ్చించి నిర్మించిన వీటన్నింటినీ ఇదివరకే ప్రారంభించి ప్రజలకు అంకితం చేశాం. తాజాగా ఇప్పుడు రూ.3.50 కోట్లతో నిర్మించిన భవనాలను ప్రారంభించాం’’ అని శైలజాకిరణ్‌ చెప్పారు. రామోజీ ఫౌండేషన్‌ కల్పిస్తున్న ఈ సదుపాయాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇక్కడున్నవారంతా బాగా చదువుకుని ఉన్నతస్థాయికి రావాలనేది రామోజీరావు ఆకాంక్ష అని తెలిపారు. కార్పొరేట్‌ సామాజిక బాధ్యత కిందే కాకుండా.. అంతకుముందూ రామోజీరావు పలుచోట్ల చాలా అభివృద్ధి పనులు చేపట్టారని తెలిపారు. ఏఎన్‌ఆర్‌ కళాశాల స్వర్ణోత్సవాన్ని పురస్కరించుకుని.. అప్పట్లోనే రూ.10 లక్షలు విరాళమిచ్చి ఆయన తల్లిదండ్రుల పేరిట భవనాన్ని నిర్మించారని చెప్పారు. తెలంగాణలోని నాగన్‌పల్లి గ్రామాన్నీ రామోజీ ఫౌండేషన్‌ దత్తత తీసుకుని పంచాయతీ కార్యాలయం, ఉన్నతపాఠశాల, అగ్నిమాపక కేంద్రం, పోలీసుస్టేషన్‌ భవనాలు నిర్మించిందని అన్నారు. ఎక్కడ ఏది అవసరమో.. అది చేస్తున్నామని తెలిపారు.

నలుగురికి మంచి చేయాలనే రామోజీరావు చెబుతుంటారు

‘‘వ్యాపారమనేది ప్రజలకు మంచి చేసేలా ఉండాలి.. నాణ్యమైన సేవల్ని అందించాలి, నాణ్యమైన వస్తువుల్ని అమ్మాలి. నలుగురికి మంచి చేయాలనే రామోజీరావు మాకు ఎప్పుడూ చెబుతుంటారు. నన్ను ఆయన ఈ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా పంపించారు. అందరికీ అభినందనలు, పిల్లలకు ఆశీస్సులు తెలిపారు’’ అని శైలజాకిరణ్‌ వివరించారు. ఈనాడు, రామోజీ ఫిల్మ్‌సిటీలకు గతంలో ఎండీగా పనిచేసిన అట్లూరి రామ్మోహన్‌రావు రామోజీ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో చేపట్టే కార్యక్రమాల రూపకల్పన, ఆచరణలో ఎంతో కృషిచేశారని, ఆయన మన మధ్య లేకపోవటం బాధాకరమని అన్నారు.


రామోజీరావు జన్మించిన గ్రామానికి సర్పంచి కావడం గర్వంగా ఉంది

రామోజీరావు జన్మించిన గ్రామానికి సర్పంచిగా ఎన్నికవ్వడం తనకు గర్వకారణంగా ఉందని పెదపారుపూడి సర్పంచి సమీర అన్నారు. రామోజీరావు ఒక బ్రాండ్‌ అని కొనియాడారు. ఆయన ఓ తండ్రిలా వెన్నంటే ఉంటూ అభివృద్ధికి సాయం అందిస్తున్నారని తెలిపారు. పీఏసీఎస్‌ ఛైర్మన్‌ టి.కోటేశ్వరరావు మాట్లాడుతూ సహకార సంఘానికి భవనం నిర్మించి ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్పారు. గ్రామపెద్ద పి.చంద్రశేఖర్‌రావు మాట్లాడుతూ.. రామోజీరావు గ్రామాన్ని సొంత బిడ్డలా చూసుకుంటూ అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. మాజీ ఎంపీపీ కాజ విజయలక్ష్మి మాట్లాడుతూ.. రామోజీరావు జన్మించటం పెదపారుపూడికి ఒక వరమన్నారు.ఈ కార్యక్రమంలో రామోజీ ఫిల్మ్‌సిటీ డైరెక్టర్‌ ఎం.శివరామకృష్ణ, పెదపారుపూడి సర్పంచి సీహెచ్‌.సమీర, పీఏసీఎస్‌ ఛైర్మన్‌ టి.కోటేశ్వరరావు, మాజీ ఎంపీపీ కాజ విజయలక్ష్మి, గ్రామపెద్దలు పి.చంద్రశేఖరరావు తదితరులు మాట్లాడారు.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని